మానవాళిలో ఉన్న సహజమైన గుణం ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎదగాలని అనుకుంటాం. ఎంత ఎదిగితే మనకి సరిపోతుంది..? ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం ఎదగాలని అనుకుంటాం. ఇంకొంచెం ఎదిగితే మరికొంచెం ఎదగాలని అనుకుంటాం. మరికొంచెం ఎదిగిన తరువాత, ఇంకొద్దిగా ఎదగాలని అనుకుంటాం. మనం సరిగ్గా గమనించినట్లైతే, మనం అనంతంగా వ్యాపించాలనుకుంటున్నాం. మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం, “నేను కనుక ఇక్కడికి చేరినట్లైతే; ఇంక సంపూర్ణంగా ఉంటాను” అని. కానీ, మీ జీవిత చరమాంకంలో కాకుండా మీరక్కడికి త్వరగా చేరుకున్నారనుకోండి, అది నిజం కాదు అన్న విషయం మీకు తెలుస్తుంది.

ఎదుగుదల అన్నది మానవాళికి ఎంతో సహజంగా ఉన్న స్వభావం. మనం అనంతంగా వ్యాప్తి చెందాలనుకుంటాం. మన ఎదుగుదల అనంతమైనదానిని కాంక్షిస్తున్నప్పుడు; ఈ భౌతిక అస్థిత్వంలో అంచలంచెలుగా ఎదగాలి అనుకోవడమన్నది ఎంతో మూర్ఖత్వం. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. శాస్త్ర-సాంకేతికత వచ్చి ఇప్పటికి వంద-నూటయాభై సంవత్సరాల అయ్యింది, మనం చెయ్యవలసినదంతా చేసేసాం, ఇప్పుడు మనం గమనిస్తున్నదేమిటంటే; మన ఎదుగుదల అన్నది సుస్థిరంగా ఉండాలని. ఈ విషయాన్ని వంద సంవత్సరాల క్రితమే గ్రహించాల్సింది. కానీ, మనం అది గ్రహించలేదు. బహుశా కొద్దిమంది గ్రహించి ఉండవచ్చేమో కానీ, చాలామంది వరకూ ఇది గ్రహించలేదు. కానీ, ఇప్పుడు ప్రతీవారూ కూడా, ఎదుగుదల సుస్థిరంగా ఉండాలని మాట్లాడుతున్నారు.

గొప్పతనం అనేది సేకరించడం ద్వారా కలుగదు

అన్నిటినీ ప్రోగు చేసుకోవడమే ఎదుగుదలగా మనం గ్రహిస్తున్నాము. ఒకరు ఎంతగానో కండరాలూ, ఎముకలూ పెంచుకొని తమను తాము పెద్ద వ్యక్తి లాగా అనుభూతి చెందుతారు. కానీ ఈ అనుభూతి కలిగేది మిగతావారందరూ కూడా అతని కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే..! ఒకవేళ అతనికంటే ఎక్కువ దృఢమైన శరీరంతో ఎవరైనా వచ్చారనుకోండి, ఇతనికి తాను ఎంతో చిన్న వ్యక్తిలాగా అనుభూతి కలుగుతుంది. మరొకరు ఎంతగానో ధనాన్ని కూడబెట్టిన తరువాత, అతనికి తాను ఒక పెద్ద వ్యక్తిని అన్న అనుభూతి కలుగుతుంది. ఇదెందుకు కలుగుతుందంటే, అతని చుట్టూరా ఎంతోమంది, ఏమీ లేనివారు ఉన్నారు కాబట్టి. మరొకరు ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి, వారు కూడా తమకు తాము ఎంతో గొప్పగా అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది కూడా ఎందుకూ అంటే; వారి చుట్టూ కూడా ఎంతో మంది విద్య లేనివారు, చదువురానివారు ఉన్నారు కాబట్టే..!! అందుకని, మీరు ఎదైతే ఆర్జించో, ప్రోగుజేసుకునో గొప్ప అని భావిస్తున్నారో, అదంతా కూడా కేవలం సాపేక్షికమైనదే..! మీకు ఈ విధమైన అనుభూతి ఎందుకు కలుగుతోందంటే, మీకంటే ఇంకొకరు గొప్పగా లేరు కాబట్టే..!! అంటే మరొకరి అపజయాన్ని చూసి మీరు ఆనందిస్తున్నారని అర్ధం. ఇది ఎదుగుదల కాదు కదా..? ఇదొక వ్యాధి లాంటిది.

మరొకరి పరాజయం లేదా అపజయాలని చూసి, నేను గొప్పగా అనుభూతి చెందడం అన్నది -  ఒక వ్యాధి లాంటిది. నేను బాగా భోజనం చేసి, మీరు ఆకలిగా ఉంటే, ఆ స్థితిని నేను ఎంజాయ్ చేస్తే మీరు దానిని ఏమంటారు..? అది ఒక రుగ్మతా..?  లేక ఎదుగుదలా..? మనం కేవలం ప్రోగుజేసుకోవడం అన్నదానితో ఎదుగుదలని చూస్తే, మనం ఈ దిశగా మాత్రమే వెళ్లగలం. ఇప్పుడు ఎదుగుదలను మరింత విస్తారంగా, ఎన్నో పార్శ్వాలలో చూడవలసిన సమయం ఆసన్నమైనది.  దురదృష్టవశాత్తూ, ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎదుగుదల అంటే ఆర్ధిక ఎదుగుదలేనని ఆలోచిస్తోంది. ఇది మారాలి. ఎందుకంటే ఇది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. మనం ఈ విషయం తెలుసుకోవడానికి ఇంతకు మునుపు వంద సంవత్సరాలు పట్టింది. కానీ, ఇప్పుడు అన్నీ ఎంతో వేగంగా మారిపోతుండడంవల్ల మనం ఏదైనా సరియైన పని చేయకపోయినట్లైతే, పదిహేను సంవత్సరాల లోపునే మనం దాని ఫలితాలను చూడాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మార్స్ వెళ్ళాలి అనుకుంటున్నాము. ఆలోచన మంచిదే..! కానీ, అక్కడికి వెళ్ళి ఏమి చేస్తాము..?? అక్కడ కూడా యుద్ధాలు చేస్తాం. అక్కడ కూడా వినాశనం చేస్తాం. దానికి బహుశా ఇంకొక నాలుగైదు వందల సంవత్సరాలు పట్టవచ్చు. కానీ, మన ఎదుగుదల అనేది, మరొకదాని వినాశనానికి దారితీయకుండా జరగాలన్నది ముఖ్యమైన విషయం కాదా. దానికి ఇదే సమయం.

ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం మనకి ఉంది. మన ఎదుగుదల అన్నది, మరి దేనినో వినాశనం చెయ్యడంలోనో, లేదా మనంతగా మరొకరు ఎదగలేదు అని చూసి ఆనందించడంలోనో ఉండకూడదు. ఎదుగుదల అన్నది కేవలం ప్రోగుజేసుకోవడమే అనుకున్నప్పుడు మానవాళి, ఎదుగుదలను ఈ విధంగా మాత్రమే చూడగలుగుతుంది. ప్రతీవారూ కూడా వారి కార్యాచరణని ఇంకా ఉన్నతం చేసుకోవాలి, ఇంకా మెరుగుపరచుకోవాలి అని అనుకుంటున్నారు. మనం ఈ ప్రపంచంలో మార్చవలసిన ఒక విషయం ఏమిటంటే - మీలో మౌలికమైన ప్రాణాన్నీ, జీవాన్నీ పెంపొందించుకోకుండా కేవలం మీ చేసే పనిని మరింతగా చెయ్యాలనుకుంటే, అది సరికాదు. ఇప్పుడు, ఎవరైతే బాగా విజయాన్ని సాధించారని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఎంతో వత్తిడికి లోనవుతున్నారు.

ఏవిధంగా చూసినా, విజయం అనేది మానవ జీవితంలో ఒక మధురానుభూతి కావాలి. విజయం అంటే, కేవలం ఉద్యోగ-వ్యాపారాల్లోనే కాదు, మీరు ఒక బంతిని తన్నాలన్నా సరే, దానిని సూటిగా తన్నాలనుకుంటారు. ఔనా..?  కాదా..?? చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా - అసలు మనం ఒక పనిని చేసేది, అందులో విజయం సాధించడానికే.. కదూ. కానీ, ఇప్పుడు విజయం సాధించినవారందరూ కూడా ప్రపంచానికి ఏ సందేశం ఇస్తున్నారంటే, ‘విజయం అంటే బాధ’ అని. మనం యువతరానికి అందించడానికి ఇది సరియైన సందేశం కాదు. ఇప్పటి తరం మీ ముఖాలని చూస్తే, మీరెంతో విజయం సాధించినాగానీ, మీరు ఇలా దిగాలుగా ముఖం వేసుకుని నడుస్తూ ఉంటే, అది సరి అయినది కాదు. అరవైల్లోవారు వరల్డ్ వార్-2 తరువాత ఎంత దిగాలుగా తయారయ్యారంటే, యువతంతా వారిలాగా ఉండవద్దని నిర్ణయించుకుంది. అలానే హిప్పీ మూవ్-మెంట్ అన్నది మొదలైంది. కనీసం వీధి చివరన నించొని ధూమపానం చేస్తే సంతోషంగా ఉంటాం అని వారనుకున్నారు.

ఇలా ఉండకూడదు, మనం కనీసం నవ్వాలి, ఆడాలి, పాడాలి అని వారనుకున్నారు. అందుకని, ఈరోజున విజయం సాధించినవారి మీద ఎంతో గురుతరమైన బాధ్యత ఉంది. మిమ్మల్ని చూసిన ఎవరైనా సరే, విజయం అన్నది ఎంతో మధురానుభూతి అన్న సందేశం యువతకి అందించాలి. ఎందుకంటే ఏ సమాజమైతే విజయాన్ని కోరుకోదో, ఆ సమాజం మరుగున పడిపోయినట్లే..! మానవులు విజయాన్ని కోరుకోవాలి.  వారు చేస్తున్నదానిలో, వారు విజయాన్ని కోరుకొనప్పుడు వారి కార్యాచరణలో అర్థం ఏముంది..? అందుకని మీరు ఏమి ప్రోగుజేసుకున్నా సరే, అది మీ జీవితాన్ని పెంపొందించలేదు. అవి వేరేవారిని మోసపుచ్చవచ్చేమో కానీ, మిమ్మల్ని కాదు. మీరు ఫార్ములా కార్ రేసులో కార్ నడపాలనుకున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటీ..??.. మీ దగ్గర అందుకు తగినటువంటి కార్ ఉండాలి. మీరెంత గొప్ప డ్రైవర్ అయినా సరే, మీ దగ్గర అటువంటి కార్ లేదనుకోండి.. అలాంటి పని చేయాలని చూసినప్పుడు కార్ ముక్కలు-ముక్కలైపోతుంది. అది వ్యాపారమైనా, మరొకటి అయినా, ఆధ్యాత్మికత అయినా. ఒకవేళ మీ దగ్గర ఒక ఫెరారీ ఉందనుకోండి, మీరు అంత గొప్ప డ్రైవర్ కాకపోయినప్పటికీ మీరు గొప్ప డ్రైవర్ లా కనిపిస్తారు..కదూ..?? అందుకని, ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జీవాన్ని పెంపొందించాలి.

దీనికి ఒక సంపూర్ణ శాస్త్రం, సాంకేతికత ఉన్నాయి. ఇది కనుక మీరు చెయ్యగలిగితే, అప్పుడు మీ ఎదుగుదల అన్నది, ప్రోగుజేసుకోవడానికి సంబంధించినదై ఉండదు. ఖచ్చితంగా ఇది సుస్థిరమైన ఎదుగుదల, మనం ప్రోగుజేసుకునేవాటిపై మన ఎదుగుదల   ఎప్పుడైతే ఆధారపడి ఉండదో అప్పుడు మనం ప్రోగుజేసుకున్నవాటిని మనం ఉపయోగించుకోవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా మారుతుంది. గొప్ప మానవాళిని మనం నిర్మిస్తాం. మనం, ఒక గొప్ప దేశాన్నో లేదా ఒక గొప్ప ప్రపంచాన్నో కేవలం గొప్ప మషీన్లు, గొప్ప రోడ్లు, గొప్ప బిల్డింగులూ, గొప్ప బ్రిడ్జిలూ నిర్మించడం ద్వారా జరుగదు. ఇవన్నీ ముఖ్యమైనవే, అవసరమైనవే.. కాదనను. కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది మనం అద్భుతమైన మానవాళిని తయారు చెయ్యడమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు