Sadhguruనేనెప్పుడూ ఎక్కడికీ వెళ్ళి ఏదీ నేర్చుకోలేదు. ఆధ్యాత్మిక శిక్షణ అంటూ ఏదీ పొందలేదు. కానీ నాకు, ఆధ్యాత్మికతకు సంబంధించినంతవరకు తెలియని అంశం అంటూ ఏదీ లేదు. నేను దీనిని ఎప్పుడూ మొస్తూంటానని  కాదు. నేనలా వీధిలో నడుచుకుంటూ వెళితే ఒక చిన్న పిల్లాడిలానే ఉంటాను. నాకు ఈ జ్ఞానాన్నంతా ఒక భారంలా మోయవలసిన అవసరం లేదు. కానీ ఆధ్యాత్మిక పరిధిలో, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నాకు ఏమి చేయాలో తెలిసిపోతుంది. రోజువారీ జీవన పరిస్థితుల విషయం మాట్లాడడం లేదు, ఆధ్యాత్మిక పరిధిలో ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఏమి చేయాలో నాకు తెలుస్తుంది.

ఎన్నో ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, నాతో పాటు వచ్చినవారికి ఓ విషయం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేమిటంటే, నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే, అక్కడ జరిగిన ఆధ్యాత్మిక చరిత్ర అంతా చెప్పేయగలను. ఇది చారిత్రిక సంబంధమైనది కాదు. ఆధ్యాత్మిక సంబంధమైనది. నిజానికి ఈ రెండూ ఎక్కడో ఒక చోట ముడిపడతాయి. ఇది ఏదైనా చదవడంవల్లో, విద్యవల్లో వచ్చేది కాదు. ఇది ఒక రకమైన గ్రాహ్యాత. ఇది మరో విధమైన సంభావ్యత.

ఎంతో మంది ఆధ్యాత్మికత కలిగినవారు అసలు ఏమీ మాట్లాడలేదు. ఏమీ నేర్పించలేదు. కానీ, వారికి తెలిసినదాన్నంతా ఒక నిర్దిష్టమైన విధానంలో నిక్షిప్తం చేస్తూనే వున్నారు.

ఆధ్యాత్మికత గురించి ఎంతో మంది మహానుభావులు అసలు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజల అనుభూతిలో లేని దాని గురించి మాట్లాడితే, మీరు చిక్కుల్లోనే పడతారు - అందుకని. మాట్లాడిన వారికి, దాని వల్ల ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, వారిని శిలువ వేసినా వేసేయవచ్చు. ఒకొక్కసారి దాదాపుగా వారిని శిలువ వేసే వరకూ వచ్చిన తరువాత, ఏదో మాయలు చేసి, తప్పించుకోవలసి వస్తుంది. ఈ రోజుల్లో ఇది మరో విధంగా జరుగుతోంది. ప్రజలకు నచ్చనిదేదైనా చెపితే – వారి మీదకి టాక్స్ వారినో, పోలీసువారినో పంపిస్తారు. ఇలా మరో విధంగా శిలువ వేయడం జరుగుతుంది.

అందుకే చాలా మంది  ఆధ్యాత్మికులు అసలు ఏమీ మాట్లాడలేదు. అంటే వీరు మానవాళికి ఏదీ అందించలేదని కాదు.  నా భాషలో చెప్పాలంటే, వారు వారి గుడ్లను ఎప్పుడూ అన్ని చోట్ల పెడుతూనే ఉంటారు. అంటే వారి విజ్ఞాన్ని నిక్షిప్తం చేస్తూనే ఉంటారు. ఎంతో మంది ఆధ్యాత్మికత కలిగినవారు అసలు ఏమీ మాట్లాడలేదు. ఏమీ నేర్పించలేదు. కానీ, వారికి తెలిసినదాన్నంతా ఒక నిర్దిష్టమైన విధానంలో నిక్షిప్తం చేస్తూనే వున్నారు. మీరు నన్నడిగినట్లైతే, నాకు గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం వాడు కాదు, నాకు ఆయన ఈరోజు కూడా సజీవంగా అందుబాటులోనే ఉంటారు.   ఎన్నో వేల కొలది  గురువులు ఈ విధంగానే ఉంటారు.  వారు వారికి తెలిసినదంతా అలా సజీవంగా నిక్షిప్తం చేశారు.

“గు”  అంటే అంధకారం. “రు“ అంటే తొలగించేవాడు.

“గురుపూజ” అంటే ఎన్నో సంభావ్యతలను ఆహ్వానించడం. ఇక్కడ మేము ఈ దీక్షని ఒక విధానంలో ఇస్తున్నాం. అది కొన్ని పదార్థాలతో కూడుకొన్నది. వీటితో ఒక రకమైన పరిస్థితిని ఏర్పాటు చేసి, కొంత శక్తిని, ఆవశ్యకతలను సృష్టించడం. గురువు అంటే మనకు తెలిసినవాడనో, తెలియనివాడనో అర్థం కాదు. “గు”  అంటే అంధకారం. “రు“ అంటే తొలగించేవాడు. ఎవరైతే మీ అంధకారాన్ని తొలగిస్తారో, వారే మీ గురువు. ఈ కోణం సృష్టిలో ప్రతీ చోటా ఎల్లప్పుడూ మీకు అందుబాటులోనే వుంది. కాకపోతే మీకు గ్రాహ్యాత  ఉంటేనే, మీరు దాన్ని అందుకోగలరు. గురుపూజ అనేది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఎంతో క్షుణ్ణంగా, ఎంతో శక్తివంతంగా చేయవచ్చు. ఇక్కడ మేము ఒక సరళమైన విధానాన్ని అందించాం. ఇది ఎన్నో సరికొత్త ఆవశ్యకతలను మీ ముందు ఉంచుతుంది. మీకు తెలియని ఎన్నో విషయాలను ఇది మీకు సజీవం చేస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు