జీవితంలో పూర్తి నిమగ్నతే ఆధ్యాత్మికత

 

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇక్కడ ఏ పరమార్థమూ ఆశించకుండా జీవించడమే. దానర్థం ఏ పనీ చెయ్యకుండా, బద్ధకంగా కూచోమని కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇప్పుడు జీవితంలో ఏమి జరుగుతోందో అందులో పూర్తిగా నిమగ్నమై జీవించడమే, ఏదో ప్రత్యేకమైన లక్ష్యం కోసం మాత్రమే కాకుండా, అంటే ఏది వచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధమై, బ్రతకడం. మీరు ఇక్కడ..."రేపు ప్రపంచం ఏమయిపోయినా ఫర్వాలేదు. కానీ, ఇప్పుడు నేను చేస్తున్న పనిని మాత్రం మనస్ఫూర్తిగా చేస్తాను," అని నిశ్చయించుకుని కూర్చోగలిగితే, మీరు సహజంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారన్నమాట.

నేను వాళ్ళను నా దగ్గరకు పిలిచి నాతోపాటు కళ్ళు మూసుకుని మౌనంగా కూచోమని చెప్పాను. అంతే! ఒక్క మాటైనా చెప్పకుండా అంతా దానంతట జరిగిపోయింది

కొన్నేళ్ళ క్రిందట ప్రపంచంలోనే ఎత్తైన అనేక పర్వతాలని అధిరోహించిన పర్వతారోహక సభ్యుల బృందాన్నొకదాన్ని కలిసాను. వాళ్ళు ఉత్తరధృవం వరకు నడిచిన వాళ్ళు, ప్రపంచంలోనే ఎత్తైన పర్వతశ్రేణి, సముద్రమట్టానికి 13 నుండి 20 వేల అడుగుల ఎత్తు ఉన్న దక్షిణ అమెరికాలోని ఆండిస్(Andes) పర్వతాల్ని ఎక్కుతూ మంచి చలికాలంలో 3 నెలలు గడిపినవాళ్ళు. మరునిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని చోటుల్లో ఉండడానికి ఉబలాటపడే వాళ్ళు వారు. వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. మన స్వయంసేవకులొకరు వారితో "ఇన్నర్ ఇంజనీరింగ్" కార్యక్రమం గురించి మాటాడుతున్నారు. నేను వాళ్ళను నా దగ్గరకు పిలిచి నాతోపాటు కళ్ళు మూసుకుని మౌనంగా కూచోమని చెప్పాను. అంతే! ఒక్క మాటైనా చెప్పకుండా అంతా దానంతట జరిగిపోయింది.

వాళ్ళు జీవితంలో ఎన్నడూ ఆధ్యాత్మికత అన్న విషయం గురించి ఆలోచించలేదు. వాళ్ళకి కావలసిందల్లా సాహసం చెయ్యడమే. రాబోయే క్షణం ఏ సమస్య తెచ్చిపెడుతుందో అన్న చింతలేకుండా బ్రతకదలచిన వాళ్ళు వారు.

వాళ్ళకి నేనేమీ బోధించవలసిన అవసరం లేదు. వాళ్ళు అన్నిటికీ సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి నేను చెయ్యవలసిందల్లా కేవలం వారిలో ఆ జ్వాలను వెలిగించడమే. వాళ్ళ శరీరాలు ఆరోగ్యంగా ధృఢంగా ఉన్నాయి, వాళ్ళ మనసులు దేన్నైనా స్వీకరించడానికి తెరుచుకుని సంసిద్ధంగా ఉన్నాయి. కావలసిందల్లా అదే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు