ఆధ్యాత్మిక సాధకుడు దివ్యానుభవం పొందడంలో మాదకద్రవ్యాలు తోడ్పడతాయా? లేకపోతే అవి అతన్ని అంధకూపంలోకి నడిపిస్తాయా? సద్గురు వివరించిన సంభావ్యాలనూ, అంధకూపాలనూ ఈ ఆర్టికల్ ల్లో చదివి తెలుసుకోండి..

Sadhguruపతంజలి ‘కర్మకాండ’ (అధ్యాయం) పూర్తిచేసి, కైవల్యపదంలోకి అడుగుపెట్టినప్పుడు - ‘కైవల్యం’ అంటే అంతిమ గమ్యం మోక్షం - మాదకద్రవ్యాల ద్వారాగాని, నిరంతర మంత్రోచ్చారణ ద్వారాగాని, కఠోర నియమనిష్ఠలతోగాని, గాఢ సమాధులతో గాని, క్షణమాత్రపు దివ్యదర్శనాన్ని అనేక విధాల ద్వారా పొందవచ్చు అన్నాడు.

మాదకద్రవ్యాల విషయానికి వద్దాం. పతంజలి గొప్పశాస్త్రవేత్త. మామూలు మతపరమైన వ్యక్తుల వంటి వాడుకాడు. ఏదీ అతన్ని భయపెట్టలేదు. అతను ప్రతి విషయాన్నీ పరిశీలించాడు. మతపరమైన ఏ వ్యక్తీ  మాదకద్రవ్యాల గురించి మాట్లాడడు. మత్తుమందు కూడా దివ్యత్వానికి ఒక సంభావ్యమేనని  పతంజలి చెప్తున్నాడు, అయితే అది కనిష్ఠ సంభావ్యత.

మత్తుమందు కూడా దివ్యత్వానికి ఒక సంభావ్యమేనని  పతంజలి చెప్తున్నాడు, అయితే అది కనిష్ఠ సంభావ్యత.

మాదకద్రవ్యంతో ఏం జరుగుతుంది? ఎల్‌ఎస్‌డి(LSD) కాని, మారిజువానా కాని అందులోని రసాయనం స్వభావమేమిటంటే అది ఎక్కడో ఒకచోట మీ మనస్సును భగ్నం చేస్తుంది. అసలు మీ మనస్సు అయినా, భౌతిక శరీరం అయినా ఏమిటి? రసాయనమే కదా. మీరు యోగాభ్యాసాలు చేస్తే జరిగేదేమిటి, మీ వ్యవస్థలో రసాయనిక  పరిణామాలు జరుగుతాయి, అంతేకదా. మాదకద్రవ్యాల్ని సాధారణంగా ‘మనస్సును వశపరచుకొనే’వని అభివర్ణిస్తారు. మీ వ్యవస్థలో ఒక మాదకద్రవ్యాన్ని ప్రవేశపెట్టండి, అకస్మాత్తుగా మీ మనస్సు నెర్రెలు (బీటలు) బారుతుంది. అంటే మీరు సృష్టిని ఈ నెర్రెలోంచి చూడగలుగుతారు - మనస్సు లేకుండా - ఒక్క క్షణం మాత్రం, అది అద్భుతం.

ఇక మీరు ఆ మాదకద్రవ్యానికి అలవాటు పడతారు. తరువాతిసారి మందు మోతాదు పెరుగుతుంది. మీలో ఎటువంటి వృద్ధికాని, పరివర్తన కాని ఉండదు. అది కేవలం ఒక తొట్రుపాటు. కొంతకాలం గడిచాక ఈ తొట్రుపాట్లూ ఉండవు. ఆ మాదక ద్రవ్యానికి మీరు బానిస అవుతారు.

మీరు దాన్ని నియంత్రించగలరా?

మాదకద్రవ్యాల మార్గంలో పయనించే కొద్దిమందికైనా పెద్ద అనుభవాలుంటాయన్న విషయాన్ని మనం కాదనలేము, అయితే వాళ్లు అభివృద్ధి చెందరు, వాళ్లున్న దశలో ఎటువంటి పరివర్తనా ఉండదు. వాస్తవానికి అటువంటి వ్యక్తి ఎప్పటికీ సౌందర్యం పొందలేడు, కేవలం కుంచించుకు పోవడమే ఉంటుంది. అతను ఎటువంటి పరిమళాన్నీ పొందలేడు. కేవలం మాట్లాడడానికి పెద్ద అనుభవాలు మాత్రమే ఉంటాయి లేదా మెల్లగా క్షీణించడమే ఉంటుంది.  మందు మోతాదు మాత్రమే పెరుగుతుంది. చరిత్రకు అందని కాలం నుండీ ఆధ్యాత్మిక పథంలో మాదక ద్రవ్యాల వాడుక ఉంది. వాటి వాడుకలో శివుడే మొదటివాడని పురాణాలు చెప్తున్నాయి. అది అక్కడ మొదలైంది. అయితే దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి, శివుడు దాన్ని నియంత్రించగలడు, మీరు నియంత్రించలేరు.

నేనెప్పుడూ ఏ మాదకద్రవ్యాన్నీ తాకలేదు, కాని నా కళ్లల్లోకి చూడండి. నిండుగా తాగినట్లే ఉంటాను. రోజులో ఇరవై నాలుగ్గంటలూ పీకల దాకా తాగినట్లే ఉంటాను - హాంగ్ ఓవర్ లేదు, ఖర్చు లేదు, పైగా ఆరోగ్యానికి మంచిది.

ఒకసారి ఆదిశంకరులు తన శిష్యబృందంతో ప్రయాణిస్తున్నారు. ఆయన ఒకచోట ఆగి ఒక పెద్దకుండెడు కల్లు తాగారు, మళ్లీ నడక సాగించారు. అంటే తాము కూడా కల్లు తాగవచ్చునని శిష్యులు అర్థం చేసుకున్నారు. ప్రయాణంలో కల్లు దొరికే చోటు రాగానే వాళ్లు చేసినపని - కడుపునిండా కల్లు తాగడం. గురువుగారి వెనుక తడబడుతూ నడవసాగారు. వాళ్లు దాన్ని నియంత్రించుకోలేకపోయారు. వాళ్లు మరో గ్రామం చేరుకున్నారు. శంకరులు సూటిగా కమ్మరి కొలిమి వద్దకు వెళ్లారు. ఇనుము కరిగి ఉన్న మూసతీసుకున్నారు, అది తాగేశారు. కల్లు తాగడంలో శంకరుల్ని అనుకరించిన శిష్యులకు ఇప్పుడు విషయం బోధపడింది.

అందువల్ల మాదకద్రవ్యాలు కనిష్ఠ సంభావ్యాలే, కాని సంభావ్యాలు. యోగ మార్గంలో మాదకద్రవ్యాలు నిషిద్ధం. నైతికంగా అది తప్పు అని కాదు, వాటికున్న పరిమితుల వల్లే. మన మనస్సును పేల్చడానికి మనకు చాలా మార్గాలున్నాయి.

నేనెప్పుడూ ఏ మాదకద్రవ్యాన్నీ తాకలేదు, కాని నా కళ్లల్లోకి చూడండి. నిండుగా తాగినట్లే ఉంటాను. రోజులో ఇరవై నాలుగ్గంటలూ పీకల దాకా తాగినట్లే ఉంటాను - హాంగ్ ఓవర్ లేదు, ఖర్చు లేదు, పైగా ఆరోగ్యానికి మంచిది. ఈ మద్యం, మాదకద్రవ్యాలు వగైరా అన్నీ మాకు పసిపిల్లల వ్యవహారంగా తోస్తుంది, ఎందుకంటే మా సజీవ చైతన్యంతో మేము అంతకు వేయిరెట్లు మత్తును పొందగలం. సారాయి ఎందుకు? మీరు అమృతమే గ్రోలవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు