కైలాస పర్వతం - ఓ మార్మిక అనుభూతి

 

 కైలాస పర్వతం అనంతకాలం నుండి పవిత్ర పర్వతంగా భావింపబడుతూ ఉంది. అది వాస్తవానికి ఒక మార్మిక గ్రంథాలయమని సద్గురు వివరిస్తున్నారు. ఆ ప్రదేశ ప్రాధాన్యాన్ని గురించి అంతర్దృష్టులను  సద్గురు ప్రసరిస్తున్నారు, యాత్రికుని అనుభవాన్ని అందిస్తున్నారు.

ప్రశ్న : నేను 2012లో కైలాస్‌కు వెళ్లాను. అక్కడ మీరు మాకందరికీ, మాలో ప్రతి ఒక్కరికీ ఒక దీక్షా ప్రక్రియ జరిపారు. ఇవ్వాళ్టి వరకు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన అనుభవాలలో అదొకటి. మీరు దాన్ని గురించి కొంచెం వివరించగలరా?

సద్గురు : సాధారణంగా దీక్షాప్రక్రియ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జరుగుతుంది. మీకు శూన్య ధ్యానంలోకి దీక్ష ఇచ్చినట్లయితే మీరు ధ్యాన పరులవుతారు, తగినంత శక్తి పొందుతారు, మీ మానసిక ప్రక్రియనుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలిగినంత చైతన్యం పొందుతారు. అదే విధంగా, ఒక్కో లక్ష్యం కోసం ఒక్కో రకమయిన దీక్షలుంటాయి. దీనికి భిన్నంగా కైలాస్‌లో మేము సాధారణంగా చేసేది మీకు ఒక నిర్దిష్ట అనుభవం కలిగించడం కోసం కాదు, అక్కడ ఉన్న ఒక గొప్ప సంభావ్యత కోసం మిమ్మల్ని సంసిద్ధంగా ఉంచడం - అది అన్నిటికన్నా ముఖ్యం. ఇటువంటి దీక్ష తలుపు తెరచి మీరెంత ఇముడ్చుకోగలరో, అంతవరకూ మిమల్ని సిద్ధం చేయడానికి. ఎందుకంటే అక్కడున్న యావత్ అవకాశం ఒక అసాధారణ విషయం. మీలో ఒక్కొక్కరు ఈ దీక్షను భిన్నభిన్నంగా అనుభూతి చెందుతారు. మీరు కోరుకున్నట్లయితే, స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే అది మీకు ఒక అసాధారణ ప్రక్రియ అవుతుంది.

ప్రశ్న :  సద్గురు, మీరు కైలాస్‌ను ఒక మార్మిక గ్రంథాలయంగా వర్ణించారు. ఈ జ్ఞానాన్నంతా కచ్చితంగా ఎక్కడ నిలువ చేశారు. ఈ పంచభూతాల్లో ఏదైనా ఒకదానిలోనా, ఆకాశంలోనా, లేక మొత్తం పర్వతంలోనేనా?

సద్గురు : జ్ఞానాన్ని నిలువ చేసే విషయంలో ఆకాశం ముఖ్యమైనదే; కాని దీన్ని పంచభూతాల్లోని ఆకాశపు స్వభావంలో మాత్రమే నిలువ చేసినట్లయితే, అది చాలా బలహీనమవుతుంది. పంచభూతాలతో పాటు మొత్తం భౌతిక రాశి అంతా ఈ సమాచారపు నిలువకోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనదేమంటే ఒక భౌతికేతర కోణం కూడా ఉంది, ఈ పంచభూతాలతో ఏ మాత్రం సంబంధంలేని ఒక శక్తిని ఈ జ్ఞానాన్ని శాశ్వతంగా నిలువచేయడం కోసం ఉపయోగించడం జరిగింది - స్థూలంగా చెప్పాలంటే,  కైలాస్ పర్వతమే అది. అందువల్లనే అక్కడ పంచభూతాలు కూడా ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రతిధ్వనిస్తాయి. ఈ భౌతికేతర కారణం వల్ల పంచభూతాలు తమ అత్యున్నత స్థాయిలో ఉంటాయి.

 మీరు దాన్ని తాకితే మీ అంతర్ముఖంలో మీరు ప్రజ్వలితమౌతారు,  ఇక దాన్ని చదవడం మీ వంతు పని.

ఆధునిక ప్రపంచంలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానంగా భావిస్తున్నది ప్రకృతిలో ఒక కోణాన్ని పరిశీలించడం ద్వారా ఏర్పరచుకున్న అభిప్రాయాల సమాహారం మాత్రమే. దీనికి భిన్నంగా, ఇక్కడ ఉన్న జ్ఞానం రూఢి పరచుకున్న కొన్ని అభిప్రాయాల సమాహారం కాదు - ఇది ఒక శక్తిమంతమైన ఉత్ర్పేరకం లాంటిది. మీరు దాన్ని తాకితే చాలు మీలోపలా, మీ చుట్టూ కూడా ఎన్నో పరిమాణాలకు ద్వారాలు తెరుస్తుంది. అది నిర్ధారణలు కల్పించే  జ్ఞానం కాదు, ఇది మీలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మీరు దాన్ని తాకితే మీ అంతర్ముఖంలో మీరు ప్రజ్వలితమౌతారు,  ఇక దాన్ని చదవడం మీ వంతు పని.

ప్రశ్న : సామాన్య మాననవులకు అనుభవంలోలేని పరిమాణాలను, కొందరు యోగులుకు  మోసే అధికారం బాధ్యత  ఉందనీ, వారు తమ జ్ఞానాన్ని హిమాలయాలలో నిక్షిప్తం చేశారనీ మీరు చెప్పారు. మీరు ప్రతి సంవత్సరమూ కైలాస్‌కు వెళ్ళేది అందుకేనా?

సద్గురు : మీ ముద్ర వేసి రావడానికి మీరు కైలాస్‌కు వెళ్లరు. నేనటువంటిది చేయను. కైలాస్‌లో అపారమైనదేదో ఉంది. మీ జీవితమంతా అక్కడే గడిపినా మిమ్మల్ని ఆకర్షించేదింకా ఎదో ఉంటుంది. నేను సాధారణంగా తీర్థ యాత్రలకు వెళ్లే అలవాటున్న మనిషిని కాను.  అయినా నేనిక్కడికి రావడం ఇది పదవసారి. ఒకటి గుర్తుంచుకోండి, నేనెక్కడ ఉన్నా కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు, సరిపోతుంది - నేనెక్కడికీ వెళ్లవలసిన అవసరం ఉండదు. నేనక్కడికి నా చాంచల్యం వల్లో, వ్యాకులత వల్లో వెళ్లడం లేదు. శివుణ్ణి కనుక్కోవడానికీ వెళ్లడం లేదు. నన్ను నేను కనుక్కోవడానికి వెళ్లడం లేదు. కాని, కైలాస్ అపరిమిత పరిమాణమే నన్నక్కడికి ఆకర్షిస్తూ ఉంది. ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా మీరు దాన్ని చూసినా దాన్ని చూడడానికింకా అనంత విధాలు ఉన్నాయి. ఇక అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కారణమేమైనా ఉంటే అది మన కాళ్లూ, ఊపిరితిత్తులూ మాత్రమే.

కైలాస్ అపరిమిత పరిమాణమే నన్నక్కడికి ఆకర్షిస్తూ ఉంది

దక్షిణ భారతదేశంలో వెళ్లియంగిరి కొండలు, కైలాస పర్వతమూ, హిమాలయాలలో అనేక  ప్రాంతాలలో యోగుల ముద్రలు నిశ్చితంగా ఉన్నాయి. ఎంతోకాలం గడచిపోయింది, ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. అయినా ఇంకా ఆ ముద్రలు స్పష్టంగా అక్కడ ఉన్నాయి. అక్కడ తమ శరీరంతోకాని, మనస్సుతో కాని కాక, తమ అంతరాంతర మూలంతో పనిచేసినవారి ముద్ర అక్కడ శాశ్వతంగా ఉంది. ఆ ముద్ర అలాగే భద్రంగానే ఉంటుంది కాని, అందరూ దాని అనుభూతి పొందడానికి వీలైన వాతావరణాన్ని సంరక్షించాలి. చుట్టూ ఉన్న జనం చేయవలసిన పని అదే. అది వాళ్ల బాధ్యత. మీరు ధ్యానలింగ పరిసరాల్లో ఒక సంత ఏర్పాటు చేశారనుకోండి, అయినా ధ్యానలింగం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కాని మీరు దాన్ని అనుభూతి చెందగలగాలి కదా. కైలాస్ కాని, మరోచోటుకాని వాటి పరిసరాల్లో ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి, నిర్వహించాలి.

సంపాదకుడి వివరణ: కైలాసపర్వతం - మానససరోవరాల అద్భుత అనుభవాన్ని పొందడానికి ఒక జీవిత కాలపు అవకాశాన్ని Isha Sacred Walks కల్పిస్తుంది. 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1