మనం మన ప్రతికూల భావాలని, కోపాన్ని జయించడం ఎలా? అన్న ఈ ప్రశ్నకి సద్గురు సమాధానం ఈ వ్యాసంలో చదవండి.

ఎవరైనా ఎంతో విలువైనదాన్ని జయించాలని అనుకుంటారు. మీకు అవసరం లేనిదానిని ఎందుకు జయించాలని అనుకుంటారు? అందుకని,  మొదట జయించడం అన్న ఆలోచనని వదిలెయ్యండి. ఎప్పుడో ఒకసారి మీకు కోపం వస్తుంది. ఎందుకంటే, ఉన్నట్టుండి  మీ శరీరం, మీ మనస్సు, మీ శక్తి మీకు కావలసిన విధంగా ప్రవర్తించడం లేదు కాబట్టి..! కోపం అన్నది ఎల్లప్పుడూ లేదు. ఏదైతే సృష్టిలో ఎల్లప్పుడూ లేదో, దానిని జయించడం లేదా నియంత్రించడం అన్నది - ఉట్టి వ్యర్థమైన శ్రమ. ఒక్కొక్కసారి మీ మనస్సు చికాకుగా మారుతుంది. అందులో ఒక రూపాన్ని మనం కోపం అంటాం.

ఎలాగూ ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉంది. మీరు కూడా మీ లోపల చిరాకుగా ఉండవలసిన అవసరం ఏమి ఉంది..?

ఎవరైనా తనని తాను, చిరాకుగా ఎందుకు మలచుకుంటారు..? ఎలాగూ ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉంది. మీరు కూడా మీ లోపల చిరాకుగా ఉండవలసిన అవసరం ఏమి ఉంది..? మీ చుట్టూరా పరిస్థితులు గనుక చిరాకుగా ఉంటే, మీరు కూడా చిరాకుగా మారిపోతారు..! కానీ ఇందులో ఏ రకమైన మేధస్సు ఉంది, చెప్పండి..? ముఖ్యంగా,  మీ చుట్టూరా పరిస్థితులు గనుక చిరాకుగా మారినప్పుడు, మీలో మీరు ప్రశాంతంగా ఉండడం, ప్రసన్నంగా ఉండడం ఇంకా ఎక్కువ ముఖ్యం.. అవునా..? కాదా..? నేను మిమ్మల్ని కోపం తెచ్చుకోవద్దు - అని చెప్పడం లేదు. అది మీ ఇష్టం. ఒకవేళ అది మీకు మధురానుభూతిగా ఉంటే, మీరు ఎప్పుడూ కోపం తెచ్చుకోండి. కానీ, సహజంగా బాధితులకంటే కూడా కోపం వచ్చినప్పుడు మీరే ఎక్కువ బాధపడతారు. అప్పుడు ఇంక ఉపయోగం ఏమి ఉంది..?

మీకు మీరే ఎందుకు చిరాకు కలిగించుకుంటున్నారు..? ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉండనే ఉంది. మీరు, ఈ ప్రపంచంలో నడుస్తూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడో - అక్కడో చిరాకులన్నవి ఉన్నాయి. మీరు ఎంత ఆపాలని చూసినా సరే, మీరు ఎక్కడోక్కడ చిరాకులోనికి ఆడుగు పెడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకించి మీకుగా మీరు చిరాకుని తయారు చేసుకోవలసిన అవసరం ఏముంది..? అలాంటి అవసరమే లేదు..! అందుకని మీకు అక్కర లేనివాటిని ఎందుకు సృజించుకుంటున్నారు..?

మీకు, “మీతో మీరు”  ఏమి చేసుకుంటున్నారో తెలియడం లేదు. ఎరుకతో లేకపోవడం వల్ల మీరు ఇలా చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి. మీ కళ్ళు మూసుకొని మీ ఇంటికి డ్రైవ్ చెయ్యడానికి ప్రయత్నం చేయండి. ఎంతో కష్టపడి, వారిని వీరినీ గుద్ది ఎలాగో ఒక లాగ ఇల్లు చేరుకోగలరేమో..! కాని ఇలానే ప్రతీరోజూ ప్రయత్నం చేస్తే, కొద్ది రోజుల తరవాత జీవించి ఉండరు. ఇప్పుడు మీరు చేసేది కూడా ఇలానే ఉంది. మీరు మీ శ్రేయస్సుని కళ్ళు మూసుకొని నియంత్రించాలని చూస్తున్నారు. ఇలా మీరు ఏమి చేసినా సరే, మీకు శ్రేయస్సు దొరకదు. దీనిని మీరు కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరుచుకుని నియంత్రించాలి. కదూ..?

ప్రేమాశిస్సులతో,
సద్గురు