Sadhguruకార్మిక లక్షణాలు మీరు చేస్తున్న పనివల్ల కలుగవు. కర్మ అంటే పనే. కానీ మనం గత కర్మలను పోగుచేసుకుంటున్నది, మనం చేసిన పనుల వల్ల కాదు. అది మనం చేసిన పని వెనుక ఉన్న మన  ఉద్దేశాలు, భావనలు, ఆలోచనల మూలంగా వచ్చింది. అదే మీ కర్మ.

రామకృష్ణులవారు చెప్పే కథ ఒకటుంది. ఇద్దరు మిత్రులుడేవారు. వీళ్ళకి, ప్రతి శనివారం, సాయంత్రం పూట వేశ్యల వద్దకు వెళ్లే అలవాటున్నది. ఒకసారి వాళ్లిద్దరూ అలా వేశ్యాగృహానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నది. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకడు తాను వేశ్యాగృహానికి రానని, ఆధ్యాత్మిక బోధన వింటానని చెప్పాడు. రెండవవాడు తన దారిన తాను నేరుగా వేశ్యాగృహానికి వెళ్లాడు. ఆధ్యాత్మిక బోధనలో కూర్చున్న వాని ఆలోచనలన్నీ వేశ్యాగృహానికి వెళ్లిన మిత్రుడి గురించే. తాను ఆధ్యాత్మిక బోధన వింటున్నా, మనసు నిండా తన మిత్రుడు మాత్రం సుఖిస్తున్నాడన్న ఆలోచనలే. ఆధ్యాత్మిక బోధన వినడం కన్నా వేశ్యాగృహానికి వెళ్ళి మిత్రుడు మంచి నిర్ణయం తీసుకున్నాడని ఇతని అభిప్రాయం.

ఆధ్యాత్మిక బోధనలో ఉన్నవాడు, తన మనస్సులో వేశ్యాగృహంలో మిత్రుని సుఖాలకు సంబంధించిన ఆలోచనల వల్ల దుష్కర్మను పోగుచేసుకుంటాడు

ఇక వేశ్యాగృహానికి వెళ్లిన రెండవవాడి మనస్సు నిండా ఆధ్యాత్మిక బోధనకు హాజరైన మిత్రునికి సంబంధించిన ఆలోచనలే. తన మిత్రుడు వేశ్యాగృహానికి రావడం కన్నా ఆధ్యాత్మిక ప్రబోధానికి ప్రాముఖ్యం ఇచ్చి ముక్తి మార్గాన్ని తెలుసుకుంటున్నాడని, తాను మాత్రం ఐహిక సుఖాలలో పడి ఉన్నాననే ఆలోచనలే. ఆధ్యాత్మిక బోధనలో ఉన్నవాడు, తన మనస్సులో వేశ్యాగృహంలో మిత్రుని సుఖాలకు సంబంధించిన ఆలోచనల వల్ల దుష్కర్మను పోగుచేసుకుంటాడు. బాధ వీడికే కలుగుతుంది, వేశ్యాగృహం వెళ్ళిన వాడికి కాదు. ఈ బాధ వేశ్యాగృహానికి వెళ్లనందుకు కాదు, మోసపూరిత మనస్తత్త్వం వల్లనే. వేశ్యాగృహానికి వెళ్లాలని ఉన్నా, అక్కడికి వెళ్లకుండా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళితే స్వర్గం సులభంగా లభిస్తుందని అభిప్రాయపడడం ఆత్మవంచనే అవుతుంది. ఈ మోసపూరిత ధోరణే నరకానికి తీసుకువెళుతుంది. వేశ్యాగృహానికి వెళ్లినవాడికి అది పనికిమాలిన పని అని తెలుసు, అతడు కోరుకునేది మరొకటి (ఆధ్యాత్మికం). అదే వాడి సత్కర్మ. అంటే మనం పోగు చేసుకునే కర్మ  మనం చేస్తున్న పనిని బట్టి కాదు.

ప్రస్తుత సామాజిక నియమ నిబంధనల ఆధారంగానే ఇది మంచి, ఇది చెడు అని మీరు ఆలోచిస్తున్నారు. మీలో ఉన్న అంతర్గత చైతన్యం మంచిచెడుల గురించి మీకు చెప్పడం లేదు. సమాజం కొన్ని నియమాలు, కట్టుబాట్లు రూపొందించి, చిన్నతనం నుంచి మీకు ఇవి మంచిచెడులని చెబుతూ, ఈ సామాజిక నియమాల్ని ధిక్కరిస్తే మీరు చెడ్డవారని చెప్పింది. కాబట్టి సామాజిక నియమాల్ని ఉల్లంఘించినప్పుడల్లా మీరు చెడ్డవారని అనుకుంటారు. చివరకు మీరు అనుకున్నదే మీరు అవుతారు.

నిజానికి  కర్మ అనేది మీరు అనుభూతి చెందుతున్నదాన్ని బట్టే ఉంటుంది; అంతేకాని అది మీరు చేసిన పనిని బట్టి కాదు.

ఉదాహరణకు మీరు జూదం ఆడడం ఆరంభించారనుకుందాం. మీ ఇంట్లో మీ అమ్మ, భార్య, పిల్లల ముందు జూదమనే పదం వాడడం కూడా అనైతికంగా మీకు అనిపించవచ్చు; కానీ జూదం ఆడే మిత్రుల వద్ద జూదం ఆడడం బాగానే అనిపిస్తుంది. అవునా? జూదం ఆడేవాళ్ల మధ్యలో ఎవరైనా జూదం ఆడనివాడు ఉంటే, వాళ్ళ దృష్టిలో ఇటువంటి వాడు జీవించడానికే  పనికిరానివాడు. అన్ని విషయాలలో ఇలాగే ఉంటుంది.  మీరంతా దొంగలే అయితే, దొంగలే మంచివాళ్ళు, కదా? దొంగలలో ఎవరికైనా దోచుకునేటప్పుడు తప్పు చేస్తున్నామని అనిపిస్తుందా? అలా భావించి మీరు దోచుకోకపోతే అటువంటి వారి దృష్టిలో మీరొక పనికిరాని దొంగ అవుతారు. మిగితా దొంగల దృష్టిలో దొంగతనం చేయకపోవడమే  చెడు కర్మ. అంతే కదా? నిజానికి  కర్మ అనేది మీరు అనుభూతి చెందుతున్నదాన్ని బట్టే ఉంటుంది; అంతేకాని అది మీరు చేసిన పనిని బట్టి కాదు.

మీ మనస్సులోని భావనను బట్టి మీకు సంక్రమించే కర్మ ఉంటుంది. మన జీవితంలో చోటు చేసుకునే పరిణామాలను అంగీకరించాలని పదే పదే చెప్పేది ఇందుకే. మీకు పరిస్థితుల పట్ల సంపూర్ణ అంగీకారముంటే, జీవితం మీ నుండి ఏమి ఆశిస్తుందో మీరు అదే చెయ్యటానికి ఎంత మాత్రమూ వెనకాడరు. యుద్ధం చేయవలసి వస్తే మీరు యుద్ధం చేస్తారు; ఇందులో కర్మ లేదు. కర్మ అనేది భౌతిక క్రియల వల్ల ఉత్పన్నం కాదు, అది కేవలం అటువంటి పని మీరు చేయడానికి గల ఉద్దేశ్యాల వల్ల, భావనల వల్లనే ఉత్పన్నమౌతుంది. సంఘంలో ఎవరో ఒకరు రూపొందించిన నియమ నిబంధనలను అందరూ పాటించి, వాటికి అనుగుణంగా జీవించాలని మీరు ఎలా భావిస్తారు; ఇది అసాధ్యమైనది. అయితే సామాజిక జీవనం కోసం ఇలాంటి నియమాలు కొంతవరకు అవసరమే.

సమాజానికి కూడా ఒక అహం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ సమాజం మొత్తం కలవరపడుతుంది. అది తప్పే కావలసిన అవసరం లేదు. ఉదాహరణకు అమెరికాలో వేసవికాలంలో అందరూ చాలా తక్కువగా బట్టలు వేసుకుని, మినీ స్కర్టుల్లో ఉంటారు. మీరు పూర్తిగా బట్టలు వేసుకొని కనపడితే, వారు కాస్త కలవరపడతారు. ‘’ఈమె ఎందుకిలా చేస్తోంది? ఇన్ని బట్టలు ఎందుకు వేసుకుంది?’’ అని అనుకుంటారు. అదే మన భారతదేశంలో  పూర్తిగా బట్టలు వేసుకోకపోతే కలవరపడి పోతారు. అంటే మనవాళ్లది ఒక రకమైన అహం, వారిది మరో రకమైన అహం. రెండుచోట్లా  కలవరపడుతున్నది సామాజిక అహమే. మీరు చేసే కర్మలు కూడా ఈ సామూహిక కర్మలో భాగమే. దీన్ని మరింత లోతుగా మీరు తెలుసుకోవాలనే నేను కోరుకుంటున్నాను. మీరు మంచి, చెడు అనుకుంటున్నవన్నీ మీకు నేర్పబడ్డవే. మీరు జీవిస్తున్న సామాజిక వాతావరణం మీకు వాటిని అందించింది. కర్మ మీ జీవితానికి సంబంధించినదే కాని, మీ కార్యాచరణకు సంబంధించినది కాదు అని తెలుసుకోండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు