మహాభారతంలో కృష్ణునికి సంబంధించిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కురుక్షేత్రంలో జరిగిన అధర్మాలను గమనించినప్పుడు కృష్ణుడే వాటిని సమర్ధించటం మనల్ని కొంచెం అయోమయ స్థితిలో పడవేస్తుంది. మహాభారతగాధలో ఈ సంఘటనలకు గల కారణాలను గుర్తిస్తే కృష్ణుని చర్యలు స్పష్టంగా బోధపడతాయి.

ప్రశ్న: మహాభారతంలో ఆమూలాగ్రం కృష్ణుడు ధర్మాధర్మాల గురించి ప్రసంగిస్తుంటాడు. భీష్మ ద్రోణాదివీరులను పడగొట్టేందుకు, ఇతర వీరుల వధ విషయంలోను కృష్ణుడు కపోపాయాలనే ప్రయోగించాడు.  అతడు దేనిని బోధించాడో (ధర్మాన్ని) ఆ మార్గాన్ని అనుసరించలేదా?

యుద్ధంలోని కొన్ని సంఘటనలు

యుద్ధ రంగంలో కృష్ణుని ప్రవర్తన కేవలం మోసం మాత్రమే కాదు. అది ద్రోహం అని కూడా అనవచ్చు. (ఇందుకు కారణాలు ఏమిటై ఉంటాయి?) యుద్ధంలో వీరులు అభేద్యమైన వ్యూహాలనెన్నినో పన్ని శత్రువులను ఎదురుకుంటారు. అటువంటి వ్యూహాలలో చక్రవ్యూహం లేక పద్మవ్యూహం కూడా ఒక్కటి. పద్మవ్యూహంలోని చిక్కుముడులను దాటుకుని దాన్ని ఛేదించి లోపలకు చొరబడటం అందరికీ సాధ్యంకాదు. పాండవులలో ఒకడైన అర్జునునికి మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించే మార్గం తెలుసు. అర్జునుని కుమారుడైన అభిమన్యుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి చొచ్చుకుపోయే విధానం తెలుసుకున్నాడు. ఒకనాడు గర్భవతి అయిన సుభద్రతో అర్జునుడు పద్మవ్యూహాన్ని గురించి ప్రస్తావిస్తూ వ్యూహంలోనికి ఏ విధంగా ప్రవేశించగలరో వివరించాడు. ఆ విషయం మొత్తాన్ని గర్భస్థ శిశువుగా ఉన్న అభిమన్యుడు గ్రహించాడు. కాని కారణాంతరాల వల్ల అర్జునుడు వ్యూహం లోనించి తిరిగి ఎలా బయటకు రావాలో చెప్పకుండా ఆ ప్రసంగాన్ని ముగించేసాడు. కొన్ని సంవత్సరాల తరువాత సంభవించిన కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు అర్జునుడు మరొక చోట యుద్ధం చేస్తున్న సమయంలో, పాండవసేనను నాశనం చేసేందుకు పద్మవ్యూహాన్ని నిర్మింప చేసాడు. యుధిష్ఠిరునికి గాని ఇతర పాండవ  వీరులకు గాని వ్యూహాన్ని ఛేదించే మార్గం బోధపడలేదు.

పద్మవ్యూహాంలోనికి ప్రవేశించటం తెలిసిన మహా వీరుడు, పదిహేడు సంవత్సరాల యువకుడైన అభిమన్యుడు తాను వ్యూహం ఛేదించి ముందుకు పోగలనని మిగిలిన వీరులను  తనను అనుసరించి రమ్మని సిద్ధమౌతాడు. సంధించిన  బాణంలా వ్యూహంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోతాడు. ధర్మరాజు, భీముడు అతడిని అనుసరించి వెంట వెళ్ళినా, వ్యూహం తిరిగి దట్టమై కమ్ముకోగా వారు అభిమన్యునికి సహాయంగా లోనికి ప్రవేశించలేకపోతారు. అభిమన్యుడు ఒంటరిగానే కౌరవవీరులెందరినో పద్మవ్యూహం మధ్య వధిస్తాడు. అతడి రథం కూలిపోతుంది.  ఆయుధాలు శిథిలమైపోతాయి. అతడొక రథ చక్రాన్ని ఆయుధంగా తీసికొని శుత్రువులను ఎదురుకొంటాడు. అభిమన్యుని వలన సంభవిస్తున్న  నష్టాన్ని గమనించిన కౌరవులు అభిమన్యుని వధించక తప్పదని భావిస్తారు. ఒంటరిగా పోరాడే వీరుని, అనేక మంది ఎదుర్కొని యుద్ధం చేయటం, వధించటం యుద్ధనీతికి విరుద్ధం. అది అధర్మం. అయినప్పటికీ కౌరవపక్షంలోని దుర్యోధనాది వీరులు, ద్రోణుడు మొదలైన వారందరు ఒక్కమారుగా అభిమన్యుని అన్ని వైపుల నుంచి ఎదుర్కొని వధిస్తారు.

సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయరాదని యుద్ధనీతి. సాయంత్రం కాగానే యుద్ధసమాప్తి భేరీ మోగించాక ఎవరూ యుద్ధం చేయరాదు. అదే నియమంతో,  సాయంకాలం యుద్ధరంగం నుంచి అర్జునుడు తమ విడిది చేరుకుంటాడు. తమ వారంతా శోకమూర్తులై విషాదంలో మునిగి ఉండటం గమనిస్తాడు. అభిమన్యుడు వధింపబడిన విషయం అతడికి తెలుస్తుంది. అజేయుడైన అభిమన్యుడు కౌరవుల చేతులలో ఏ విధంగా వధింపబడ్డాడో విన్న అర్జునుడు క్రోధమూర్తియై ప్రతిజ్ఞ చేస్తాడు.

రేపు సూర్యాస్తమానం లోగా జయద్రథుని (సైంధవుని) వధిస్తాను, అలా చేయనిచో నేను ప్రాణత్యాగం చేస్తాను 

''రేపు సూర్యాస్తమానం లోగా జయద్రథుని (సైంధవుని) వధిస్తాను, అలా చేయనిచో నేను ప్రాణత్యాగం చేస్తాను'' (సైంధవుడు శివుని వరం చేత ధర్మరాజు, భీములను పద్మవ్యూహంలో చొరనీయకుండా అడ్డుకుంటాడు)

ఈ వార్త విన్న దుర్యోధనుడు పరమానందభరితుడౌతాడు. ఎందుకంటే రేపొక్కరోజు సైంధవుని కాపాడితే చాలు, అర్జునుడు సైంధవుని వధించలేక తానే చనిపోతాడు.. అర్జునుడు ఆడిన మాట తప్పడు' అనుకుంటాడు. కాని జయద్రథుడు భయభ్రాంతుడౌతాడు. తాను 'యుద్ధరంగం వదలి నగరానికి వెళ్ళి పోతానని' సిద్ధమౌతాడు. 'అలా యుద్ధరంగం నుంచి తొలగిపోవటం అమర్యాద అనీ, అది వీరుని లక్షణం కాదని' దుర్యోధనుడు సైంధవుని సమాధానపరుస్తాడు ''భయపడవద్దు, మేము అంతా కలిసి రేపు నీవు అర్జునుని కంటపడకుండా కాపాడుతాము'' అని ధైర్యం చెప్తాడు.

మరునాడు మరొక వ్యూహం పన్ని, జయద్రథుని మధ్యలో ఉంచి కాపాడుతారు. అర్జునుడు ఆ వ్యూహాన్ని సమీపించకుండా చేయాలని కౌరవవీరులలో కొందరు అతడితో యుద్ధం చేస్తుంటారు. అర్జునుడు  వ్యూహాన్ని ఛేదించి జయద్రథుని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అర్జునుడు వ్యూహాన్ని ఛేదించి జయద్రథుని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అతడిని వధించాలి, లేనిచో తాను మరణించక తప్పదు.

కృష్ణార్జులకు స్నేహితుడైన సాత్యకి మరొక ప్రక్క భూరిశ్రవుడనే వృద్ధ వీరునితో యుద్ధం చేస్తుంటాడు. సాత్యకి యుద్ధరంగంలో యుధిష్ఠిరునికి రక్షకునిగా ఉండాలనేది ఏర్పాటు చేసుకున్న నియమం, యుద్ధరంగంలో భూరిశ్రవుడు ఎదురవగానే, అతని యందు పగతో ఉన్న సాత్యకి అతడిని ఎదుర్కొంటాడు.యుధిష్ఠిరుడు అంగరక్షకుడు లేకుండా పోరాడుతుండటం  అర్జునుడు చూస్తాడుగాని, అతడి లక్ష్యం జయద్రథ వధ. భూరి శ్రవుడు సాత్యకిని రథం మీదనుండి పడవేస్తాడు. కత్తి ధరించి సాత్యకిని వధించేందుకు సిద్ధమై అతడి గుండెలపైన కాలుపెడతాడు. కృష్ణుడు ఇది చూస్తాడు. సాత్యకి కృష్ణునికి అత్యంత ప్రియమైన మిత్రుడు, వీరుడు. అతడి సామర్థ్యం, బలహీనతలు కృష్ణునికి తెలుసు. భూరిశ్రవుని జయించటం సాత్యకికి సాధ్యం కాదని కూడా కృష్ణునికి తెలుసు.

వెంటనే కృష్ణుడు అర్జునుని చూసి, ''భూరిశ్రవుడు సాత్యకిని వధించేందుకు సిద్ధపడ్డాడు. నీవు వెంటనే అతడిని అడ్డగించు'' అంటాడు. అర్జునుడు ''అది ఎలా సాధ్యం, వారిద్దరు యుద్ధం చేస్తుండగా, నేను మధ్య చొరబడటం క్షత్రియ ధర్మం కాదు'' అని సమాధానమిస్తాడు. వారి మధ్య వాదం జరుగుతుండగానే భూరి శ్రవుడు సాత్యకి కంఠంపైన కత్తిని ఉంచుతాడు.

''సాత్యకి మీకోసం  యుద్ధం చేసేందుకు వచ్చాడు. అతడు  ఆపదలో  ఉన్నప్పుడు కాపాడకపోవటం ఎటువంటి ధర్మం?'' కృష్ణుని ప్రశ్నతో అర్జునుడు ఆయుధం ప్రయోగించి భూరిశ్రవుని చేతిని ఖండిస్తాడు, కత్తితో సహా చేయి ఎగిరి భూమిపై పడుతుంది. చుట్టూ చూసిన భూరిశ్రవుడు తనపై ఆయుధం ప్రయోగించినది అర్జునుడని గ్రహించి ''నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నన్ను గాయపరిచావు. ఇదెక్కడి ధర్మం? ఇటువంటి పని పిరికివాడు చేస్తాడుగాని క్షత్రియవీరుడైనవాడు చేయడు. ఈ గోపాలుడే నిన్నీపనికి ప్రోత్సహించి ఉంటాడు" అని అంటాడు.  తన రథం వైపు వెళ్ళిపోతాడు.

భూరిశ్రవుని మాటలకు అర్జునుడు క్రోధమూర్తి అయి ''ఓ మహావీరుడా నిన్నటి రోజున అనేకమందికలిసి నా కుమారుని 17 సం||ల బాలుని వధిస్తుండగా నీవు కూడా వారితో చేరి వెనక నుంచి గాయపరచావు. అప్పుడు నీ క్షత్రియ ధర్మం ఏమైంది?'' అని అడుగుతాడు. సిగ్గుతో భూరిశ్రవుడు తలవంచకుంటాడు.

''కంఠం తెగిపోతుందనుకున్న సాత్యకికి కొన్ని క్షణాలకు తెలివి వచ్చి జరిగినది తెలిస్తుంది.

రథం మీద ఉన్న భూరిశ్రవుని చూస్తాడు. తెగిపడి ఉన్న అతని చేతిలోని కత్తిన తీసుకుని వేగంగా భూరిశ్రవుని రథంవైపు కదులుతాడు. 'వద్దు వద్దు' అంటూ కృష్ణార్జునులు వారిస్తున్నా వినక వేగంగా వెళ్ళి యోగాసనంలో ఉన్న భూరిశ్రవుని శిరస్సు ఖండిస్తాడు. అర్జునుడు విభ్రాంతుడైపోతాడు. కృష్ణుడు సిగ్గుతో తలవంచుకుాండు. సాత్యకి ప్రతీకారం తీర్చుకున్నందుకు విజయగర్వంతో పొంగిపోతాడు.

మొదట ధర్మబద్ధమైన యుద్ధంగా మొదలైనప్పటికీ ధర్మం భగ్నమై  యుద్ధం కొనసాగింది 

రోజులు గడుస్తూ యుద్ధం కొనసాగుతుంటే క్రమంగా ధర్మం బలహీనపడింది. మొదట ధర్మబద్ధమైన యుద్ధంగా మొదలైనప్పటికీ ధర్మం భగ్నమై  యుద్ధం కొనసాగింది. (అధర్మచర్యలు అభిమన్యువధతో ప్రారంభమైనాయి. ఆ తరువాత ఒకరిని చూసి  ఒకరు అధర్మాలను కొనసాగించారు) పదిహేను రోజులు గడిచేసరికి శత్రువును ఏదో ఒక విధంగా చంపుకోవటం లక్ష్యంగా యుద్ధం పరిణమించింది. యుద్ద నియమాలు భగ్నమై పోయాయి.

అర్జునుడు జయద్రథుని వధించుట:

అర్జునుడు జయద్రథుని వైపు దూసుకుని పోసాగాడు. కాని జయద్రథుడు ఏ విధంగాను సమీపించేందుకు వీలుకాని  విధంగా కౌరవ వ్యూహం మధ్యలో ఉన్నాడు.  పరిస్థితిని గమనించిన కృష్ణుడు ఈ స్థితిలో అర్జునుడు జయద్రథుని వధించటం అసాధ్యమని గ్రహిస్తాడు. ఇక తన మాయను ప్రయోగించక తప్పదని  తలుస్తాడు. అప్పుడు సూర్యుడు అస్తమించినట్లు కన్పించే విధంగా ఆకాశంలో పెద్ద మేఘాలను కల్పిస్తాడు. సూర్యుడు కానరాకపోవటంతో మసక చీకట్లు కమ్ముకున్నాయి. సూర్యాస్తమయం అయిపోయిందని అని యుద్ధం ముగిసిందని  అంతా భావిస్తారు తాను జీవించానని, ఇక అర్జునుడు తప్పక మరణిస్తాడని భావించి జయద్రథుడు ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోతాడు. విజయం సాధించామనే ఉత్సాహంతో కౌరవ సైన్యం ఉత్సాహంగా జయజయ ధ్వానాలు చేసింది అందరు తమ ఆయుధాలను ఉపసంహరించారు.. ఆ క్షణమే మబ్బులు తొలగి సూర్యుడు వెలుగుతో దర్శనమిచ్చాడు. అర్జునుడు మరుక్షణం జయద్రథుని వధించాడు. మరొక అధర్మం.

ఇంతేకాక కర్ణార్జునులు  పోరాడుతున్నప్పుడు కూడా కృష్ణుడు కల్పించుకుంటాడు. కర్ణార్జునులు యుద్ధ విద్యలో సమానమైన వీరులు. ఒకరి అస్త్రాలకు సమాధానం చెప్పగల అస్త్రాలు మరొకరి దగ్గర ఉన్నాయి. అయితే కర్ణుని వద్ద ప్రత్యేకమైన నాగాస్త్రం ఉంది. అర్జునుని వధించేందుకే ఆ అస్త్రాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. యుద్ధరంగంలో ఆ అస్త్రాన్ని అర్జునుని తలకు గురిచూసి ప్రయోగించాడు. అదిచూసిన కృష్ణుడు తన మాయ చేత రథాన్ని కొన్ని అంగుళాలు క్రిందికి భూమిలోనికి తొక్కిపెట్టాడు. కర్ణుని అస్త్రం అర్జునుని శిరస్సుపై నుంచి దూసుకొనిపోయి, కిరీటాన్ని మాత్రం పడగొట్టగలిగింది. ఇటువంటి చర్యలెన్నో కృష్ణుడు చేశాడు.

ఈ చర్యలన్నికి సమర్ధన ఉందా? 

వారు చేస్తున్నది (చేసింది) అధర్మం. మేము చేస్తున్నది కూడా అధర్మమే, అయితే మేమలా చేస్తున్నది, ధర్మాన్ని శాశ్వతంగా నిలిపేందుకే అదే మా లక్ష్యం.  

కృష్ణుని ధర్మం ఉన్నతమైనది, ఇతరుల ధర్మం అల్పమైనది అని ఈ చర్యలు చెప్పటం లేదు. పాండవులు  ఎదుర్కొన్న యుద్ధమే అతిపెద్ద ద్రోహం. దుర్యోధనుని అధర్మ చేష్టలకు అది ఫలితం. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు కలసి మొదటి నుంచి పాండవులకు అంతులేని అన్యాయాలు చేసారు.  చిన్నతనంలో భీముని చంపాలని అతడిని నిద్రిస్తున్నప్పుడు తాళ్ళతో బంధించి నదిలో పడవేసారు. మరొక పర్యాయం అతడి భోజనంలో విషాన్ని కలిపించారు. కేవలం ఆట నెపంతో ఏర్పాటు చేసిన జూదం ఒక పెద్ద మోసం. అన్నికన్నా భయంకరమైన చర్య నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం. ఇంకా పాండవులను లక్క ఇంట్లో  ఉంచి దహనం చెయ్యాలనే  ప్రయత్నం, వారి రాజ్యాన్ని, సంపదలను మోసంతో జయించి వారిని బానిసలుగా పరిగణించటం, ఇలా ఎన్నో అకృత్యాలు  యుద్ధానికి దారితీసాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు కౌరవులకు ఏ ధర్మాలు లేవు. తమకు నష్టం కలిగినప్పుడు మాత్రం వారంతా ధర్మాన్ని గురించి ప్రసంగిస్తారు. చర్చలు చేస్తారు. తిరిగి మరుక్షణంలో తమకు లాభం కలుగుతుందంటే ఎటువంటి అధర్మానికైనా పాల్పడుతారు.

మహాభారతంలో కృష్ణుడు బోధించిన సూత్రం - 'వారు చేస్తున్నది (చేసింది) అధర్మం. మేము చేస్తున్నది కూడా అధర్మమే, అయితే మేమలా చేస్తున్నది, ధర్మాన్ని శాశ్వతంగా నిలిపేందుకే అదే మా లక్ష్యం. వారు అధర్మాన్నే నిలపాలనే ఉద్దేశ్యంతో అధర్మాలు చేసారు, చేస్తున్నారు ఇక్కడ ఉన్నది తప్పు ఒప్పుల ప్రశ్నకాదు. లక్ష్యం ఏమిటి, లక్ష్యసాధనకు నీతి న్యాయాల పరిధిలో విజయం సాధించగలమా లేదా అనేదే  ముఖ్యమైన ప్రశ్న. కృష్ణునికి తప్పు ఏదో తెలుసు. తాను చేస్తున్నదే ఒప్పు లేదా సరైనది అని అతడెప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. కానీ అతడు సాధించదలచినది (ధర్మ సంస్థాపన) మాత్రం లోకానికి మేలు కలిగిస్తుంది, అదే సరైనది. అందువలననే అతడు ఇదంతా చేసాడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: Abee5