అనుభవంలో లేని విషయాలని ఉహించుకోకండి..!!

 

ఈ వ్యాసంలో గురువు ప్రాముఖ్యత గురించి, మతం - ఆధ్యాత్మికత అంటే ఏంటో, సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసింది ఏంటి అనేవాటి గురించి సద్గురు వివరిస్తున్నారు..

ప్రశ్న:  సద్గురూ నేను మీతో ఉన్నప్పుడు నాకు ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను మీ నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉండాల్సి వస్తే నేను మీతో ఎలా మాట్లాడగలను..? సహజంగా ఒక గురువు తన శిష్యులతో ఎలా సంభాషిస్తాడు.. ఎల్లప్పుడూ భౌతిక సాన్నిధ్యం సాధ్యం కాకపోవచ్చు?

సద్గురు:  భౌతిక సాన్నిధ్యం ఎప్పుడూ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మీరు నాతో ఉన్నప్పుడు మీకు ఎంతో హాయిగా, సౌకర్యంగా ఉంటుంది అంటే, అది నాకు అవమానకరం.  ఎందుకంటే నేను జీవితాంతం మిమ్మల్ని ఎలా ఒక చోట స్థిరపడకుండా ఉంచాలా అని చూస్తున్నాను.  మీ పరిధుల నుంచి మిమ్మల్ని కదిలించాలని ప్రయత్నం చేస్తున్నాను. మీరు  మీ పరిధుల్లో ఎల్లప్పుడూ స్థిరపడదామని అనుకుంటున్నారు. నా జీవితం, నా పని అంతా కూడా మీరు ఈ పరిధుల్లో స్థిరపడకుండా అపరిమితంగా అనంతం  అయిపోవాలి. ఇక్కడ మీకు హాయిగా అనిపిస్తోంది అంటే -  అది నాకు అవమానమే..!!

అతనిలోని జ్వాల అజ్ఞాన పొరలను దహించడం వల్ల గోరఖ్ నాథ్ కి అకస్మాత్తుగా చెప్పలేనంత శక్తి వచ్చింది.

ఇక విషయానికి వస్తే, మీరు దాని గురించిన ఆలోచన వదిలేయండి. మీరు, సుముఖంగా ఉండండి. మీకు సుముఖంగా ఎలా ఉండాలో కూడా తెలీదు. నేను ప్రజల్ని ఎప్పుడూ కూడా వారి అనుభూతిలో లేని విషయాల్ని మాట్లాడడానికి ప్రోత్సహించను. ఎదైతే మీ అనుభూతిలో ఉందో మీరు దానితో ఉండి తరువాతి అడుగు గురించి చూడండి. మీ అనుభూతిలో లేని దాని గురించి నేను మాట్లాడితే, మీకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి.. మీరు నేను చెప్పింది నమ్మాలి లేదా నమ్మకుండా ఉండాలి.  మీకు మరొక ఎంపిక ఏమీ లేదు కదా..? నన్ను నమ్మమనో, నమ్మవద్దు అనో  చెప్పడం  అంత సభ్యమైన విషయం కాదు. అది అవసరం లేదు.

తెలిసిన చోటు నుండి మొదలుపెట్టడం తెలివైన తీరు

మీరు మీకిప్పుడు ఏమి తెలుసో అది చేస్తూ, తరువాతి అడుగు ఏదో చూడండి. ఈ విధంగానే మీరు ఎక్కడికైనా చేరగలరు. మీరు చంద్ర మండలానికి వెళ్లాలన్నా కూడా, మీరు మీ ప్రయాణాన్ని మీరు కూర్చున్న చోటు(ఇక్కడ) నుంచి మొదలు పెడతారు. అవునా..? మీరు మీ ప్రయాణాన్ని మరెక్కడినుంచో మొదలు పెట్టడం అంటే, అది ఊహే. అందుకని, ఇప్పుడు ఏదైతే మీకు నిజమో, తెలిసిన సత్యమో.. అక్కడి నుంచే మీరు మరొక అడుగు, మరో అడుగు వెయ్యగలరు. అందుకని మీ అనుభూతిలో లేని విషయాల గురించి మాట్లాడకండి. మీరు తరువాతి అడుగు ఏలా వెయ్యాలి, అన్నది మాత్రమే చూసుకోవాలి. ఒకసారి మీకు తరువాతి అడుగు ఏమిటో తెలిసిన తరువాత.. ఆ తరువాత.. ఆ తరువాతి అడుగు.. మరో అడుగు.. ఈ విధంగానే కదా మీరు ఎక్కడికైనా వెళ్లగలిగేది? ప్రజలు ఈ మౌలికమైన విషయాన్ని గుర్తించలేదు కాబట్టే మానవాళి ఇంత కాలంగా ఇలా చిక్కుకుపోయి ఉంది.

ఈ రోజున శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు అంటే, ఈ గ్రహం మీద మనిషి రెండు కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడని. ఈ రెండు కోట్ల సంవత్సరాల్లో, మన ఈ గ్రహం మీద ఉండడం అన్నది ఎంతో పెద్ద అనుభవం. రెండు కోట్ల సంవత్సరాల అనుభవం ఉండి కూడా రాతి యుగం నాటి మనిషికి ఎలా కోపం వస్తుందో మీకు కూడా అలానే వస్తూ ఉంది కదూ..? రెండు కోట్ల సంవత్సరాల అనుభవం ఉండి కూడా కోపం అన్న ఒక చిన్న విషయానికి మనకి ఇంకా పరిష్కారం తెలియదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం అన్నది ఒప్పుకోడానికి మనం సుముఖంగా లేము.  మనమెప్పుడూ మనం ఎక్కడో ఉన్నాం అని అనుకుంటున్నాం.

అన్నిటి గురించి తెలుసు..మీ గురించి తప్ప

చాలా మందికి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు. ఆయన ఎడ్రస్ ఏమిటో తెలుసు. మీకు,  ఆయన పేరు తెలుసు, ఆయన భార్య పేరు, పిల్లల పేర్లూ, ఆయన పుట్టిన రోజూ ఇలా అన్నీ తెలుసు. కానీ మీరెక్కడున్నారో మీకు తెలియదు. అదే, వచ్చిన సమస్యల్లా..!! ఎవరికైతే  వారెక్కడున్నారో తెలియదో, అది తెలుసుకునే సామర్థ్యం లేదో వారు ఈ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి సమర్థులా..?? అటువంటి ఆవశ్యకత ఉందా..? అందుకని మనం ఎక్కడో ఈ మాయ అనే ఆటలో పడిపోతున్నాం. మీరొకసారి ఈ మాయలో పడిపోయిన తరువాత ఇహ దానికి అంతే లేదు. అది అలా ఒక కోటి విధాలుగా కొనసాగుతూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో మనం దీనినే మతం అంటున్నాం.

మతం అంటే అద్భుతమైన మేధస్సు. మనం జీవించడానికీ ఇక్కడ మనుగడ సాగించడానికీ మీకు కొంత మేధస్సు కావాలి. ఔనా..? ఇదే మీరు మరొక పరిణామంలోకి పరిణతి చెందాలి అంటే, ఇంతకంటే మరెంతో మేధస్సు కావాలి. కానీ ఎంతో మూర్ఖమైన వాళ్ళందరూ తమని తాము ఈ ప్రపంచంలో వాళ్ళు మతవాదులు అని చెప్పుకుంటున్నారు. ఆధ్యాత్మికత అన్నది మన భారతదేశంలో ఈ విధంగానే నడుస్తోంది. నేను, మీకు.. అదిగో అక్కడ చూడండి.. ఆ బల్బు దగ్గర చూడండి.. శివుడు కనిపిస్తున్నాడు.. చూడండి.. చూడండి.. ఆయన అక్కడే ఉన్నాడు -  అని అన్నాననుకోండి, ఈ హాల్లో, ఎవరైతే మూర్ఖులో వాళ్ళు శివుడిని మొట్టమొదటగా చూస్తారు.

కొంచం తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఏమి జరుగుతోంది అని ఆశ్చర్యపోతారు. ఇలా చూసేవాళ్ళకి వాళ్ళ ఊహాగానాల మీద నియంత్రణ లేదు. ఏది వారి ఊహో, ఏది కాదో కూడా వారికి తెలియదు. వాళ్ళు అన్నింటినీ చూడడం మొదలు పెట్టేస్తారు. వాళ్ళు ఇక్కడ దేవతల్నీ, దేవదూతల్నీ అన్నిటినీ చూస్తారు. కానీ, కొంచెం తెలివైనవాళ్లు అసలు ఇక్కడ ఏమి జరుగుతోందీ అని ఆశ్చర్యపోతారు. దురదృష్టవశాత్తూ, ఈ రోజున దీనినే మనం మతమూ, ఆధ్యాత్మికతా అంటున్నాం. అందుకే సరైన ఆలోచన ఉన్నవారు ఎవరూ ఆధ్యాత్మికత దరిదాపులకి కూడా రావాలనుకోవడం లేదు.  ఎందుకంటే ఇంత అధ్వాన్నంగా దీనిని చూపిస్తున్నారు కాబట్టి..!!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు