జీర్ణ ప్రక్రియ తమాషా
 
 

మన జీర్ణ ప్రక్రియ విధానాన్ని తెలుసుకోకుండా, దానికి ఎటువంటి ఆహారం ఎంత మేరకు అందించాలి అనే విషయాన్ని ధ్యాసలో ఉంచుకోకుండా తినడం వల్లనే ఎన్నో రోగాలు వస్తున్నాయని సద్గురు చెబుతున్నారు.

జీర్ణ ప్రక్రియలో తమాషా అంశం ఏమిటంటే, ఒక రకమైన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి జీర్ణ వ్యవస్థ "క్షారాల్ని" ఉత్పత్తి చేస్తే, మరొకరకమైన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి "ఆమ్లాల్ని" ఉత్పత్తిచేస్తుంది. మీరు అన్నీ కలగాపులగం చేసిన ఆహారాన్ని తీసుకుంటే, శరీరం కూడా అయోమయంలో పడి ఆమ్లాల్నీ,  క్షారాల్నీ రెండింటినీ ఉత్పత్తి చేస్తుంది. అవి ఒకదాన్నొకటి నిర్మూలించుకుని, జీర్ణ రసాలు తమ పదును కోల్పోయేలా చేస్తాయి. దానివల్ల ఆహారం శరీరంలో అవసరానికి మించి ఎక్కువ సమయం ఉండి, కణాల స్థాయిలో దానికి పునరుజ్జీవనం కలిగించే శక్తి కోల్పోతుంది.

ఇక్కడ  ఏది తినకూడదన్నది ప్రశ్న కాదు. ఏది ఎంత తినాలన్నది.

అది మనం "తమస్సు" అని పిలిచేది -  శక్తి వ్యవస్థలో మందకొడితనాన్ని సృష్టించడానికి హేతువు అవుతుంది. కాలక్రమంలో అది మీ వ్యక్తిత్వ ప్రమాణాన్ని తగ్గించడమే గాక, మీరు అందుకోగల ఉన్నత ప్రమాణాలకి విఘాతం కలిగిస్తుంది. సంప్రదాయంగా, దక్షిణ భారతదేశంలో, కొన్ని ఆహారాలు కలగలిపి తీసుకోరు. కానీ ఇప్పుడు ఆహారం తీసుకోవడం శరీర శ్రేయస్సుకి కాకుండా, సామాజిక వ్యవహారమైపోయింది. మనుషులు "బఫే" లలో తినడం, అక్కడ ఎన్నోరకాల వంటకాలను వడ్డించడమే ముఖ్యమైపోయింది తప్ప, అవి ఆరోగ్యాన్నీ, శరీరాన్నీ పరిరక్షించడానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్న ప్రశ్న ఉండడం లేదు.

ఇక్కడ ఏది తినకూడదన్నది ప్రశ్న కాదు. ఏది ఎంత తినాలన్నది. ఇది నైతిక ప్రశ్న కాదు, జీవిత స్పృహకు సంభందించినది. మీకు చురుకుగా పనిచేసే మెదడు కావాలి, శరీరానికీ మనసుకీ మధ్య సమతౌల్యం కావాలి. ఇందులో కొందరికి ఆధ్యాత్మిక లక్ష్యాలు కూడా ఉన్నాయి. కనుక, ప్రతివ్యక్తీ, తన శరీరానికి సరిపడిన ఆహార సంతులతను సాధించాలి. దానిని ఒక బలవంతపు వ్రత నియమంలా కాకుండా, స్పృహతో, పరిశీలనతో అందుకోవాలి.

మనిషికున్న సమస్య శ్రద్ధ లేకపోవడం, అతిగా లభిస్తున్న సమాచారం. యోగశాస్త్రం ముఖ్యంగా మనిషి అంతర వ్యవహారాలతో నిమిత్తం కలిగినది.

తిండి విషయంలో చపలత్వం లేకుండా ఉండడం చాలా ముఖ్యం. ఆహారం ఎన్నడూ మన ఆలోచనల్ని పూర్తిగా ఆక్రమించుకోకూడదు. భూమి మీద ప్రతి జీవికీ ఏది తినాలో ఏది తినకూడదో జన్మతః తెలుసు. అలాంటపుడు మనిషికున్న సమస్య ఏమిటి? మనిషికున్న సమస్య శ్రద్ధ లేకపోవడం, అతిగా లభిస్తున్న సమాచారం. యోగశాస్త్రం ముఖ్యంగా మనిషి అంతర వ్యవహారాలతో నిమిత్తం కలిగినది. మానవ వ్యవస్థ పనిచేసే తీరుతెన్నులపై దానికున్న అఖండమైన పరిజ్ఞానం ద్వారా అది అనేక శాఖలుగా విస్తరించింది. అందులో ఒకశాఖ ఆయుర్వేదం. అది ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యంలోకి వస్తోంది. "ఆయుః" అన్న పదానికి "జీవన ప్రమాణం" అనీ, "వేద" అన్న శబ్దానికి శాస్త్రం, విజ్ఞానం అనీ అర్థం. కనుక ఆయుర్వేదం ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే శాస్త్రం. అది భూమి మీద ఉండే వృక్ష సంపదనూ, పృధ్వీ ధాతువునూ ఆరోగ్యాన్ని పెంపొందించడానికీ, శరీర వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికీ ఉపయోగిస్తుంది. ఇటువంటి విజ్ఞాన శాస్త్రాలు, యోగ సాధన చేసేవారు అందుకోగల లక్ష్యాలను, తగిన యోగ సాధన చెయ్యలేని వారు కూడా అందుకోవడానికి ఉద్దేశించినవి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1