దయచేసి, దుఃఖంలో పెట్టుబడి పెట్టకండి!

ఈ రోజు ప్రపంచంలో చాలా మంది, ముఖ్యంగా యువత ఆధ్యాత్మికత పట్ల ఒక రకమైన విముఖతను పెంచుకుంది.
 

ఈ రోజు ప్రపంచంలో చాలా మంది, ముఖ్యంగా యువత ఆధ్యాత్మికత పట్ల ఒక రకమైన విముఖతను పెంచుకుంది. ఆధ్యాత్మికతను సరైన పద్ధతిలో అందివ్వక పోవడం వల్లే ఇలా జరిగింది. ‘ఆధ్యాత్మికత’ అంటే సరిగా తినకపోవటం, రోడ్డుపక్కన కూర్చొని భిక్షాటన చేయటం అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే - కఠినమైన జీవితాన్ని గడపడమనీ, తమని తాము హింసించుకోవడమనీ, అన్నిటికంటే మించి జీవితానికి వ్యతిరేకిగా ఉండడమనీ అంటే మీ జీవితాన్ని సంతోషంగా గడపకుండా, వీలైనంత దుఃఖాన్ని అనుభవించడమనీ అర్థం చేసుకుంటున్నారు.

ఆధ్యాత్మికంగా ఉండటానికీ మీ బాహ్య జీవితం ఎలా ఉందన్న దాంతో సంబంధం లేదు. ఓ గుడిసెలో ఉన్నా లేదా ఓ బంగళాలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మీరు ఆధ్యాత్మికంగా ఉండచ్చు. ఓ గుడిసెలోనో లేదా బంగళాలోనో ఉండడమనేది  మీ సామాజిక, ఆర్థిక పరిస్థితుల పై ఆధారపడి ఉండే విషయం. దానికి మీ ఆధ్యాత్మికతతో ఎలాంటి సంబంధం లేదు.

అసలు మీలోని జీవం ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది.

ఆధ్యాత్మికంగా ఉండటమంటే “నా ఆనందానికి నేనే మూలం” అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. మీ ఆనందానికి  మరెవరో మూలమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. దీంతో ఆనందంకోసం మీరెప్పుడూ వారిపై ఆధారపడి ఉంటారు.  మీ ఆనందానికి మీరే మూలమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, మీరెప్పుడూ ఆనందంగా ఉండరా?  అసలు మీలోని జీవం ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. మీ జీవితాన్నే చూస్తే, మీరు చదువుకుంటారు, డబ్బు, ఇల్లు, ఓ కుటుంబం, పిల్లలు కావాలనుకుంటారు. ఏదో ఒక రోజున అవన్నీ మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయని మీరు వీటన్నిటినీ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ వద్ద అవన్నీ ఉన్నాయి, కానీ మీరు ఆనందమనే విషయం మరిచిపోయారు.

ప్రజలు బాధలలో ఉండడానికి కారణం వారు జీవితాన్ని అపార్థం చేసుకోవడమే. “లేదు! నా భర్త, నా భార్య లేదా మా అత్త” నా బాధలకు కారణం అని మీరు అనవచ్చు. వాళ్ళందరూ ఎలా ఉన్నప్పటికీ, దుఃఖంగా ఉండడాన్ని మీరే ఎంచుకున్నారు. దుఃఖంలో పెట్టుబడి పెట్టింది మీరే! దుఃఖంగా ఉండడంవల్ల ఏదో ఒరుగుతుందని మీరనుకుంటున్నారు. ఉదాహరణకి, మీ కుటుంబంలో ఒకరు మీరు చేయకూడదనుకున్న దానిని చేయడం మొదలుపెడతారు. మిమ్మల్ని మీరు దుఃఖపెట్టుకుని, వారు మారుతారేమో అని ఆశిస్తూ, ఏడుపు మొహంతో తిరుగుతారు. వారు మారాలనే ఉద్దేశంతో మీకు మీరే దుఃఖం కలిగించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలా మీరు దుఃఖంతో ఉంటే, మీ చేతిలో స్వర్గమున్నా కూడా ఏం లాభం? అదే మీరొక ఆనందమయ వ్యక్తి అయినట్లైతే, మీ చేతిలో ఏది ఉన్నా, లేకపోయినా, ఎవరు పట్టించుకుంటారు?  మీరు నిజంగా ఆనందంగా ఉంటే, మీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయాలు అంత ముఖ్యమైనవి అవుతాయా? దయచేసి అర్థం చేసుకోండి, మీరు శ్రద్ధ చూపించడం, ప్రేమించడం, అదో ఇదో కావాలనుకోడం, ఇవన్నీ మీరు చేస్తున్నది అవి మీకేదో ఆనందాన్ని తెచ్చిపెడతాయన్న ఆశతోనే కదా?

ఒక ఆధ్యాత్మికవాది ప్రేమ, శాంతి, ఆనందం, అన్నీ తనే సంపాదించుకుంటాడు

చాలామంది ఎప్పుడూ నన్ను ఈ ప్రశ్న అడుగుతుంటారు, “ఆధ్యాత్మికవాదికి, భౌతికవాదికి తేడా ఏమిటి?” అని. వాళ్ళకు నేను ‘‘ఒక భౌతికవాది కేవలం తన ఆహారాన్ని మాత్రమే సంపాదించుకుంటాడు. మిగిలిన అన్నిటిని - ఆనందం, శాంతి, ప్రేమ - వీటన్నిటిని అతను అర్థిస్తాడు. ఒక ఆధ్యాత్మికవాది ప్రేమ, శాంతి, ఆనందం, అన్నీ తనే సంపాదించుకుంటాడు. అతను కేవలం ఆహారాన్ని మాత్రమే అర్థిస్తాడు. కావాలనుకుంటే దాన్ని కూడా సంపాదించుకోగలడు’’ అని చమత్కారంగా బదులిస్తాను .

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.