న్యూమరాలజీని నమ్మడం మంచిదేనా??

కొంత మంది ఏ పని మొదలుపెట్టినా సరే ఈ న్యూమరాలజీ అనే విషయంలో మధనపడుతుంటారు. ఇంతకీ ఈ న్యూమరాలజీని నమ్మాలా లేదా అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు..
 

న్యూమరాలజీ విషయానికి వస్తే.. అంకెలని కనిపెట్టింది ఎవరు..? మీకు పది వేళ్ళు ఉన్నాయి కాబట్టి, మీరు సున్నా నుంచి తొమ్మిది వరకు లెక్కబెట్టారు. మీకు పన్నెండు వేళ్ళు ఉండి ఉంటే.. మీరు మరేదో చెప్పి ఉండేవారు. ఔనా..? కాదా..? అంకెలు అన్నవి మీరు సృష్టించారు. కానీ, ఈ రోజున ఈ అంకెలు మీ జీవితాన్ని నియంత్రణ చేస్తున్నాయి.

అంకెలు అన్నవి మీరు సృష్టించారు. కానీ, ఈ రోజున ఈ అంకెలు మీ జీవితాన్ని నియంత్రణ చేస్తున్నాయి.

ఇది ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది. అప్పట్లో నేను మారుతి కార్ నడిపేవాడిని. నేను నా కార్ ను చాలా ఎక్కువ వాడేవాడిని. చాలా ఎక్కువసార్లు. నా కార్ ని పూర్తి వేగంతో నడిపిస్తుండేవాడిని. కేవలం రెండు సంవత్సరాల్లోనే 1.4 లక్షల కిలోమీటర్లు కార్లో తిరిగాను. దేశం అంతా తిరిగాను. నేను కార్ ని బాగానే అట్టి పెట్టుకున్నాను. కానీ; నేను ఎప్పుడూ చాలా ఎక్కువ శాతం సమయం నా కార్ ని ఫుల్ స్పీడ్ లో నడిపేవాడిని. దీనికి వయసైపోయింది అనుకుని దీనిని అమ్మేద్దామనుకున్నాను.

మాకు తెలిసిన మా మెడిటేటర్స్ లో ఒకరు “మీరు ఆ కారు అమ్మటట్లైతే, అది నాకే అమ్మాలి”  అన్నాడు.  నేను “ఎందుకూ..? “అన్నాను. “లేదు.. నాకు ఆ కార్ కావాలి” అన్నాడు. నేను ఎందుకూ అంటే.. ఆయన “దాని రిజిస్ట్రేషన్ నెంబరు ఓ అద్భుతమైన సంఖ్య. నేను దానిని నా జన్మదిన సంఖ్యతో కూడితే ఫలానా అంకె వస్తుంది.. ఫలానాదౌతుంది.. “ అని ఏదో చెప్పాడు.  నేను “సరే..  ఆ సంఖ్య బాగానే ఉంది కానీ, ఒకసారి కారు నడిపి చూసుకో, నీకది నచ్చుతుందో.. లేదో.." అని అన్నాను. అతను “లేదు నేను నడపక్ఖరలేదు. నాకు ఆ సంఖ్య చాలు. నా న్యూమరాలజీ గురువు నాకు ఆ సంఖ్య నా జీవితానికి అద్భుతమైనది అని చెప్పాడు. నేను ఆ కారు కొనుక్కుంటే నాకు అన్నీ దొరుకుతాయి” అని అన్నాడు. నేను అతనికి నచ్చచెపుదామని చూశాను. కానీ అతను పట్టు పట్టాడు.

దాంతో నేను, “సరే.. నీ ఇష్టం.. నువ్వు మార్కెట్లో దాని ధర ఎంతో కనుక్కొని.. నాకు దానికంటే ఒక పదివేలు తక్కువ ఇచ్చి తీసుకో“ అన్నాను. అతను దానిని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతను వచ్చి నాకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. నేను సరే అన్నాను. ఒక ఫలానా రోజున మూడో నెలలో.. మూడో రోజున.. తొమ్మిదో గంటలో.. ఇలా అంతా.. మీకు తెలుసు కదా..?? అతను డబ్బులతో వచ్చి కార్ తీసుకు వెళ్లాల్సి ఉంది. అతనొక రూపాయి తక్కువ తీసుకుని వచ్చాడు. తొంభైతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు. ఇతను ఈ రూపాయి తక్కువ తీసుకు వచ్చాడు కాబట్టి.. కొంచం అతనికి సిగ్గుగా అనిపించి.. నాకోసం ఒక పదిహేనువందల రూపాయలు పెట్టి బహుమతి తీసుకు వచ్చాడు. నేను అది అవసరం లేదు.. ఫర్వాలేదు.. ఒక్క రూపాయి పెద్ద విషయం కాదు - అన్నాను.

కానీ అతన్ని కొంచం ఏడిపించాలనుకున్నాను. నేనతనితో “నువ్వు రిజిష్ట్రేషన్ నంబర్ అయితే చూసుకున్నావు.. బాగానే ఉంది.  అది  ఏ సమయంలో అయినా  వెయ్యో.. రెండు వేలో.. ఇచ్చి రిజిష్ట్రేషన్ నంబర్ మార్చుకోవచ్చు. కానీ నువ్వు ఇంజిన్ నంబర్, ఛాసీస్ నంబర్ నీ పుట్టినరోజుతో సరిపోతాయో.. లేదో.. చూసుకున్నావా..?“ అని అడిగాను. ఆ మనిషి మళ్ళీ కంగారు పడిపోయాడు. అతను వెంటనే వెళ్ళి ఆ న్యూమరాలజీ గురువుని సంప్రదించాడు. ఆయనకి అసలు ఛాసీస్ నంబర్, ఇంజిన్ నంబర్ అంటే ఏమిటో కూడా తెలియదు. అతను “లేదు..లేదు.. ఆ సంఖ్యలన్నీ కాదు.. ఇదే అసలైన సంఖ్య” అని చెప్పాడు. దానితో అతను పూర్తిగా సంతృప్తి చెంది “ఇదే అసలైన సంఖ్య.. అవన్నీ అక్ఖర్లేదుట “ అన్నాడు. “ఊఁ .. సరే.. అయితే తీసుకో” అని చెప్పి ఇచ్చాను.  అది అతను తీసుకున్నాడు.

మానవ స్వభావం అనేది అంకెలు, రూపాలూ, ఆకారాలూ ఇంకా ప్రాణం లేనివాటన్నింటి కంటే కూడా ఎంతో ఉన్నతమైనది.

నేను ఈ కారుని ఎంతో ఎక్కువగా వాడాను. ఆ సమయంలో నేనెంతగా ప్రయాణాలు చేసేవాడినంటే, ఎన్ని రాత్రులు నేను కార్ లో పడుకున్నానో చెప్పలేను. అతను ఒకరోజు డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఎలా డ్రైవ్ చేస్తాడో నేను ఊహించగలను.. ఎంత భయంతో చేస్తాడో. అతను కోయంబత్తూర్ లో ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు. సీటుని వెనక్కి వాల్చే రిక్లైనర్ ఏదైతే ఉందో దానిలో గేర్ కొద్దిగా విరిగింది. అది వెనక్కి కొంచెం వాలింది. దానితో అతను దుష్ట శక్తులన్నీ అతన్ని వెనక్కి లాగుతున్నాయి అని ఊహించుకున్నాడు. అతను బెదిరిపోయాడు. నేనతన్ని 4-5 నెలల తరువాత కలిశాను. “ నువ్వు బాగున్నావా..? నీ కార్ ఎలా ఉంది..? నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగాను. ఆయన “లేదు, నేను అది ఇచ్చేశాను. ఎందుకంటే నాకు చాలా చెడ్డ విషయం ఒకటి జరిగింది” అన్నాడు. నేను " ఏం జరిగింది..? నువ్వు కార్ తో ఎదైనా గుద్దేశావా..? ఏమిటి..? “  అని అడిగాను. అతను “లేదు, కొన్ని దుష్టశక్తులు నన్ను వెనక్కి గుంజేస్తున్నాయి” అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక గొప్ప నంబర్ కారు ఒకటి కొనుక్కున్నాడు.

మీరు గనక ధైర్యంగా షోరూం నుంచి హుందాగా వీధిలోకి కారు నడపగలిగితే.. ఇదంతా ఎందుకు..?? మీరు మీ సామర్థ్యం మీద ఆధారపడటం లేదు. మీ జీవితం గ్రహాలతో, నక్షత్రాలతో నడవాలి అని అనుకుంటున్నారు. అందుకే ఈ దేశం ఇలా ఉంది. దీనిని మీరు మీ చేతుల్లోకి తీసుకోనంతవరకూ ఇది ఈ విధంగానే ఉంటుంది. మీరు దీనిని మీ చేతుల్లోకి తీసుకోవలసిన సమయం వచ్చింది. మానవ స్వభావం అనేది అంకెలు, రూపాలూ, ఆకారాలూ ఇంకా ప్రాణం లేనివాటన్నింటి కంటే కూడా ఎంతో ఉన్నతమైనది. మీరు చెప్పండి. ఏది పెద్ద ఆవశ్యకత..? మీరు ఇక్కడ మానవుడిగా సజీవంగా ఉండడమా..? లేదా రాళ్లూ, రప్పలూ ఇంకా భూమీ మీ జీవితాన్ని నియంత్రణ చెయ్యడమా..? మానవ నైజమే అన్నిటి గమ్యం నిర్ణయించాలి. కానీ మిగతా అన్నీ విషయాలూ మానవ నైజాన్ని నిర్ణయిస్తున్నాయి. ఇది నిజంగా మానవాళికీ ఎంత సిగ్గుచేటు..?

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1