జ్ఞానోదయం పొందిన వ్యక్తి అన్నిటినీ మాయగా చూస్తాడా?
 
 

జ్ఞానోదయం పొందిన వ్యక్తి అనుభవంలో అందరూ ఎలా కనిపిస్తారు. ఆయనకు ప్రజలతో నిమగ్నమవుతాడా లేదా ఇదంతా మాయగా చూస్తాడా..ఇలాంటి ప్రశ్నలకి సద్గురు సమాధానాన్ని ఈ వ్యాసంలో తెలుసుకోండి..

ప్రశ్న: జ్ఞానోదయం పొందిన వ్యక్తి ప్రతిదానిని మాయగా భావిస్తాడా..? అంటే మిమ్మల్ని ప్రేమించిన వారెవరైనా జ్ఞానోదయం పొందితే, వారికి మీరు అర్థం లేని విషయంగా కనిపిస్తారా..?

సద్గురు: నా చుట్టూరా ఉన్న ప్రజల్ని మీరు అడగాలి. నేను వారిని ప్రేమిస్తానా..? వారితో నిమగ్నమై ఉంటానా..? అని. ఎన్నో వేల మంది ప్రజలతో నేను ఎంతో లోతుగా, ఎంతో ఇష్టపూర్వకంగా నిమగ్నమై ఉన్నాను. మీకు బాధల నుంచి, బాధ గురించిన భయం నుంచి విముక్తి కలిగినప్పుడు, మీరు జీవితంతో నిమగ్నమవ్వడానికి వెనుకాడతారా..? లేదా జీవితంతో పూర్తిగా నిమగ్నమై ఉంటారా? ప్రస్తుతం మీరు ప్రతిదాని గురించి భయపడుతున్నారు.

ఉదాహరణకి, రోడ్డు మీద ఎవరైనా వెళ్తూ మిమ్మల్ని చూసి నవ్వారనుకోండి, మీరు వెంటనే, ‘ఈ మనిషి నన్ను చూసి ఎందుకు నవ్వాడు..?’ అని భయపడతారు. ఎందుకంటే దానివల్ల ఎటువంటి పరిణామం సంభవిస్తుదో అని మీరు భయపడుతున్నారు కాబట్టి. మీరు ఇలా ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటే, మీరు జీవితంలో దేనిలో నిమగ్నమవ్వాలన్నా సరే, మీకు భయమే..! నేను బాధపడతానేమో అన్న భయాన్ని మీలో తీసేశామనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరు ప్రతీదానికీ సంపూర్ణంగా అంకితం చేసుకోగలరు. అవునా? కాదా? నేను కేవలం మీతో తార్కికంగా మాత్రమే మాట్లాడగలను. మరో భాష మాట్లాడితే అది మీకు తార్కికంగా అనిపించదు.

ఫజ్జీ లాజిక్( గజిబిజి తర్కం)

మనం ఏ రకమైన తార్కాన్ని చెయ్యాలనుకున్నా సరే, దానికి ఇద్దరు కావాలి. మీరు జ్ఞానోదయం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నది కేవలం ఒక్కటే. ఇప్పుడు ఆధునిక శాస్త్రం ప్రకారం, ఈ రోజున ఫిజిక్స్ ఏ స్థాయికి చేరుకున్నదంటే, అది ఇప్పుడు పూర్తిగా తార్కికమైనది కాదు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు తర్కంలో చాలా పెట్టుబడి పెట్టేశారుకాబట్టి, వారికది తార్కికమైనది కాదు అని చెప్పడం ఇష్టం లేదు. అందుకని దానికి "ఫజ్జీ లాజిక్" అన్న పేరు పెట్టారు. వారి భయం ఏమిటంటే, వారు గనుక దీనికి తార్కికమైన విధానాల్లేవు అని ఒప్పేసుకుంటే అప్పుడు శాస్త్రాన్ని పరిశోధన చేసే అవకాశం ఉండదు. అందుకు ఈ రకమైన మాటలని కనిపెట్టారు.

మీరు తార్కికంగా ఉండాలనుకుంటే మీరు ఒక పదునైన కత్తిలాగా ప్రతిదాన్నీ కోసి చూడగలిగేలా ఉండాలి. మీరు గనుక మసకబారినట్లు ఉంటే, మీరు తార్కికంగా ఎలా ఉంటారు..? అందుకని ఫజ్జీ లాజిక్ అన్నదే అసలు తార్కికమైనది కాదు. తార్కికమైన విధానంలో మనం వేటినైనా పరిశోధించడానికి ఎన్నో పరిమితులు ఉన్నాయని ప్రస్తుతం ఆధునిక శాస్త్రం గ్రహిస్తోంది. అది మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థానం దాటి తీసుకుపోలేదు. ఇది మంచి అవగాహనే..!

ఈ సృష్టి ఏ విధంగా ఉందో, ఆ విధంగా చూడడం మీరు గొప్ప విషయం కాదనుకుంటున్నారు. మీరు ఊహించిన విధంగానే సృష్టి ఉండాలనుకుంటున్నారు.

ఇప్పుడు మీరు మాయ అంటున్నారు. ఒకవేళ, అది మాయ అయ్యుంటే, దానిని చూడడంలో మీకు సమస్య ఏముంది..? ఉదాహరణకి మీ పక్కన కూర్చున్న మనిషి కేవలం ఒక గాలి బుడగ అనుకోండి. దానిని అదే విధంగా చూడడంలో మీకున్న సమస్య ఏమిటి..? మీరు అందులో ఏదో పెట్టుబడి పెట్టారు. మీకు దాని మీద(మనిషి) కొన్ని ఇష్టాయిష్టాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు జ్ఞానోదయం గురించి మాట్లాడకూడదు. మీరు కేవలం సాధకుడైతే మాత్రమే, సత్యాన్వేషకులైతేనే మీరు దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఎం చెబుతున్నారంటే, మీ పక్కన ఉన్న మనిషి కేవలం గాలి బుడగ అయినప్పటికీ, మీరతను బంగారంతో చేయబడ్డాడు - అని అనుకోవాలనుకుంటున్నారు. ఫర్వాలేదు. నేను మీతో ఒక స్నేహితుడిగా మాట్లాడగలను. కానీ, నేను మీతో జ్ఞానోదయం గురించి మాట్లాడలేను. ఎందుకంటే మీకు అలాంటి ఉద్దేశ్యం లేదు కాబట్టి.

మీకు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే ఉద్దేశ్యం లేదు. ఈ సృష్టి ఏ విధంగా ఉందో, ఆ విధంగా చూడడం మీరు గొప్ప విషయం కాదనుకుంటున్నారు. మీరు ఊహించిన విధంగానే సృష్టి ఉండాలనుకుంటున్నారు. ఇదొక మూర్ఖమైన విషయం. ఎందుకంటే, మీరు ఈ సృష్టిలో ఒక చిన్న భాగం మాత్రమే..! మీరు జీవితం గురించి ఏమి ఊహించుకుంటున్నా సరే, ఈ సృష్టి అన్నది అంతకంటే ఎన్నో రెట్లు అందమైనది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే, మీరు ఈ సృష్టిలో ఒక చిన్న రేణువు మాత్రమే..! మీరే దానిగురించి ఇంత గొప్పగా ఆలోచించగలిగినప్పుడు ఏదైతే మిమ్మల్ని సృష్టించిందో అది మరెంతో పెద్దది..కదూ..? కనీసం ఇలా చూడడం, ఒక రకమైన తార్కిక విధానమే..! అవునా, కాదా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1