ఆ ఊరిలో ప్రతీ సంవత్సరం జరిగే ఇంద్రోత్సవం పండుగను ఒక్కసారిగా ఆపేసి, గోపోత్సవాన్ని కృష్ణుడు ఎలా మొదలు పెట్టాడో సద్గురు మనకు చెప్తారు. ఊరివాళ్ళు భయంతో పండుగను జరుపుతున్న వైనాన్ని మార్చి, ఒక పిల్లవాడు జీవితాన్నే ఒక పండుగలా ఎలా గడపవచ్చో వారికి తెలియచప్పిన కధే ఇది.

కృష్ణుడు ఉన్న గ్రామీణ సమాజంలో ప్రతీ సంవత్సరం ఇంద్రోత్సవం అనే ఒక పండుగ జరిపేవారు.బలివ్వడం ఈ ఉత్సవంలో ఓ భాగం. ఇది ఈ ప్రాంతంలో అతి పెద్ద పండుగ. ఇంద్రోత్సవం అంటే దేవతల రాజైన ఇంద్రుడి పండుగ అని అర్ధం. ఆయన వర్షానికి, ఉరుములకి , మెరుపులకు కూడా అధిపతి. ఈ పండుగలో అగ్ని చుట్టూ జరిగే ఎన్నో క్రతువులు ఉండేవి. అగ్నికి పెద్ద మొత్తంలో నెయ్యి, పాలు, రకరకాల ధాన్యాలు అర్పించేవారు. ఇది ఒక విధమైన వాతావరణాన్ని సృష్టించటానికి చాలా ఘనంగా చేసే ఒక ప్రక్రియ.

నందుడు ఆ వర్గానికి నాయకుడు అవ్వడం మూలంగా , కృష్ణుడికి 15 ఏళ్ళ వయస్సప్పుడు ఈ క్రతువు నిర్వహించటానికి అవకాశం  వచ్చింది. ఈ యజ్ఞానికి  యజమానిగా నిర్వహణ చేయటం ఆ సమాజంలో గొప్ప గౌరవంగా భావించేవారు. ఈ యజ్ఞానికి అర్పణ చేసి, ముందుండి నడిపించేవారిని యజమాని అని అంటారు. దీన్ని అంతకుముందు గర్గాచార్యులు నిర్వహించేవారు, ఆయన నుంచి దానిని కృష్ణుడికి ఇవ్వాలనుకున్నారు. కృష్ణుడు వద్దని, “ నేను యజమానిగా ఉండాలని అనుకోటం లేదు. నేను ఈ క్రతువులో పాల్గోనాలనుకోవట్లేదు.” అన్నాడు. గర్గాచార్యులు ఆశ్చర్యపోయారు. ఇవి సామాజికంగా గొప్ప విషయాలు  కాబట్టి ఎవరైనా ఇటువంటి అవకాశాన్ని ఉత్సాహంగా చేజిక్కించుకుంటారు. మరి నువ్వెందుకు వద్దంటున్నావని ఆయన కృష్ణుడ్ని అడిగాడు.

కృష్ణుడు మొహం తిప్పుకుని , “ఇలాంటివి చేయటానికి నేను సరైన వాడిని కాదు. ఇంకెవరినైనా చేయనివ్వండి.” అన్నాడు

గర్గాచార్యులు “ లేదు, పోయిన సంవత్సరం మీ అన్నయ్య చేశాడు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఇది చేయటానికి అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఇలా ఎందుకు అంటున్నావు? నీ మనసులో ఏముందో చెప్పు.”అన్నాడు,

“నాకు ఈ బలి అంటే ఇష్టం లేదు.”

“ఇష్టం లేదంటే అర్ధం ఏంటి? ఈ సమాజంలో మనం చేసే గొప్ప క్రతువు ఇదే. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. ఇది చాలా గొప్పదని వేదాల్లో కూడా చెప్పబడింది. నీకు ఇష్టం లేదంటే ఎలా? నువ్వు ఇంకా చిన్నవాడివి.”

“ ఏదో ఒక దేవుడికి భయపడి ఈ యజ్ఞం చేయటం నాకు ఇష్టం లేదు. భయం నుంచి వచ్చే భక్తి నాకు ఇష్టం లేదు. ఈ యజ్ఞం చేయకపోతే ఇంద్రుడు దండిస్తాడని జనానికి భయం. ప్రజలు భయంతో చేసేదానిలో నేను పాల్గొనాలని అనుకోవట్లేదు.”

గర్గాచార్యులకు ఆ మాట నచ్చింది, ఆయన నవ్వి ఇలా అన్నాడు, “సరే అయితే. మరి వేరేది ఏం చేద్దాము?”

నా చుట్టూ ఉన్నవారంటే నాకు ఎంతో ప్రేమ. గోపాలురు, గోపికలు, ఆవులు, చెట్లు, ఈ నది, గోవర్ధన పర్వతం – ఇదే మన జీవితం. 

“ మనం గోపోత్సవం చేద్దాము. ఈ ఆవుల మందల ఉత్సవం చేసుకుందాము, ఎక్కడో కూర్చుని భయపెట్టే దేవుడి ఉత్సవం కాదు. నా చుట్టూ ఉన్నవారంటే నాకు ఎంతో ప్రేమ. గోపాలురు, గోపికలు, ఆవులు, చెట్లు, ఈ నది, గోవర్ధన పర్వతం – ఇదే మన జీవితం. ఈ మనుషులు, ఈ జంతువులు, ఈ చెట్లు, ఈ పర్వతమే మనల్ని పోషించి, కాపాడుతున్నాయి. వీటి వల్లే మన జీవితం కొనసాగుతుంది. మీరంతా భయపడే ఒక దేవుడ్ని నేను ఎందుకు పూజ చేయాలి? నాకు ఏ దేవుడన్నా భయం లేదు. మనం ఉత్సవం జరుపుకుని, యజ్ఞం చేయాలంటే మనం గోపోత్సవం చేసుకుందాము.” సాధారణమైన వాటినే ఉత్సవంలా జరుగుపుకోవటమే కృష్ణుడు ఉద్దేశం. ఆయన జీవితమే ఒక పండుగలా జీవించాడు ఆయన. ఆయనకు ఆరు సంవత్సరాల వయస్సులో కూడా ఆయన గురించి ఆయన ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన వాటిల్లో ఒక విషయం ఏమిటంటే, “నేను ఉదయాన్నే నిద్రలేచినప్పుడు, ఆవులు అంబా అనటం, మా అమ్మ పాలు పితికే ముందు ప్రతి ఆవును పేరు పెట్టి పిలవటం వినగానే నేను కళ్ళు నులుముకుని  చిరునవ్వు చిందించాల్సిన సమయం అని నాకు అర్ధం అయిపోతుంది.”

నేను ఉదయాన్నే నిద్రలేచినప్పుడు, ఆవులు అంబా అనటం, మా అమ్మ పాలు పితికే ముందు ప్రతి ఆవును పేరు పెట్టి పిలవటం వినగానే నేను కళ్ళు నులుముకుని  చిరునవ్వు చిందించాల్సిన సమయం అని నాకు అర్ధం అయిపోతుంది. 

కృష్ణుడి చెప్పిన ఈ ఆలోచనకు సమాజంలో చాలా ప్రతిస్పందన వచ్చింది. అందరూ “ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని నువ్వెలా కొట్టిపారేయగలవు? ఇది మన సంప్రదాయం. దాన్ని మనం అలా ఎలా వదిలేయగలం? ఇంద్రుడికి కోపం వస్తే మనల్ని ఏం చేస్తాడో? ఈ ప్రాంతాన్నే వరదతో ముంచేయవచ్చు.” అని అన్నారు,

కృష్ణుడు “ నేను యజమానిగా ఉండాలంటే అది గోపోత్సవానికే. అది ప్రేమతో, ఆనందంతో జరుపుకునే పండుగ అయ్యుండాలి, భయంతో జరుపుకునేది కాదు. ఆచారం ప్రకారం కొద్దిగా అగ్నికి అర్పణ చేద్దాము. మిగతా పాలు, నెయ్యి మనమే తాగుదాము.” అన్నాడు,

ఈ విషయంలో ఊరు రెండుగా విడిపోయింది – ఈ ఆచారాన్ని పాటించాలని అనుకున్న చిన్న బృందం ఇంద్రోత్సవాన్ని జరుపుకున్నారు. కృష్ణుడితో పాటు మిగతా వారంతా గోపోత్సవాన్ని జరుపుకున్నారు. కాని గోపోత్సవం అయిపోయిన తర్వాత కృష్ణుడు వెళ్లి ఇంద్రోత్సవంలో కూడా పాల్గొన్నాడు. దానికి కూడా ఆయన వ్యతిరేకత చూపించలేదు, ఆయన కేవలం జీవితంలో కొంత వివేకం  ఉండాలని కోరుకున్నాడు.

ఆయనే ఓ పండుగ. ఆయన జీవితాన్ని ఒక పండుగలానే జీవించాడు. ఆయన యుద్ధానికి వెళ్ళినా కూడా పూర్తిగా తయారై నెమలి పించంతోనే వెళ్ళేవాడు. ఆయన జీవితంలోని  ప్రతి అంశాన్ని కూడా పండుగగా మార్చుకోవాలనే ధ్యేయం ఉన్న వ్యక్తి. ఆయన దేన్నీ కూడా అనాసక్తిగా చేయలేదు. కృష్ణుడికి జీవితమే ఒక పండుగ.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు