ప్రశ్న:ప్రతిరోజూ ఎందఱో వ్యాధులతో బాధపడుతూ ఉండటాన్ని చూస్తూ ఉంటాను. అది నన్ను తీవ్రంగా బాధిస్తుంది. మానవులు ఈ విధంగా ఎందుకు బాధపడాలి అని అనుకుంటాను. ఒకరు చక్కని ఆరోగ్యంతో ఉంటూ ఉండగా మరికొందరు అనారోగ్యంతో బాధ పడటం ఆహేతుకం అనిపిస్తుంది. అనారోగ్యం ఎందువల్ల కలుగుతుందో చెప్పగలరా? అసలు అదేమిటి? అది ఎక్కడనుండి వస్తుంది?


సద్గురు: వ్యాధికి ఎన్నో కారణాలు ఉన్నాయి. “Dis-ease” అంటే మీరు ఈజీగా లేరన్న మాట. మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవటం ఎలాగో తెలియకపోతే మీలోని శక్తులు గందరగోళపడతాయి. ఉదాహరణకు అస్త్మాతో బాధపడే వ్యక్తులు ఈశ యోగ కార్యక్రమాలకు హాజరు అయినప్పుడు ధ్యానం, క్రియ చేస్తూ ఉన్నప్పుడు, అది ఒక్కసారిగా మాయం అయిపోతుంది. అస్తమా అయితే చాలా మందికి నయం అయిపోతుంది. ఎందుకంటే వారి శక్తులు వ్యవస్థీకరింపబడ్డాయి. కొందరికి పాక్షికంగా నయం అవుతుంది. ఎందుకంటే ఆ ఆస్తమా కొంత భాగమే శక్తుల అవ్యవస్థీకరణకు సంబంధించినది. మరి కొంత కర్మసంబంధమైన కారణాలకు చెందినది. కొందరిలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే ఆ వ్యాధి వెనక ఎంతో బలమైన కర్మ సంబంధమైన కారణాలు ఉంటాయి. బాహ్య పరిస్థితులు మారక పోవటం కూడా కారణం కావచ్చు.

“Dis-ease” అంటే మీరు ఈజీగా లేరన్న మాట. మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవటం ఎలాగో తెలియకపోతే మీలోని శక్తులు గందరగోళపడతాయి.

మరి, వ్యాధికి కర్మ ఎలా కారణమౌతుంది? ఈ జీవితానికి నిర్దేశించిన ప్రారబ్ధ కర్మ కొంత ఉంటుంది. ఈ జన్మకు కేటాయించిన కర్మ అది. ప్రారబ్ధ కర్మ మీ మనసుపైన, శరీరం, అనుభూతుల పైన ముద్రింపబడి ఉంటుంది. మీ శక్తులపై అది ఇంకా గాఢంగా ముద్రింపబడి ఉంటుంది. సమాచారం అనేది శక్తులపై ముద్రింపబడటం ఎలా సాధ్యం అంటారా? అది నాలో నిత్యం జరుగుతున్న సజీవ అనుభవం. ఈ విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ, ఈ విషయాన్ని శాస్త్రం ఎప్పుడో ఒకప్పుడు తప్పక తెలుసుకుంటుంది. ఒకప్పుడు మనం దేన్నైనా నమోదు చెయ్యాలని అనుకుంటే రాతి పలకలపై వ్రాసేవాళ్ళం. అక్కడనుండి పుస్తకాలవరకూ పురోగామించాము. ప్రస్తుతం మనం డిస్కులు, చిప్స్ పైనా వ్రాస్తున్నాము. వెయ్యి రాతి పలకలపై వ్రాసే విషయాన్ని ఓకే పుస్తకంలో వ్రాయవచ్చు. వెయ్యి పుస్తకాల్లో వ్రాసే విషయాన్ని ఒక కంపాక్ట్ డిస్క్ లోను, వెయ్యి కంపాక్ట్ డిస్కుల విషయాన్ని ఒకే చిన్న చిప్ లోను భద్రం చెయ్యగలం. ఎప్పుడో ఒకరోజు ఒక మిలియన్ చిప్ లలో పొందుపరచే విషయాన్ని ఓక చిన్నపాటి శక్తి పై పొందు పరచగలమేమో! అది సాధ్యమే అని నాకు తెలుసు. ఎందుకంటే ఆ ప్రక్రియ నాలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంతే కాదు అది నిరంతరం అందరిలో జరుగుతూ ఉంటుంది.

మనలోని శక్తి ఒక విధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి శరీరంలోని శక్తి, అంటే ప్రాణ శక్తి ఒకేలాగా పనిచెయ్యదు. వారి వారి కర్మబంధాలను అనుసరించి అది పనిచేస్తుంది. ఒకవేళ శరీరం పడిపోయినా కర్మబంధం ఇంకా శక్తిలో మిగిలే ఉంటుంది. శక్తిలో చాలా గాఢంగా నమోదు అవుతుంది. ఇది ఒకరకమైన కర్మబంధం(మిగిలి ఉన్నకర్మ) అని అనుకోవాలి. మీ మనసు పనిచెయ్యక పోతే మీ శరీరంలో ఉంటుంది. అదీ పడిపోతే శక్తిలో వ్రాసి ఉంటుంది.



కేటాయించిన శక్తిని వినియోగించుకోవటం:

శక్తి దేనికి అది కేటాయింపబడి ఉంటుంది. ఇందులో ఎన్నో క్లిష్టమైన విషయాలు ఉన్నప్పటికీ సరళంగా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు.శక్తి కొంత భాగం పనులకోసం,కొంత భాగం ఉద్వేగాలకోసం,కొంత భాగం ఆలోచన క్రియ కోసం, అలాగే మరికొంత మీలొని అనుభవకోణానికి చెంది ఉంటుంది. నేటి జీవన పరిస్థితుల్లో మానవుల మనోభావాలు పూర్తిగా వ్యక్తం కావటంలేదు, అలా అవ్యక్తంగా ఉన్న మనోభావాలకు కేటాయించబడిన శక్తి మరో రకమైన శక్తిగా మారలేదు. అది మనోభావంగా వ్యక్తం కావాలి లేదా అది లోపలికి మళ్ళి, లోలోపల ఏవో తమాషాలను చేస్తుంది. ఈ కారణం వల్లనే పాశ్చాత్య దేశాల్లో ఎన్నో మానసిక సమస్యలు వస్తున్నాయి

గతంలో ఎన్నడూ లేనంతగా మానవ మస్తిష్కం కొత్త రకమైన న్యురోసిస్ ను పొందుతోంది. ఎందుకంటే మానవుడు తన శరీరాన్ని చాలా వరకు ఉపయోగించటం లేదు.

ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఎదో ఒకరకమైన మానసిక రుగ్మతకు లోనౌతున్నారు అంటారు. ఇందుకు ముఖ్యమైన కారణం ఏమంటే ఆ సంస్కృతిలో మనోభావాల ప్రదర్శనకు అవకాశం లేదు. మనోభావాల ప్రదర్శనను సమాజంలో బలహీనతగా భావిస్తారు. ఆ కారణంవల్ల వారు మనోభావాలను ప్రదర్శించరు. ప్రపంచంలోని ప్రజల్లో నూటికి తొంభై మందికి మనోభావాల వ్యక్తీకరణకు అవకాశం ఉండదు. వారు తమ ప్రేమ, దుఖం, ఆనందాలతో భయపడతారు. వారికి అన్నింటి పట్లా భయమే!గట్టిగా నవ్వాలన్నా ఏడవాలన్నా భయమే! – ప్రతిదీ భయమే! దీన్ని ఆధునిక సంస్కృతీ అంటారు. నేను దీన్ని నియంత్రించే సంస్కృతి అంటాను. అది మిమ్మల్ని ఒకరకంగా ప్రవర్తించమని చెపుతుంది.మీ ఉద్వేగాలకు సరైన వ్యక్తీకరణ లేనప్పుడు అవి మీకు ఎంతో హాని చేస్తాయి.

ఆధునిక జీవితంలో శారీరిక శ్రమ చాలా తగ్గిపోయింది. గతంలో మానవులు ఉపయోగించినంతగా ఇప్పుడు తమ శరీరాలను ఉపయోగించటం లేదు. కాని ఇప్పటికీ ప్రారబ్ధకర్మలో అధిక శాతం భౌతిక శరీరానిదే! ఆ శాతం మనిషి నుండి మనిషికి భిన్నం కావచ్చు. కానీ రమా రమి అంతే! అలా వినియోగించకుండా మిగిలిపోయిన శక్తి, వ్యాధిని కలుగజేస్తుంది.ఆధునిక మానవుని మనసు ఇప్పటి వరకు ఎవరూ ఎఱుగని ఒక కొత్తరకం న్యురోసిస్ కు లోనౌతోంది. ఎందుకంటే మానవుడు శరీర వాడకాన్ని అధిక శాతం నిలిపి వేశాడు.మీరు భౌతిక శ్రమను బాగాచేస్తే మీ న్యురోసిస్ చాలా వరకు బాగై పోతుంది. ఎందుకంటే అందువల్ల మీ నరాల శక్తి వినియోగం అవుతుంది. కాని ఆధునిక మానవుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా నిష్క్రియా పరునిగా తయారయ్యాడు. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక స్థాయిలో న్యురాటిక్ గా ఉంటున్నారు. కారణం ఏమీ లేదు, కేవలం శరీరిక కష్టం చేయ్యకపోవడమే! ఆ శక్తి శరీరంలో చిక్కుకుపోయి ఉంది. కొండలు గుట్టలు ఎక్కటం వంటి శారీరకశ్రమ చేసే వారు గొప్ప సంయమనంతోను, మానసిక ప్రశాంతతతోనూ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు.ఎందుకంటే వారు తమ శరీరానికి కేటాయించిన శక్తిని వినియోగించారు. అటువంటి వ్యక్తులు సాధారణంగా ఇంద్రియలోలత్వంలో నిమగ్నమై పోవటంగాని, లేదా ఇతరమైన శారీరక బంధాల్లో చిక్కుకోవటం గాని కనిపించదు. ఎందుకంటే వారిలో శారీరిక శ్రమ అనే కోణం సంపూర్ణంగా వ్యక్తమైంది.

నిష్క్రియాపరత్వం యొక్క ఒకానొక ఫలితం వ్యాధి. అన్నిటి కంటే ముఖ్యంగా వినియోగం కాక శరీరంలో చిక్కుకుని ఉన్న శక్తి, అశాంతిని కలిగిస్తుంది. ఆ అశాంతి కొందరిలో భౌతికమైన వ్యాధిగా వ్యక్తమౌతుంది.మరికొందరిలో అది వ్యాధి కాకపోవచ్చు. కాని కొంత అలజడిని రేకెత్తించవచ్చు. వారి శక్తులు లోలోపల కలవర పడుతూ ఉంటాయి. వారు కుదురుగా కూర్చోలేరు. మీరు మనుషులు నిలుచుండే విధానం, కూర్చునే విధానం గమనిస్తే, వారు సుఖంగా లేరని తెలుస్తుంది.అయితే వారు ఎలా నిల్చుంటే, ఎలా కూర్చుంటే హుందాగా ఉంటుందో, అది అభ్యాసం చేస్తారు. కానీ ఆవిధంగా మీలోని అశాంతిని తొలగించాలి అనుకుంటే అది మీలోనికి ఎక్కడ వ్యక్తం కావటానికి వీలుంటుందో అక్కడకి చేరి వ్యాధిగా మారుతుంది. లోపలికి మళ్ళే శక్తి వల్ల వ్యాధి కలుగుతుంది.

మా బ్రహ్మచారులు పనుల్లో విపరీతంగా నిమగ్నమై పోవటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. ఆధ్యాత్మిక సాధనకు వచ్చిన వారు రోజుకు ఇరవైనాలుగు గంటలు ఎందుకు పనిచేస్తారు? అని వారిని చూసిన వారు ఆశ్చర్యపోతారు. ఆధ్యాత్మికత అంటే చెట్టుక్రింద కూర్చుని కునుకులు తీయడం అని చాలా మంది అనుకుంటారు. కాని అది సరికాదు. నిజానికి బ్రహ్మచారులు చేసే పని వారి ఆధ్యాత్మికతకు దోహదం చేస్తుంది. వారికి కేటాయించబడిన ప్రారబ్ధ కర్మ అంతా, కొద్ది సమయంలో అంటే, ఒక ఐదు సంవత్సరాల్లో పూర్తి చెయ్యాలని వారు అనుకుంటాను. ఒకసారి ఇలా ఆ కర్మను పూర్తి చేస్తే, ఇక కర్మతో పని ఉండదు.అప్పుడు ఇక, కర్మ అనేది వారు చేయాలనుకుంటే చెయ్యవచ్చు. అంతేకాని తప్పనిసరి కాదు. అప్పుడు మీరు అతన్ని కూర్చోమని అంటే అతను కూర్చో గలుగుతాడు. ఏ ప్రయాసా ఉండదు.

కార్యకలాపాల నుండి ధ్యానానికి

భావస్పందన, సంయమ వంటి ఉన్నత కార్యక్రమాలలో మేము చేస్తున్నది అదే! ఒళ్ళు పులిసిపోయేలాగా పనిచెయ్యటం ద్వారా మీకు శారీరిక క్రియలకోసం కేటాయించిన శక్తిని మామూలు జీవితంలో కంటే త్వరగా ఖర్చుచేస్తారు. అప్పుడు మీరు ఒకచోట కూర్చుని ధ్యానం చేసే సావకాశం లభిస్తుంది. అప్పుడు ధ్యానం సహజంగా మీకు అబ్బుతుంది. మీకు కేటాయించిన శక్తి ఇంకా మిగిలి ఉంటే మీరు కూర్చుని ధ్యానం చెయ్యలేరు, ఎందుకంటే ఆ శక్తి మిమ్మల్ని ఎదో పనిచెయ్యమంటుంది.

శరీరం,మనసు,మనోభావం,శక్తి ఇవన్ని సరైన అభ్యాసాలతో ఉపయోగించబడాలి.

వ్యాధికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అలా పనిచేసి, మీ శక్తి ఆ వ్యాధికి ఎందుకు కారణమౌతోందో అన్న దానికి, కర్మ సంబంధమైన కారణాలు కూడా ఉంటాయి. మానవులు కర్మ సంబంధమైన కారణాలవల్ల వ్యాధులకు లోనవుతుంటే, అది వేరుగాని. అసలు ప్రపంచంలో చాలా మందికి వ్యాధి కలగవలసిన అవసరం లేదు. నేడు వైద్యశాస్త్రం మునుపెన్నడూ లేనంత అభివృద్ధి చెందింది. కానీ ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొంద లేకపొతున్నారు. శారీరకమైన, ఉద్వేగపరమైన శక్తులు ఎంతో ఎక్కువగా కేటాయింపబడి ఉంటున్నాయి, వారు వాటిని ఉపయోగించలేక పోతున్నారు. కేవలం మానసికమైన శక్తినే వినియోగిస్తున్నారు. అది ఆలోచనకు కేటాయించిన శక్తి. ఉదాహరణకు దేశంలో బడ్జెటును వివిధ రంగాలకు కేటాయిస్తారు. విద్యకు ఇంత, అభివృద్ధికి ఇంత, పరిశ్రమలకు ఇంత, ఇంధనానికి ఇంత అని కేటాయిస్తారు. ఎక్కువ భాగం ఇంధనానికి కేటాయించబడుతుంది. దాన్ని అక్కడ సవ్యంగా ఉపయోగించకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో కూడా అదే జరుగుతోంది.శరీరం,మనసు,మనోభావం,శక్తి చక్కని అభ్యాసంతో సంపూర్ణంగా ఉపయోగింపబడాలి. అప్పుడు జీవితం అన్ని స్థాయిల్లో సరిగా, సాఫీగా నడుస్తుంది.

Editor’s Note: Excerpted from Mystic’s Musings. Not for the faint-hearted, this book deftly guides us with answers about reality that transcend our fears, angers, hopes, and struggles. Sadhguru keeps us teetering on the edge of logic and captivates us with his answers to questions relating to life, death, rebirth, suffering, karma, and the journey of the Self. Download the sample pdf or purchase the ebook.