గురుపూర్ణిమ - ఆది గురువు ఉదయించిన రోజు!

మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ... గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి.
 

నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరం లాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. ఎదో తెలియని కారణం వలన మనం జ్ఞానం బదులు అజ్ఞానాన్ని వేడుక చేసుకుంటున్నాం, అందుకని ఇది ప్రభుత్వ సెలవువదినం కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం. మెల్లగా దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని ఆశ్రమాలలో, అది సజీవంగా ఉంది, కానీ ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు.

  మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. 

మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసారు. మనం యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. ఆయన పారవశ్యత కదలికలను అధిగమించినప్పుడు, ఆయన నిశ్చలులయ్యారు. పారవశ్యత ఆయనలో కొంత కదలికకు అనుమతిస్తే, ఆయన తాండవ నృత్యం చేసారు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయనను చూచినవారందరూ అర్ధం చేసుకున్నారు. జనాలు వచ్చి, ఆయన వారితో సంభాషిస్తాడేమో అని ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని తాము అక్కడ ఉన్న స్పృహ కూడా ఆయనకు లేకపోవడం వలన వచ్చినవారందరూ కొంతకాలం ఎదురు చూసి వెళ్ళిపోయారు.

ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకోలేదు. “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు.

అందుకని వారు తయారవటం ప్రారంభించారు- దిన దినం, ప్రతిరోజూ అలా నెలలు, సంవత్సరాలు తరబడి వారు సంసిద్ధమవుతూనే ఉన్నారు. శివుడు వారిని పట్టించుకో కూడదనుకున్నాడు. 84 సంవత్సరాల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో – ఆదియోగి ఈ ఏడుగురిని చూసారు. వారు తేజోవంతులైన జ్ఞానపాత్రులుగా మారారు. వారు జ్ఞానాన్నిఅందుకోవటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.

  ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.

ఆయన వారిని ఇక పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వారు ఆయన దృష్టిని ఆకట్టుకున్నారు. తరువాతి 28 రోజులు ఆయన వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. ఆయన తన కృపను వారిపై కురిపించడానికి దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్ర ప్రసారం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.

  మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది. 

మనం గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. అది ఇతర రోజులలో లభించదని కాదు; గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది.

 గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. 

అసలు మీరు గురువుని కోరరు. మీ మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు - అప్పుడు మీకు గురువు లభిస్తారు. మీరు ఉత్తమమైన గురువుని ఎంచుకుంటూ, వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మీలో తీవ్రమైన తపన పెంచుకోండి మీకు గురువు సంభవిస్తాడు, గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. అది కేవలం మీకు సంభవించగలదు. అదేదో మీరు కలిసేది కాదు. అదేదో మీరు కరాచలనం చేసేది కాదు. మీరు వంగి నమస్కరించ గలిగేది కాదు. మీరు దగ్గరకు వెళ్లి ఇది కావాలి అది కావాలి అని యాచించ గలిగేది కాదు. మీరు గురువు అనుకునే ఆ స్థితి, ఆ శక్తి మీకు ప్రాప్తిస్తుంది. అది మిమ్ముల్ని ముంచివేస్తుంది. మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని నాశనం చేసి, మీరు ఏ బంధనాలు లేకుండా, సృష్టికర్త మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండేలా చేస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు