మృత్యు భయాన్ని అధిగమించడం ఎలా??

 

మృత్యువు గురించి చాలా మంది భయపడుతుంటారు. కాని నిజంగా మరణం అన్నది ఉందా, లేక దీనిని సరైన విధానంలో మనం అర్ధం చేసుకోలేదా? అనే ప్రశ్నలకి కూడా సద్గురు సమాధానం ఇస్తున్నారు.

ప్రశ్న: మృత్యు భయాన్ని నేనెలా అధిగమించాలి..?

సద్గురు: మొట్టమొదటిగా ఉన్నది భయం. మరణం అనేది కేవలం దానికి ఆజ్యం పోస్తోంది. చాలామందికి భయం అన్నది ఎప్పుడూ సహచారిగా ఉంటుంది. ఒక్కోసారి అది కంట్రోల్ లో ఉంటుంది. ఒక్కోసారి అది కంట్రోల్ చేయలేని విధంగా ఉంటుంది. కానీ.. వారికి ఎప్పుడూ భయం ఉంటుంది. అసలు భయం అన్నది ఎందులో వేళ్లూనుకుని ఉన్నది..? మీ మృత్యువులో వేళ్లూనుకుని ఉన్నది. కానీ, భయం ఎందుకూ..? దీని మెకానిక్స్ ఏమిటి..? ఇది మీకు ఎందుకు కలుగుతోంది..? మీరు ఎప్పుడూ తరువాతి క్షణం గురించే భయపడుతున్నారు. ఈ భయాలన్నీ కూడా తరువాతి క్షణాల గురించే. ఈ క్షణం గురించిన భయం మీకు లేదు. అంటే, భయం అన్నది నిజం కాదు.   భయం అన్నది మీరు ఊహించుకుంటున్నది. ఏదైతే లేదో దాని గురించి మీరు బాధ పడుతున్నారు. ఏదైతే లేదో దానిగురించి ఎందుకు బాధ పడుతున్నారు...? ఎందుకంటే మౌలికంగా మీరు సత్యంలో వేళ్లూనుకుని లేరు కాబట్టి.   మీరు ఊహాగానంలో విహరిస్తున్నారు.

మీరెప్పుడైనా మరణించారా..??

మీరు ఎప్పుడూ మరణించలేదు. అంటే, మీకు మరణం యొక్క అనుభూతి లేదు. ‘నేను మరణించాను’ అని, మీతో చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. మీరు ఎవరైనా మరణించిన పురుషుడిని కానీ స్త్రీని కానీ చూసారా? లేదు, మీరు కేవలం శవాన్నే చూశారు.

అంటే, మీకు ఆ అనుభూతి లేదు. మీరు చూడలేదు. మీరు దానిగురించి వినలేదు. మరి, మీకు ఈ మరణం అన్న ఆలోచన ఎక్కడినుంచి కలుగుతోంది..?? మరణం అన్నది ఊహే..! మరణం అన్నది కేవలం అజ్ఞానంలో ఉన్న మనస్సులో ఉన్నది. నిజానికి, మరణం అనేటటువంటిది ఏదీ లేదు. ఉన్నదల్లా జీవితం..జీవితం..జీవితం మాత్రమే..!! ఇది ఒక పార్శ్వంలోనుంచి మరొక దానిలోనికి, మరొక పార్శ్వం లోనికి, ఇంకొక పార్శ్వం లోకి  కదులుతోంది.

మీరు ఒకసారి అప్పు తీసుకున్న తరువాత, ఏదో ఒకరోజున  మీరు అప్పుని తిరిగి ఇచ్చేసేయ్యాలి కదా..?

మీరు పుట్టినప్పుడు ఈ శరీరం ఎలా ఉంది..? ఎంతో చిన్నగా ఉంది. ఇప్పుడది ఇంత అయ్యింది. మీరు తీసుకున్న ఆహారం వల్ల. ఆహారం అంటే ఏమిటీ..? ఆహారం అంటే కేవలం ఈ భూమిలోని చిన్న ముక్క మాత్రమే..! అంటే, మీరు మెల్లగా ఈ భూమినుంచి ఏదో తీసుకుని ఈ విధంగా తయారయ్యారు. దానర్ధం మీ శరీరం అన్నది తీసుకున్న అప్పు లాంటిదే..! మీరు ఈ గ్రహం నుంచి తీసుకున్న అప్పే. అంటే.. మీరు అప్పులో ఉన్నారు. మీరు ఒకసారి అప్పు తీసుకున్న తరువాత, ఏదో ఒకరోజున  మీరు అప్పుని తిరిగి ఇచ్చేసేయ్యాలి కదా..? ఉదాహరణకి మీరు ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారనుకుందాం. మీరు వంద కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లైతే.. ఎన్ని సంవత్సరాల తరువాత అయినా సరే. మీరు ఈ వంద కోట్లు చెల్లించాల్సిందే. బ్యాంక్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ అప్పు తీర్చమని అడిగినప్పుడు, అది మీరు మరో వందకోట్లు గడించినా. మీరు, దానిని సంతోషంగా తిరిగి ఇచ్చేసేయ్యాలి కదూ..? ఎందుకంటే, మీరు మరో వందకోట్లని, ఈ వంద కోట్లతో సంపాదించారు కాబట్టి. అదే మీరు వంద కోట్లు తీసేసుకుని, దానిని చెల్లాచెదురు చేసేసి సరిగ్గా వాడనట్లైతే, వాళ్ళు లోన్ తిరిగి తీసుకోవడానికి వచ్చినప్పుడు  మీరు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటారు. అన్నిరకాల అబద్ధాలూ చెబుతారు.

ఇప్పుడు మీ జీవితం కూడా ఇలానే ఉంది. "ఇది"(శరీరం) మీరు ఈ భూమి నుంచి తీసుకున్న అప్పు లాంటిది. మీరు దీనిని ఎంతో అద్భుతమైనదిగా, మీ జీవితానుభూతిని గొప్పగా చేసుకుని ఉన్నట్లైతే, మీకు ఋణం తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు దానిని ఎంతో ఆనందంగా తీర్చివేస్తారు. మీరు అలా చేయనప్పుడు, మీరు పరుగెడతారు, అబద్ధాలు చెప్తారు, దాక్కుంటారు. మీరు అన్ని రకాల పనులూ చేస్తారు. మీరు ఏమి చేసినా సరే, వాళ్ళు మీరు తీసుకున్న అప్పునైతే తిరిగి తీసుకుంటారు.

అందుకని, మీరు ఇప్పుడు మరణం గురించి ఆలోచిస్తున్నారు. మీరు మరణాన్ని సరి చేసుకుందామని ఆలోచించకండి.  జీవితాన్ని సరి చేసుకోండీ. మీ జీవితాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు..? రేపు ఉదయం కనుక మీరు మరణించాలన్నా ఎటువంటి సమస్యా ఉండకూడదు. మీరు మీ జీవితాన్ని ఈ క్షణం సంపూర్ణంగా జీవించినట్లైతే, అప్పుడు మీరు మరు క్షణంలో మరణించాలంటే, సమస్య ఏముంది..?? మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించనప్పుడే మీరు దానిని పట్టుకు వేలాడాలని అనుకుంటారు. మీరు సంపూర్ణంగా, ఆనందంగా జీవించినట్లైతే, మీరు రేపు ఉదయం మరణించాలంటే, అందులో సమస్య ఏమి ఉంది..?? మీరు తీసుకున్న ఋణాన్ని తిరిగి చెల్లించాలని అనుకోవడం లేదు.

ఎవరైతే వాళ్ళు తీసుకున్న రుణాన్ని అంతా చెల్లాచెదురు చేసేస్తారో, వారికి బ్యాంక్ అధికారులు వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఎవరైతే ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకుని, దానిని ఎన్నో రెట్లు పెంపొందింపజేశారో, వారికి బ్యాంక్ అధికారులు వస్తే, వారు మీకు ఒక స్నేహితుడిలాగా కనిపిస్తారు. అదే మీరు కనుక వ్యాపారంలో నష్టపోయినట్లైతే, వారే మీకు ఒక పోలీసు అధికారిలా కనిపిస్తారు. ఇది అనుభూతి కదూ..?? ఇక్కడ కూడా అదే జరుగుతోంది..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు