కృష్ణుడు – పోట్లగిత్త

 

కృష్ణుడు హస్తిన అనే పోట్లగిత్తను వేణుగానంతో ఎలా లొంగబరచుకుని స్వారీ చేసాడో సద్గురు మనకు ఈ కథలో వివరిస్తారు.

బృందావనంలో జరిగిన ఎన్నో సంఘటనలు, పరిస్థితుల వల్ల కృష్ణుడు చిన్న వాడైనా ఆ సమాజం ఆయన్ని ఒక సహజ నాయకునిగా చేసింది . ఆయన పరిస్థితులను సమర్ధించడంలో అసాధారణ పరాక్రమాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల ఇలా జరిగింది . కాలం గడచిన కొద్దీ ఈ అద్భుతాలను మరింత ఎక్కువ చేశారు. మీరు ఆయన జీవితాన్ని గమనిస్తే, కొన్నిపరిస్థితులను చక్కదిద్దటానికి ఆయన చాలా స్థిరచిత్తంతో, ఎంతో తెలివిగా వ్యవహరించాడని అర్ధమౌతుంది. ఆయనకు 14, 15 సంవత్సరాల మధ్య బృందావనంలో ఒక ఆంబోతు ఎద్దుతో ఒక సంఘటన జరిగింది. ఈ ఎద్దులు సహజంగానే పొగరు,  దూకుడు స్వభావం కలిగినవి. ఈ ఎద్దు పేరు హస్తిన, అంటే అది ఏనుగులా ఉంటుందని అర్ధం. ఇది చాలా పెద్దది, బలిష్టమైంది, పొగరుబోతు. అది ఎప్పుడూ పోట్లాటకు సిద్ధంగా ఉండేది. బృందావనంలో ఆవుల మందకు అదొక్కటే మూలం. అందుకని  దాన్ని అట్టిబెట్టుకున్నారు. కాని అది పొగరుబోతు, ప్రమాదకరమైనది కనుక ఎవరూ దాని దగ్గరికి వెళ్ళే సాహసం చేసేవారు కాదు.

మీరు ఆయన జీవితాన్ని గమనిస్తే, కొన్నిపరిస్థితులను చక్కదిద్దటానికి ఆయన చాలా స్థిరచిత్తంతో, ఎంతో తెలివిగా వ్యవహరించాడని అర్ధమౌతుంది.  

కృష్ణుడి అన్న బలరాముడు తన తోటి వారి కంటే ఎంతో బలవంతుడు. ఒక భారీ శరీరంతో పెరిగాడు. ఆయనకు  సాధారణమైన వారి కంటే ఎంతో భారీకాయం. బలరాముడు ఎప్పుడూ ఏదోకటి చేయాలని అనుకునేవాడు. మీకు తెలుసు కదా, కండలు ఉన్నవారు ఎప్పుడూ ఏదోకటి చేయాలని అనుకుంటారు! ఆయన ఎప్పుడూ కసరత్తు చేస్తూ,  ఆహారం అమితంగా తింటూ ఉండేవాడు. ఆయన ఇంకా ఎక్కువ బలవంతుడు కావాలని అనుకునేవాడు. ఒకరోజు ఆయన ఏదో పిచ్చిలో “నేను ఎంత బలవంతుడ్ని కావాలంటే ఒక్క గుద్దుకే హస్తినను చంపగలగాలి” అన్నాడు.

కృష్ణుడు చిరునవ్వుతో “నువ్వు ఒక్క గుద్దుతో చంపాలని అనుకుంటున్నావా? అది నువ్వు ఎలాగూ  చేయలేవు.  అలాంటి పని చేయటం మంచిది కూడా కాదు. నేను హస్తిన మీద స్వారీ చేస్తాను!” అన్నాడు, అందరూ నవ్వారు. పిల్లలందరూ “ఇవన్నీ ఉట్టి మాటలే, ఎవరూ హస్తిన మీద స్వారీ చేయలేరు అది మరీ పొగరుబోతు” అన్నారు. కృష్ణుడు ఖచ్చితంగా “నేను హస్తిన మీద స్వారీ చేస్తాను” అన్నాడు.

అది పౌర్ణమి రోజు సాయంత్రం. వాళ్ళు నాట్యం చేసి అలిసిపోయారు, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు “వచ్చే పౌర్ణమి రోజుకు నేను హస్తిన మీద స్వారీ చేస్తాను” అన్నాడు. ఇలాంటి మాటలు అంటారు కాని జనం ఏదో సాకుతో తప్పించుకుంటారు, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి, పౌర్ణమికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. బలరాముడు ఈ విషయం గురించి కృష్ణుడితో “నువ్వు పౌర్ణమి కల్లా హస్తిన మీద స్వారీ చేస్తానని అన్నావు. అదెలా చేస్తావ్? నువ్వు అలా చేయలేవని నాకు ఖచ్చితంగా తెలుసు’’ అన్నాడు. కృష్ణుడు “పౌర్ణమి రోజుకు నేను హస్తినను స్వారీ చేస్తాను” అన్నాడు. బలరాముడు “ ఏవేవో పెద్ద మాటలు చెప్పావు, అలా చేయలేనని నీకు భయం కనుకే, ఇన్ని రోజులు ఎటో మాయం అయిపోయావు. ప్రతి సాయంత్రం మేము ఇక్కడ కలుస్తున్నాం. నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు కేవలం తప్పించుకోవటానికి చూస్తున్నావు. పౌర్ణమి రోజున ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండవు.” అన్నాడు, కృష్ణుడు పూర్తి సంకల్పంతో “నేను హస్తిన మీద స్వారీ చేస్తాను” అన్నాడు, మిగతా పిల్లలంతా భయపడ్డారు. ఇప్పుడు ఈ విషయం  మరీ పెద్దదైంది. ఇంత వరకు ఇది కేవలం ఒక పరిహాసం అని మాత్రమే అనుకున్నారు.

ఈ నెల రోజులుగా కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన హస్తినను కట్టేసిన చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. చిన్నతనం నుంచి ఉన్న ఇద్దర్ని మాత్రమే హస్తిన దగ్గరికి రానిచ్చేది. హస్తిన ఈ ఇద్దరినే దగ్గరికి రానిచ్చేది, ఇంకెవరైనా వస్తే అది ఉగ్రం అయ్యేది. కృష్ణుడు ఈ ఇద్దరి దగ్గరికీ వెళ్లి “నేను హస్తినతో ఉండాలని అనుకుంటున్నాను” అన్నాడు.  “ఇది కుదరని పని. మీ నాన్నకు ఇది తెలిసినా, ఏదైనా జరిగినా ఆయనికి అస్సలు నచ్చదు...” అన్నారు. కృష్ణుడు, “లేదు, నేను అక్కడ ఉండాల్సందే.” అన్నాడు ఆయన అక్కడ  కొంచం దూరంలో కూర్చునే వాడు.

హస్తిన కోపంగా కాలితో నేలను దువ్వుతుండేది. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా సరే అది వాళ్ళ సంగతి చూడాలనుకునేది. అది కూడా  బలరాముడిలాగానే  “ఒక్క దెబ్బతో ఎవరినైనా చంపేయాలి” అని అనుకునేది. అది కూడా ఒక బలశాలి. కృష్ణుడు అక్కడ కూర్చుని వేణుగానం చేసేవాడు. రోజూ గంటలకొద్దీ వేణుగానం చేసేవాడు. అందువల్లనే సాయంత్రాలు ఆయన తన స్నేహితుల దగ్గర లేడు. మెల్లిగా ఈ ఎద్దు కొంచం శాంతించింది. గడ్డితో బెల్లం కలిపి ఈ ఎద్దుకు తియ్యటివి కొంచం దూరం నుంచి తినిపించేవాడు. మెల్లిగా మరింత దగ్గరిగా వెళ్ళేవాడు. ఒక రోజు వేణువు వాయిస్తూనే ఆ ఎద్దుని తాకాడు. నెల రోజుల్లో ఆయన ఆ ఎద్దుతో స్నేహం చేశేసాడు. ఆయన రోజూ దానికై శ్రమించాడు. కాని ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

పౌర్ణమి రోజున కృష్ణుడు “నేను హస్తిన మీద స్వారీ చేస్తాను” అన్నాడు.  

పౌర్ణమి రోజున కృష్ణుడు “నేను హస్తిన మీద స్వారీ చేస్తాను” అన్నాడు. బలరాముడుతో పాటు ఇంకా కొంత మంది స్నేహితులున్నారు అక్కడ ఉన్నారు. వాళ్ళు “లేదు, ఈ పందెం నుంచి మేమే తప్పుకుంటూన్నాము. దిగులు పడకు. నువ్వు దాన్ని స్వారీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చనిపోవటం మాకు ఇష్టం లేదు” అన్నారు. అయినా, ఆయన “నేను స్వారీ చేస్తాను. మీరు రండి.” అన్నాడు. కృష్ణుడి తమ్ముడు, స్నేహితుడు అయిన ఉద్ధవుడు  భయపడ్డాడు. ఈ పిచ్చి సాహసంలో కృష్ణుడు చనిపోతాడని అనుకున్నాడు. ఇలా జరగకుండా ఎలాగైనా ఆపాలని అనుకున్నాడు. అతను వెళ్లి “కృష్ణుడు ఈ పిచ్చి సాహసం చేయబోతున్నాడు. అతడు తనను తాను చంపుకోబోతున్నాడు.” అని రాధకు చెప్పాడు,  ఆమె ఎంతో ఉద్వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడితో “నువ్వు హస్తినను స్వారీ చేసే ప్రశ్నే లేదు” అంది. కృష్ణుడు మాత్రం నేను ఖచ్చితంగా హస్తిన మీద స్వారీ చేయాల్సిందే అన్నాడు. “వీల్లేదు. నువ్వు హస్తిన మీద స్వారీ చేసి చనిపోతే నేను కూడా హస్తిన మీద స్వారీ చేసి చనిపోతాను. ఒక్కడినే అలా చేయనివ్వను” అంది రాధ.

కృష్ణుడు ఏం చెప్పినా ఆమె వదిలిపెట్టలేదు. ఆమె వాటేసుకుని వదల్లేదు. అప్పుడు కృష్ణుడు “సరే. ఆగు. ముందు నన్ను దాని దగ్గరికి వెళ్లనివ్వు” అన్నాడు. ఈ కొద్ది మంది స్నేహితులతో కలిసి దాని దగ్గరికి వెళ్ళాడు. మిగతావారిని చూడగానే హస్తిన ఆవేశంగా కాలు దువ్వింది. కృష్ణుడు వాళ్ళందరినీ దూరంగా ఉండమని దాని దగ్గరికి వెళ్లి, వేణుగానం చేసి ఆ ఎద్దుకు తినటానికి తియ్యనివి ఇచ్చాడు. మెల్లిగా దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత రాధకు సైగ చేసి దగ్గరికి రమ్మన్నాడు, “నేను నుంచున్నట్లే నుంచో, నీ కాళ్ళు నా కాళ్ళ వెనుకే ఉండాలి, నీ శరీరం నా శరీరం వెనుక ఉండాలి. అప్పుడు హస్తినకు నువ్వు కనిపించవు.” అన్నాడు. వేటగాళ్ళు ఎప్పుడూ ఇలానే చేస్తారు. సాధారణంగా ఏ జంతువైనా ఎంత మంది ఉన్నారనేది ఎన్ని కాళ్ళు ఉన్నాయనే దాని బట్టే గుర్తిస్తుంది.

ముందు హస్తిన కొద్దిగా అవేశపడింది. మెల్లిగా అది శాంతించింది. అది కొంచం మెత్తబడగానే కృష్ణుడు దాని మీదకు దూకి రాధను కూడా దాని మీదకు లాక్కున్నాడు. కృష్ణుడు పైకి ఎక్కగానే హస్తిన  కోపంగా  పరిగెత్తటం మొదలు పెట్టింది. కృష్ణుడు ఆ ఎద్దు మూపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు, రాధ కృష్ణుడ్ని గట్టిగా పట్టుకుంది. ఇలా వాళ్ళు ఆ ఊళ్ళో నుంచి అడివిలోకి వెళ్లారు. హస్తిన చాలా సేపు పరిగెత్తి, శక్తి ఉడిగిన తర్వాత శాంతించి, గడ్డి మేయటం మొదలు పెట్టింది. రాధాకృష్ణులు ఇలా పొగరుబోతు ఆంబోతు ఎద్దు మీద స్వారీ చేసే అద్భుత ఘటనను జనం చూసారు, ఇప్పుడు అది శాంతంగా అడివిలో గడ్డి మేస్తుంది ఎందుకంటే దాని శక్తంతా అయిపోయింది. ఇది ఒక పెద్ద అద్భుతం అయ్యింది. కాలం గడిచే కొద్దీ ఈ అద్భుతం మరింత గొప్పగా, ఇంకా లక్ష రకాలుగా చెప్పుకున్నారు. ఈ పిల్లవాడు మాత్రం  – ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని ఎలా చేయాలో అలానే చేస్తాడు అనుకున్నారు. ఎవరు ఏమంటున్నా సరే, దాన్ని ఎలా చేయాలో అతనికి తెలుసు.

ఈ అబ్బాయి తనని తాను సరికొత్త స్థాయి మేధస్సుతో, ఎంతో స్పష్టతతో సమాజంలో ఒక సరికొత్త శక్తిగా మలచుకున్నాడు .  

ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో జరిగాయి, ఇవి ఆయన్ని ఆ సమాజంలో ఒక సహజమైన నాయకుడ్ని చేశాయి. ఆయనకు 15, 16 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి అక్కడి పెద్దవాళ్ళు కూడా కృష్ణుడి సలహా అడగటం మొదలు పెట్టారు . ఈ అబ్బాయి తనని తాను సరికొత్త స్థాయి మేధస్సుతో, ఎంతో స్పష్టతతో సమాజంలో ఒక సరికొత్త శక్తిగా మలచుకున్నాడు .

 

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1