మీకు కావలసింది ఇదే కదా...

 

మనం జీవితంలో ఎన్నో కావలనుకుంటూ ఉంటాము. వాటిని  సాధించాలని వత్తిడికి లోనవ్వడం సహజమే అనుకుంటాం. నిజానికి మనకి కావల్సిందేమిటి..? అది సాధించడానికి మన శాంతిని కోల్పోవాల్సిన అవసరం ఉందా..? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి...

ఒత్తిడి లేక స్ట్రెస్ అనేది మీ జీవితంలో భాగం కాదు. ఇది మీరు మీ శరీరాన్ని, మీ మనసునీ, మీ భావోద్వేగాల్ని, మీ శక్తినీ సరిగ్గా నియంత్రించక పోవడమే. ఈ రకమైన చేతగానితనం మానవులకు సహజం అన్న స్థితికి వచ్చేసారు. మనం దేన్నయితే "మానవ" అంటామో అది సరిగ్గా నిర్వచించబడలేదు. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, అది నేను ఒక మంచి పులిని అవ్వాలి అని ఆలోచించదు కదా? అది సరిగ్గా తింటే చాలు, అది మంచి పులైపోతుంది. మీరు మనిషిగా పుట్టారు, మంచి మనిషి అనిపించుకోవాలంటే మీరు ఎన్ని పనులు చేయాలి?

ఎన్ని పనులు చేసినా కూడా "నేను వీరికంటే మంచి వాడిని" అని అనుకోగలరు అంతే. ఇప్పుడు మీ పక్కన ఇంకెవరో వచ్చి నిలుచున్నారు అనుకోండి, ఏమో, మీరేక్కడుంటారో మీకే తెలీదు. ఎంత మంచి వారో మీకే తెలీదు, మీరు ఒకరితో పోల్చుకోకుండా మీకుగా మీరు ఎలాంటి మనిషో మీకు తెలుసా? మీకు తెలీదు. మీరు "అబ్బా నేను చాలా మంచి వ్యక్తిని" అన్న ఆలోచనలో ఉంటారు. మీ పిల్లలు ఒకరోజు వచ్చి "నాన్న నువ్వు ఎందుకూ పనికిరావు" అని చెప్తారు. ఇది మీకు ఇప్పటికే జరిగిందా? జరగకపోయినా ఫరవాలేదులెండి, ఎప్పుడోకప్పుడు జరిగే తీరుతుంది. ఎందుకంటే వారి  దృక్పధంలో మీరు ఎందుకూ పనికిరారు, వారి లాగా మీరు రాక్ మ్యూజిక్, డాన్స్ లాంటివి చేయలేరు. మీరు ఎన్నో పనులు చేస్తూ ఉండి ఉండొచ్చు కాని వారి దృక్పధంలో మాత్రం పనికిరారు.

'ఇలా ఉంటే ఒక మంచి వ్యక్తి ' అని ఏదైనా ఒక ప్రామాణికం ఉందా? అలాంటి ప్రమాణికాలు ఏమి లేవు కదా? ఇలా మనుషులూ, సమాజాలూ, మతాలూ ఒక ప్రామాణికాన్ని తీసుకొద్దామని చూసాయి కాని దానివల్ల ఏవైతే జరగకూడదో అలాంటి అగాయిత్యాలే జరిగాయి. అందుకని మానవీయత  అనేది ప్రామాణికలతో నిలుచునేది కాదు. మీరు ఉత్తమంగా మారుతూ ఉండచ్చు కాని ఇదే ఉత్తమమైనది అన్నది ఏదీ లేదు కదా? ఎవరైతే నేనే చాలా మంచి వాడిని అని అనుకుంటారో వారు చాలా ఘోరమైన మనుషులుగా ఉంటారు.  ఈ మనుషులకి ఉన్న సమస్య ఏమిటంటే, ప్రకృతి మీకు కొంత స్వేచ్ఛని ఇచ్చింది.మనుషులు కేవలం వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు మాత్రమే ఈ మనుగడని సరిచూసుకోగాలిగితే చాలు జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు. ఆ మనుగడని సరి చూసుకున్న తరువాత అంతా హాయిగా ఉంటుంది అనుకున్నారు. 

 మీరు జీవితపు నిర్భందనలకు లోబడనవసరంలేదు, ప్రతీది మీరు ఎరుకతో,చేతనతో చేయవచ్చు.  

"మీరు" ఏమిటి అనేది ప్రతీది మీ చేతనతో నిర్మించుకోవచ్చు, మీ శరీరం, మీ మనస్సు, మీ భావోద్వేగాలు, మీ శక్తి అన్నింటినీ. మీరు జీవితపు నిర్భందనలకు లోబడనవసరంలేదు, ప్రతీది మీరు ఎరుకతో,చేతనతో చేయవచ్చు. ఇది కనక జరిగితే అప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులకి మీరు బానిసగా మారే అవసరం ఉండదు. మీరు ఎంత గొప్పగా ప్రవర్తించగలరు అనేది - అది ఒక విధ్యార్దిగానో, ఉపాధ్యాయుడుగానో, మరింకేదిగానో అయ్యిఉండచు - అది   మీ శరీరం, మీ మనస్సు, మీ భావోద్వేగాలు, మీ ప్రాణ శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. మీ శరీరం మీ మనస్సు గనక మీ నుంచి ఆదేశాలు తీసుకున్నాయి అనుకోండి, అది అద్భుతంగా ఉంటుంది. మీలో అవి ఎలా ఉండాలనుకుంటారు? మీ పొరుగు వారి సంగతి కాదులెండి... ఆనందంగా ఉండాలి అనుకుంటారు కదూ?

ఒక మనిషిగా ఎం కావాలి అని చూస్తే మీకు మీ శరీరంలో హాయి, మనస్సులో హాయి, భావోద్వేగాలలో హాయి, మీ ప్రాణ శక్తులలో హాయి కావాలి, ఇంతే కదా? లేదు లేదు నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఎవరో మీకు స్వర్గం ఎంతో హాయిగా ఉండే ప్రదేశం అని చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఎవరో మీకు స్వర్గం అనేది చాలా ఘోరమైన ప్రదేశం కానీ అక్కడ భగవంతుడు ఉంటాడు అని చెప్పారనుకోండి, అప్పుడు వెళ్ళాలి అనుకుంటారా? లేదు లేదు వద్దులెండి అనుకుంటారు. మీ శరీరం సౌఖ్యంగా ఉందనుకోండి దాన్ని ఆరోగ్యం అంటాం, చాలా సౌఖ్యంగా ఉంటే దాన్ని సుఖం అంటాం. మీ మనస్సు హాయిగా ఉంటే అది ప్రశాంతత అంటాం, చాలా ఎక్కువ హాయిగా ఉంటే దాన్ని ఆనందం అంటాం. మీ భావోద్వేగాల్లో హాయి ఉంటే దాన్ని ప్రేమ అంటాం, అది చాల ఎక్కువైతే దాన్ని కరుణ అంటాం. మీ ప్రాణ శక్తుల్లో హాయి ఉంటే దాన్ని పారవశ్యం అంటాం. మీ చుట్టూ పరిస్థితులు గనక మీకు అనుకూలంగా  ఉంటే దాన్నే విజయం అంటాం. మీకు కావలసింది ఇదే కదా? మీ శరీరం మీ మనస్సు మీ భావోద్వేగాలు, మీ ప్రాణ శక్తులు మీ చుట్టూ పరిస్థితులు హాయిగా ఉండడం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1