మన దైనందిన జీవితంలోని వత్తిడి , ఓడిదుడుకులని తట్టుకునేందుకు , అవి మనల్ని బాధించకుండా మన రోజు సజావుగా సాగడానికి సాధన ఎలా సహకరిస్తుందో సద్గురు వివరిస్తునారు. 

ప్రశ్న: కొత్తగా సాధనని మొదలు పెట్టిన్నప్పుడు,శరీరంలో శక్తి ఉరకలెత్తుతున్నట్లు అనిపించేది. ఈ స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, రోజూ వారి జీవితంలోని భయాలూ, బెంగలూ, వత్తిడి, వీటి ప్రభావంనుండి తప్పించుకోలేక పోతున్నాం. వీటికి లొంగిపోకుండా ఉండడానికి రోజూ చేసే సాధనా కాలాన్ని పెంచాలా?

మీరు ప్రతీ రోజూ చేసే శాంభవి మహాముద్ర లేదా శక్తి చలన క్రియల సమయాన్ని పెంచలేరు, పెంచకూడదు.కావాలంటే కపాలభాతీ, పెంచవచ్చు, అంతే, మిగితావన్నీఅలానే ఉంచడం శ్రేష్టం, ఎందుకంటే మీ శరీర వ్యవస్థ అంతకు మించి తట్టుకోలేదు కాబట్టి. మీకు అంతగా మరో ఆలంబన కావాలని అనిపిస్తే, మంత్రోఛ్ఛారణ చేయడం ఉత్తమం. సరళంగా, ఉఛ్ఛరించడానికి వీలుగా ఉన్న లయబద్ధమైన ఓ మంత్రాన్నితీసుకుని, అది ఉఛ్ఛరిస్తూ/ స్మరిస్తూ ఉండండి. మంత్రం అనేది ఓ సున్నితమైన ప్రకంపన. ఈ ప్రకంపనలు మీ వ్యవస్థను ఓ పద్ధతిలో క్రమబద్దీకరించగలవు.

మీరు సంయమ ప్రోగ్రాం చేసినట్లయితే, కళ్ళు తెరిచి ధ్యానం చేయడం మొదలుపెట్టవచ్చు. ఇలా ప్రతి నిత్యం సాధన చేస్తే, క్రమేపీ కళ్ళు తెరిచినా మూసినా మీరు ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఇంక మీరు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీకు అదనపు సాధన చేసే అవసరముండదు, మీరే ఆ సాధనకు ప్రతిరూపమవుతారు! మెలకువతో  ఉన్న ప్రతీక్షణం ఇలా చేయలేకపోతే, గంటకోసారి చేయండి, మీరే పని చేస్తున్నా గంటకోసారి ఓ చిన్నవిరామం తీసుకుని ఇలా చేయండి.

ఒక వేళ మీరు సంయమ ప్రోగ్రాం చేయనట్లయితే, మంత్రోఛ్ఛారణ చేయవచ్చు. ఈ ఉఛ్ఛారణ రోజంతా చేయలేకపొతే, గంటకోసారి కొంత విరామం తీసుకుని మంత్రాన్ని జపించండి. లేదా మీరు పరిపూర్ణ జాగృతితో ఎప్పుడైనా సరే,  ఎవరితోనూ మాట్లాడనప్పుడు , ఏ పనీ చేయకుండా ఉన్నప్పుడూ, తీరిక సమయాల్లో మంత్రాన్ని ఉఛ్ఛరిస్తూ ఉండండి.

https://soundcloud.com/soundsofisha/sets/vairagya-bonding-with-beyond

సౌండ్స్ ఆఫ్ ఈశ బృందం వైరాగ్యా అనే ఓ cd ని విడుదల చేసింది . ఇందులో ఐదు మంత్రాలున్నాయి , నిర్వాణ షట్కం, గురు పాదుక స్తోత్రం , బ్రహ్మానంద స్వరూపా , ఆమ్ నమః శివాయ, శంభో(మంగళ ప్రదమైనది). దీని విడుదల వెనుక ఓ ప్రత్యేకమైన ఉద్దేశ్యముంది. ఈ cd లో మంత్రాల్నిపదేపదే వినండి. ఒక్కోటీ ఓ పది నిమిషాలుంటుంది. ఏ మంత్రంవైపు మీరు ఆకర్షితులౌతారో తెలుసుకునే ప్రయత్నం చేయండి .అంటే అదేదో మీ స్నేహితులతో చర్చించి ‘ నాకైతే ఈ మంత్రం ఎంతో నచ్చింది, మరి మీకేది నచ్చింది, అదా?, అయితే నేను కూడా దాన్నే ఎంచుకుంటాను’... ఇది ఇలా చేయవలసిన పని కాదు. ఆ  మంత్రం వింటున్నప్పుడు మీరు పూర్తిగా దాని వశమైపోవాలి, అంతే... ఇంక దాన్ని వదలకండి!ఇంక మీ ఇంట్లో, కారులో ,ఐపాడ్ లో , ఐ ఫోన్ లో, అంతటా అదే మారుమ్రోగిపోవాలి!ఇవే మంత్రాలు గంటసేపు ఆడియో ఫైల్స్ లోకూడా ఉన్నాయి. అలా కొంత కాలం అవి వింటూ ఉండండి .

మొదట్లో మీరు దాన్ని గట్టిగా/ బిగ్గరగా పాటలా పాడుతారు,  క్రమేపీ నోరు మెదపకుండా, ఆ మంత్రాన్ని లోలోనే స్మరిస్తూ ఉండండి. కానీ ఇలా జరగాలంటే, మీరు మంత్రోఛ్ఛారణని కొంత సమయం పాటు బిగ్గరగానే చేయాలి. అలా చేసినప్పుడే మీరు దాన్ని మీ అంతరంగంలోకి తీసుకుని వెళ్ళగలరు. తగినంత ఉఛ్ఛారణ చేస్తేనే అది మీ స్మృతిలో నాటుకుపోయి మీలో ప్రతిధ్వనిస్తుంది.అది అలా లోపల మెదులుతూనే ఉంటుంది. ఒక్కసారి తలచుకుంటే చాలు ఉఛ్ఛారణ దానంతటదే ఉప్పొంగివస్తుంది.

సాధకునిగా ఇంకా అంత గుర్తింపు రానప్పుడు , సాధువైన రామదాసుని జీవితంలో ఓ రోజు ఇలా జరిగింది. రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న ఓ రాత్రివేళ ఓ ఇంటి చావడిలో పడుకుని నిద్రపోయాడు. ఆ ఇంటి యజమానికి ఎవరో, రామ, రామ, రామ, అని అనడం వినిపించింది . నిద్రపొనీయకుండా ఏమిటీ నస అని తిట్టుకుంటూ అక్కడే పడుకున్న రామదాసు దగ్గరకి వెళ్ళాడు, చూస్తే అతను గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ అతని శరీరం నుండే ఆ శబ్దమొస్తోంది! రామదాసు తన జీవితమంతా రామ నామ స్మరణలోనే గడిపాడు, అది ఎంతటి తారాస్థాయికి వెళ్లిందంటే ఆతని శరీరమంతా రామ... రామ... రామనమ జపంతో ప్రతిధ్వనించేది! మీరు కూడా ఓ మంత్రాన్ని మీ శ్వాసలా చేసుకోవచ్చు ..కానీ దానికి కఠోర సాధన కావాలి!

అదెలా అంటే, మీలో ఓ టేప్ రికార్డర్ ఉన్నట్లన్నమాట , మీకోసం మీరు పాడుకునే శ్రమలేకుండా, దానంతట అదే అలా వెళ్ళిపోతూ ఉంటుంది! కానీ ఆ స్థాయికి  చేరాలంటే తగినంత ఉఛ్ఛారణ చేయాలి . మీ దైనందన జీవితంలో అలా చేయ గలిగితే, పరిస్థితులు అంత సాజావుగా లేనప్పుడు వాటిని ఎదురుకొనే ఓ ఉతంలా ఉండి మీకు నిలదొక్కుకునే స్థైర్యాన్ని ఇది ఇస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు