కుదురుగా కూర్చోవటం ఎలా? మనసునూ శరీరాన్నీ నిశ్చలంగా ఉంచటం ఎలా?

 

ప్రశ్న: సద్గురు, నాకు గంటల తరబడి అలా ఊరికే కూర్చోగలిగితే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. కానీ నేను నా శరీరాన్ని స్థిరంగా ఉంచలేకపోతున్నాను. ఈ సమస్యను నేను అధిగమించటం ఎలా?

సద్గురు: స్థిరంగా, కుదురుగా కూర్చోవాలంటే మీ శరీరాన్ని కొంత పకడ్బందీగా ఉంచాలి. తప్పదు. దానికి సరైన మార్గం హఠయోగం. అయితే, మీ శరీరం తగిన పటుత్వంతో ఉన్నంత మాత్రాన, మీరు స్థిరంగా కూర్చోలేరు సుమా! అలా కూర్చోగలగాలంటే మీరు కొన్ని ఇతర విషయాల మీద కూడా దృష్టి పెట్టాలి.

యోగాలో ఎనిమిది అంగాలున్నాయి: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణా, ధ్యానం, సమాధి అని. ఇవి సోపానాలు కాదు. అంగాలు. మీకు ఎనిమిది అవయవాలుంటే, వాటిలో దేన్ని ముందు కదులుస్తారో అది మీ అవసరాన్ని పట్టి, మీ ఇష్టప్రకారం నిర్ణయించుకొంటారు. ఏ అవయవం ముందు కదిలించాలి అని నియమమేమన్నా ఉంటుందా? మీరు భారతీయులు కనక, ఎప్పుడూ ముందు కుడి కాలే వేసి తీరాలి అనుకోకండి. జీవితంలో ఒక్కొక్కప్పుడు కుడికాలు ముందు వేయటం మంచిది. కానీ మరి కొన్ని సందర్భాలలో ఎడమ కాలు ముందు వేయటం అవసరం కావచ్చు. ఏ కాలు ముందు వేయాలన్నది ఏ పని చేయబోతున్నాం అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. అలాగే యోగాలో కూడా, ముందు ఏ అంగం ఉపయోగించాలి అన్నది మీరు ప్రస్తుతం ఏ దశలో ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.

మానవ జాతి చరిత్రలో చాలా కాలం శరీరమే బలవత్తరంగా ఉంటూ వచ్చింది. సమస్యలు కూడా ఎక్కువ శారీరకమైనవే ఉండేవి. అందుకని ముందు హఠయోగం నేర్చుకోవాలనేవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం దాకా, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు జనాభాలో నూటికి 5-10 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్లు కాదు. మిగిలిన వాళ్ళందరికీ శారీరక సమస్యలే ఉండేవి. ఇప్పుడైనా గ్రామీణ ప్రజలలో ఎక్కువ మందికి శారీరకమైన సమస్యలే తప్ప, మానసికమైన సమస్యలేవీ ఉండవు. సాధారణంగా చూస్తే మాత్రం, గత కొద్ది తరాలుగా మనుషుల్లో శారీరక సమస్యల కంటే మానసికమైన సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఆధునిక తరాల మనుషులు తమ శరీరాల కంటే తమ బుద్ధినే ఎక్కువ ఉపయోగిస్తూ వస్తున్నారు. మానవాళి చరిత్రలోనే ఇదొక పెద్ద మార్పు. 100- 200 సంవత్సరాల క్రితం దాకా, మనుషులు తమ బుద్ధిబలం కంటే, శరీర బలాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు.

నేను ఈ కాలపు మార్మిక వాదిని కనక ఇప్పటి మనుషుల సంగతే గమనిస్తూ వస్తున్నాను. వాళ్ళ సమస్యలలో శారీరక సమస్యల కంటే, మానసిక సమస్యల పాలు ఎక్కువ. అందుకే మేము మొదట వాళ్ళకు 'క్రియ'ల విషయంలో, ధ్యానంలో శిక్షణ ఇస్తాం. వాళ్ళ మనః స్థితిమీదా, శక్తి స్థాయి (energy levels) మీదా దృష్టి పెడతాం. తరవాతే హఠ యోగం ఆరంభిస్తాం. 

మీరు కుదురుగా కూర్చోవాలంటే, మీ శరీరానికి తగినంత అభ్యాసం ఇచ్చినంత మాత్రాన సరిపోదు. మీ బుద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా నేటి తరాల వాళ్ళు, బుద్ధి – భావోద్రేకాలూ – శరీరం - జీవ శక్తీ వీటన్నితో గూడిన వ్యవస్థ మొత్తాన్నీ స్థిరపరచటం మీద దృష్టిని కేంద్రీకరించవలసిందే. ఆధునిక తరాల మనుషులు పాత కాలం వారికంటే చాలా ప్రతిభావంతులు అనేది చాలా పొరపాటు అభిప్రాయం. ఈకాలం వారి బుద్ధి, క్రమబద్ధమైన వినియోగం లేక, అదుపు తప్పి ఉంటుంది. అంతే.

దానికి తోడు మన విద్యా వ్యవస్థ నిర్వహించబడుతున్న తీరు కూడా, బుద్ధి చెడటానికి దోహదం చేసేదిగానే ఉన్నది. విద్యార్థి కవిత్వం చదువుతాడు. అందులోనుంచి గణిత శాస్త్రానికి వెళతాడు. ఆ రెండిటికి సంబంధం ఉంది కానీ, ఆ సంబంధం చక్కగా విడమరచి బోధించే వాళ్ళేలేరు. గణిత శాస్త్రం నుంచి సంగీతం తరగతులకు వెళతాడు. ఈ రెంటికీ కూడా గట్టి సంబంధం ఉంది, కానీ దాన్నీ వివరించి చెప్పే వాళ్ళు లేరు. సంగీతం నుంచి కెమిస్ట్రీ తరగతికి. వాటి రెంటికీ కూడా సంబంధం లేకపోలేదు. కానీ ఆ సంబంధమేమిటో చెప్పే వాళ్లూ లేరు. సంగీతం విభాగం వారికి కెమిస్ట్రీ విభాగం వాళ్ళతో సరిపడదుగదా!

అన్నీ ముక్కలు ముక్కలుగా విడగొట్టి బోధించటమే. ఎందుకంటే అసలు, విషయం తెలుసుకోవాలన్న తపనతో చదివే వాళ్ళు ఎవ్వరూ లేరాయె. ప్రతి వాళ్ళూ ఎలాగోలా పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించుకోగలిగితే చాలు అనుకొనే వాళ్ళే. నిజంగా మీరు చదువు నేర్చుకోవాలని కనక అనుకొంటే ఇప్పుడున్నది చాలా విధ్వంసాత్మకమైన పద్ధతి. దీని ఫలితంగా అలవడే జీవన విధానం కూడా నిజంగా దయనీయమైనదే! ఎంత దయనీయమైనా సరే, ఎంత ఆలోచనారహితమైన విధానమైనా సరే, మేము ఇలాగే జీవిస్తాం అని ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభా దీనినే కోరుకొంటున్నారు.

ఈ మధ్యన ఒకరోజు సాయంత్రం నేను ఒక ఉన్నత స్థాయి కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక మూల అతిథులకు మద్యం అందిస్తున్నారు. కార్యక్రమ నిర్వాహకుడు, 'సద్గురు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఇలా మధ్యం అందించడం ఆపేస్తే మంచిది!' అన్నాడు. కానీ కొందరికి మద్యం కనిపిస్తే ఇక చేతులూ కాళ్ళూ స్వాధీనంలో ఉండవు. ఇంతలో ఒక మంత్రిగారు వచ్చారు. 'సద్గురు ప్రపంచమంతా తిరిగి వచ్చిన వారు కదా! ఇలాంటి వాటిని ఆయన పట్టించుకోరు' అన్నాడు. 'ప్రపంచమంతా మద్యం మత్తులో సోలిపోతూ ఉండటం ఎప్పటి నుంచి జరుగుతున్నదేమిటి?' అన్నాను నేను. ఈ రోజులలో ఎలా ఉందంటే, మీరు కాస్త లోకం చూసి వచ్చిన వాళ్లయి అంటే, ఇక మీరు మధ్యపానం చేయాల్సిందే. లేకపోతే మీరు ఈ లోకానికి చెందిన మనుషులు కానట్టే!

మన బుద్ధులు తప్పు దోవలు పట్టేందుకు మనమే దోహదం చేసుకొంటున్నాం. మరిక జనం ప్రశాంతంగా, ఆనందంగా లేరు అంటే ఎలా? అది జరిగేపనే కాదు. మీరు సక్రమమైన చర్యలు తీసుకోకపోతే, మీకు జీవితం సక్రమంగా జరగదు. మీరిక్కడ కొంత సేపు కుదురుగా కూర్చోవటానికి మీ శరీరం మొరాయిస్తుంది. అంటే, వైద్యపరంగా శరీరారోగ్యం అంతా 'సాధారణం' గానే ఉన్నా, ఏదో సమస్య ఉన్నదన్న మాటే. అమెరికాలో వైద్య గ్రంథాల లెక్క ప్రకారం మనిషి వారానికి రెండుసార్లు మాత్రం 'టాయ్ లెట్' కు వెళ్ళటం 'సాధారణం' అని పరిగణిస్తారట. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది. యోగ సంప్రదాయం ప్రకారం అయితే, యోగులు రోజుకు రెండుసార్లు టాయిలెట్ కు వెళ్ళటం 'సాధారణం'. విసర్జించ వలసిన మాలిన్యాలు దేహంలో ఉండిపోగూడదు. దేహంలోంచి తొలగించి వేయాల్సిందేదో దాన్ని వీలైనంత తొందరగా తొలగించేయాలి. ఉదయం లేవగానే ఆ పని పూర్తి చేయటం మంచిది. వారానికి రెండు సార్లే 'టాయ్లెట్' కు వెళ్ళటం అంటే, ఆ తొలగించాల్సిన మాలిన్యం, సగటున మూడు రోజులపాటు మన శరీరంలోనే ఉండిపోతుంది. ఇక మీ బుద్ధి అటూ ఇటూ పోకుండా కుదురుగా ఉండాలంటే ఎందుకుంటుంది? ఉండదు. మీ జీర్ణ వాహికలో పెద్ద ప్రేగు (colon) కూ, మీ బుద్ధి కుదురుకూ ప్రత్యక్ష సంబంధం ఉంది.

పెద్దఫ్రేగు ఉండేది 'మూలాధారం' దగ్గర. మూలాధారం మీ జీవశక్తి వ్యవస్థకు పునాది. మూలాధారం దగ్గిర జరిగేది, యావత్తు శరీర వ్యవస్థనూ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీ బుద్ధిని. ఈనాటి సైంటిస్టులు కూడా ఇలాంటి నిర్ణయాలకే వస్తున్నారు. సైంటిస్టులు మానవ శరీరంలో చిన్న చిన్న ముక్కలను మైక్రోస్కోప్ కింద పరీక్షించి అధ్యయనం చేస్తారు. ఒక్కొక్క ముక్క పరీక్షించినప్పుడు ఒక్కొక్క నిర్ణయానికి వస్తారు. సమగ్ర పరిశీలన అనేది బయటినుంచీ సాధ్యం కాదు. సమగ్ర అవగాహన అంతర్ముఖ పరిశీలన ద్వారానే కలుగుతుంది.

మీ సాధన మీరు చేయండి. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి. అందులో ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలు బాగా పెంచండి. రెండు నెలల తరవాత చూడండి- మీరు చక్కగా స్థిరంగా కూర్చోగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1