నిరాపేక్ష - విముక్తి

 

 సాధారణంగా ప్రార్థనలన్నీ ఆశ కల్పించేవిగా ఉంటాయి. కానీ, యోగ సంప్రదాయం మాత్రం నిరాపేక్షనే పెంపొందిస్తుంది అంటున్నారు సద్గురు. ఎవరైనా సంతోషంగా అపేక్షను వదులుకోవడానికి సిద్ధమైతే, వారికి విముక్తి ఒక స్వేచ్ఛా ప్రక్రియ అవుతుందంటున్నారు సద్గురు.

చాలావరకు ప్రార్థనలన్నీ మనలో ఆశను పెంపొందిస్తాయి. అవి వైరాగ్యాన్ని కలిగించవు. ప్రార్థనలు ఇలానే తయారు చేయబడ్డాయి మరి. అవి ఆశను, మరింత ఆశను, మరెంతో ఆశను కల్పిస్తాయి. అపేక్ష లేనటువంటి గుణాన్ని మనుషులు గుర్తించడం లేదు. అపేక్ష లేకపోవడం అన్నది అంతం లేని అగాధం(గుంట) వంటిది. అంతం లేని అగాధంలోకి భద్రంగా దూకవచ్చు. ఒక గుంటతో సమస్య ఏమిటంటే దానికి ఒక అంతం ఉంటుంది. అంతం లేని అగాధంలోకి దూకడంలో సమస్య ఏముంది? అదొక అద్భుతమైన గెంతు వంటిది. మీరు స్కైడైవింగ్ చేశారనుకోండి. మీరు పైకి వెళుతున్నారో, కిందికి వెళుతున్నారో, ఎక్కడికీ వెళ్లడం లేదో మీకు తెలియదు. ఎందుకంటే దానికొక సందర్భం లేదు. మీరు కిందికి చూస్తే మాత్రమే భూమి అతివేగంగా మీ వంక దూసుకు వస్తున్నట్లనిపిస్తుంది. ఇది కిందికి చూసినప్పుడే మీకు తెలుస్తుంది. కింద భూమే లేదనుకోండి, దూకడం, ఆకాశంలో అనంతంగా ఎగరడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

యోగ సంప్రదాయంలో మేమెప్పుడూ ప్రజలలో నిరాఆపేక్షను పెంచి పోషిస్తుంటాం. మీకు దేని మీదైనా అపేక్ష లేకపోతే దానిని పట్టుకొని వేలాడడం మానేస్తారు. మీరు దేన్నీ పట్టుకొని వేలాడకపోతే మీరు ముక్తి పొందినట్లే. ఇది చాలా తేలిక పద్ధతి. ఏదీ మిమ్మల్ని పట్టుకొని వేలాడదు. మీరే రకరకాల వాటిని పట్టుకొని వేలాడుతుంటారు.

ఒక అనుభవంగా ప్రేమానురాగాలు పరవాలేదు. కాని మీ జీవన సూత్రాలుగా అవి అర్థరహితమైనవి.

మీరు దేన్నీ పట్టుకొని వేలాడకపోతే, సహజంగానే మిమ్మల్నేదీ పట్టుకోలేదు. అంటే మీరు సంతోషంగా దేని మీద అపేక్ష పెట్టుకోకుండా ఉండగలిగితే ముక్తి అన్నది ఒక స్వేచ్ఛా ప్రక్రియ అవుతుంది. కాని ఆశ గురించి ఎంతో బోధించడం జరిగింది. ప్రేమ, అనురాగాలకు వ్యతిరేకంగా మాట్లాడి నేనిప్పటికే ఈ ప్రపంచంలో ఎందరో శత్రువులను సంపాదించుకున్నాను. ఒక అనుభవంగా ప్రేమానురాగాలు పరవాలేదు. కాని మీ జీవన సూత్రాలుగా అవి అర్థరహితమైనవి. ‘‘నేను ఫలానా వారిని ప్రేమించదలచుకున్నాను’’ అని చెప్పడం తెలివితక్కువతనం. ఈ మాటలు మీలో ఒక నిస్పృహ, ఒక అసంపుర్ణత్వం వల్ల  వస్తాయి. మీ భావాలు మీ చుట్టూ ఉన్న ప్రతి దాని విషయంలోనూ మధురంగా ఉన్నట్లయితే అది అద్భుతమైన జీవితమే. మీరు దాన్ని ప్రేమ అనదలచుకుంటే మంచిదే. కాని మీరు దాన్ని ఒక వినియోగవస్తువుగా, మీరు ఉపయోగించుకోదగిందిగా మార్చుకుంటే అది అసహ్యంగా తయారవుతుంది.

శివుడు నిరాపేక్ష భావాన్ని పోషించాడు...

యోగ సంస్కృతి ఎల్లప్పుడూ ప్రజల్ని నిరాపేక్ష వైపు ప్రోత్సహించింది; శూన్యం వైపు ప్రోత్సహించింది. అందుకే శివుని అత్యంత సన్నిహిత శిష్యులు ఆయన్ని ‘‘మేం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మాతో ఉంటారా?’’  అని అడిగినప్పుడు, ఆయన వాళ్లవైపు విచిత్రంగా చూసి ఇలా అన్నాడు, ‘‘మీరు ఇబ్బందుల్లో ఉంటే, నేను నిద్రపోతాను’’ అని. వారు ఆయన పట్ల ఆశ వదులుకునేలా చేస్తున్నాడు. ‘‘నేనక్కడ ప్రత్యక్ష మవుతాను, మీరెక్కడున్నా అక్కడికొక గెంతువేసి మిమ్మల్ని ఆదుకుంటాను’’ అని ఆయన చెప్పలేదు. ‘‘నేను నిద్రపోతూ ఉన్న సమయంలో, నేను సర్వత్రా ఉంటాను. అందువల్ల మీ పక్కన కూడా ఉంటాను’’ అని ఆయన చెప్పలేదు. అలా అంటే వారిలో ఆశ కలిగేది. అందువల్ల ఆయన అలా వివరించలేదు. ‘‘నేను నిద్రలోకి వెళతాను’’  అన్నాడాయన. అందువల్ల వాళ్లు ఆయన మీద ఆశ వదిలిపెట్టారు. ఈ మనిషి మీద ఆశ పెట్టుకుంటే ఏం లాభం? నిరాపేక్ష అంటే వదులుకోవడమే. అంతేకదా! ఇతని కోసం  చూసి, సహాయం అడగడంలో అర్థం లేదని వాళ్లు తెలుసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడిక వాళ్లు దేనికయినా సిద్ధంగా మారిపోయారు. ఇప్పుడు జరగవలసిన పనులు జరుగుతాయి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు