ఈ విషయం నాకు ఎప్పుడూ అర్ధం కాలేదు. వాన కురుస్తోంది అనగానే అందరూ పారిపోతారు. వారు పంచాదారతోనో, ఉప్పుతోనో తయారు చెయ్యబడ్డట్టు. కరిగిపోతారని భయం కాబోలు. నాకు ఏదైనా కార్యక్రమం కానీ పని కానీ ఉన్నప్పుడు నేను కూడా పరిగెడతాను ఎందుకంటే నేను తడిసి వెళ్ళటం ఇష్టపడను కాబట్టీ. అలా కానప్పుడు మాత్రం, నేను చిన్నప్పుడు కూడా ఆశ్చర్యపోయేవాడిని అందరూ వర్షం చూసి ఎందుకు పరిగెడతారో. నాకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు నాకు గుర్తు వాన పడగానే నా తల్లిదండ్రులు ‘పరిగెత్తు పరిగెత్తు’ అని అరిచేవారు ఏదో నిప్పు అంటుకున్నట్టుగా. మేము చాలా విశాలమైన ప్రదేశంలో ఉండేవాళ్ళం. బోలెడన్ని ఎకరాల పొలం ఉండేది పైగా మైసూరు లో వానాకాలంలో వానలు మామూలు కంటే ఎక్కువ. అలా వర్హం కురుస్తూనే ఉండేది నేను తడుస్తూనే ఉండేవాడిని.

నాకు ఎండాకాలం తరవాత వచ్చే మొదటి వర్షం చాలా తన్మయంగా అనిపించేది. వాన చినుకులు నా మీద పడితే నేను ఉప్పొంగిపోయేవాడిని. జీవితంలో తరవాత తరవాత ఒక అనుభవం కలిగాక ఆ ఆనందం ఇంకా లోతుగా, నిండుగా అయింది. ఇదివరకు నేను వర్షాన్ని ఆనందించేవాడిని, అదొక తన్మయ అనుభూతిని ఇచ్చేది. కానీ కాల క్రమంలో నాకది ఒక గొప్ప అనుభవంగా మారింది. ఇప్పుడు కూడా ఇంట్లో ఒక పైకప్పు లేని మండువా లోగిలి ఉంది నాకు. వర్షం వస్తే నేను వెళ్ళి తడుస్తూ అక్కడ నుంచుంటాను.

మన శరీరంలో డబ్భై రెండు శాతం నీరే. మనం నిజానికి నీళ్ళ సీసాలం. మీ జీవితంలో ఇది ఒక గొప్ప నీటివనరు. ఈ అనుభవాన్ని గనుక మీరు ‘నేను’ అని అనుకోగలిగితే, వర్షం మీకొక అద్భుతమైన సమయం. ఎందుకంటే, వర్షం మీకొక అనుబంధం అవుతుంది ఎందుకంటే, ‘వర్షపు నీటి రూపంలో మీపై మీరే కురుస్తున్నారు కానీ ఇంకేదీ కాదని’ తెలుస్తుంది.కాబట్టీ, వాన నాకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. అది ఎప్పటినించో అంతే.

ఈషా హోం స్కూల్ ప్రారంభించినప్పుడు పెద్ద పెద్ద ఉరుములు ఉరిమేవి ఎందుకంటే స్కూలు వానాకాలం లోనే మొదలౌతుంది. అక్కడి టీచర్లు నన్ను అడిగారు “పిల్లల్ని ఎలా చూడాలి?” అని. అప్పుడు నేను, ‘పిల్లల్ని వర్షంలో పక్కనున్న వాగు దగ్గరికి తీసుకెళ్ళండి, అది ఎలా ఉంటుందో వారిని అనుభవించనివ్వండి’ అని చెప్పాను. మీరు వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయినప్పుడు, మీకూ మీ చుట్టూ ఉన్న పంచాభూతాలకీ ఏ తేడా లేదని మీకు అర్ధం అవుతుంది.వాన పడనప్పుడు మీకు అది తెలీదు; తడిసినప్పుడే అది తెలుస్తుంది మీకు. అందుకే ఇదివరకు భారతదేశంలోని ఏ గుడికి వెళ్ళాలన్నా, నీటిలో మునిగి వెళ్ళాల్సిందే. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు చాలా ‘కొలన్లు’ కనుమరుగైపోయాయి. మిమల్ని నీటిలో మునగమనేది ఎందుకంటే, అప్పుడు మీరు ఆ ఆధ్యాత్మిక శక్తిని మెరుగ్గా, సులభంగా గ్రహించగలుగుతారు. ఈ ‘తీర్ధకుండాల’ వెనుక ఆలోచన అదే. అక్కడి నీరు శక్తివంతంగా, మంత్రించబడి ఉన్నా కూడా, అది నీరే కదా!.

‘ధ్యానలింగం’ కూడా ఒక ప్రతిష్ఠ చెయ్యబడిన ప్రదేశమే- దాన్ని గ్రహించటానికి మీలో చాలా సున్నితత్వం ఉండాలి. ఎందుకంటే అది కేవలం గాలి గనుక. మనకి నీరు చాలా సులువుగా ఉంటుంది గ్రహణకి. ధ్యానలింగం కొందరికి ఎంతో శక్తివంతమైన అనుభూతి అయితే కొందరు మాత్రం అక్కడ కూడా కూర్చుని దిక్కులు చూస్తారు. ఏం జరుగుతోందో వాళ్లకి ఏమాత్రం అర్ధం కాదు. వాళ్ళు ఏ అనుభవాన్నీ గ్రహించలేరు. అందుకే తీర్ధకుండాలు సృష్టించాం మేము. ముందు వాళ్ళు నీటిని అనుభవిస్తే, ఆ తరువాత గాలిని అనుభవించటం సులువుగా మారుతుంది. అది ఒక సన్నాహం, ఒక సన్నద్ధత లాంటిది. కానీ, ఇప్పుడు దురదృష్టవశాత్తూ ధ్యానలింగం కంటే, తీర్ధకుండమే ఎక్కువ ప్రాపకాన్ని సంపాదించుకుంటోంది.

ఈ వర్శాకాలాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఈ సృష్టి యొక్క తత్వాలలో తడిసి ముద్దయి, సృష్టి తత్వాన్ని గ్రహించండి. మీ శారీరిక ఉనికికి అవతల ఉన్న జీవితాన్ని గ్రహించండి. శారీరిక నిర్బంధాలని దాటి వెళ్ళేందుకు ఇదొక అవకాశం. ఈ సృష్టి కౌగిలిలో, సృష్టికి మూలమైన దాని ప్రేమలో మునిగి పరవశించి ఉనికి అనే సంబరం చేసుకోండి.

కురుస్తున్న వర్షపు చినుకుల్లో మమేకమై కరిగి కురిసే తన్మయాన్ని ఆస్వాదించండి. అప్పుడు వర్షాన్ని వెళ్ళమని, వెళ్ళిపొమ్మని ఇంకెప్పుడూ అనలేరు మీరు.

వర్షఋతువు

తొలకరి వానల్లో తడిసేను యెర్రని మన్ను...

కలిసి కౌగిలించేనవి ప్రేయసీ ప్రియులై...

భావావేశం పొంగెను స్వేద బిందువులై ...

తానూ నేనంటూ రెండు లేవంటూ...

ఏకమయ్యేనవి నిండు పూర్ణమై...

విలీనమై అనంత శోధనై .

నేననే ఉనికిని చెరపాలనే తపనతో ...

కలిసిపోయేనది మన్నుతో మమేకమై ...

లయమే లేని ఏ పెద్ద వేరు చేశాడో ..

విడిపోయి కలవమని రాత రాశాడో.

తొలకరి వానల్లో తడిసెను యెర్రని మన్ను..

కలిసి కౌగిలించేనవి ప్రేయసీ ప్రియులై.

కలిసింది ఏకమై ఏలుకుందుకు కాదు..

జీవాన్ని జీవమై జీవమ్ము పోసి, మరణాన్ని మరణముగ ఉంచేందుకేమో!!

మానులై, పూవులై, ఫలములై పుట్టి...

నింగినే నేలొచ్చి ముద్దాడు వేళ..

ప్రాణములు ప్రాణమై జనియించునేమో..

ఈ జీవనాట్యమే సుర వేడుకేమో !!.