'ధరిత్రి' దినోత్సవం అంటే ఏమిటి?

ఏప్రిల్ '22' వ తేదీని 'ధరిత్రి' దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .
 
 

ఏప్రిల్ '22' వ తేదీన ప్రపంచ 'ధరిత్రి' దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దినం యొక్క నేపథ్యాన్ని, ఇది సాధకునికి ఎందుకు విశేషమైనదన్న విషయాన్ని వివరిస్తూ సద్గురు చెప్పిన ఓ కధను ఇక్కడ మీకు అందిస్తున్నాం .


1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరలో చమురు విస్పోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తరువాత అమెరికా పార్లమెంట్ సభ్యుడు గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) ఏప్రిల్ 22 వ తేదీని ధరిత్రి దినోత్సవంగా  ప్రకటించారు. తొలి ధరిత్రి దినోత్సవం United States Environmental Protection సంస్థ ఆవిర్భవానికీ,  పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకూ దారి తీసింది.

ప్రతి సంవత్సరం దాదాపు ఒక నూరుకోట్ల మంది జరుపుకునే అతి పెద్ద వేడుకలలో ఈ ధరిత్రి దినోత్సవం ఒకటి. ఈ సంవత్సరం మనం జరుపుకునేది '45'వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ వారం మొత్తం, అలాగే ఏప్రిల్ 22వ తేదిన పర్యావరణ పరిరక్షణ పట్ల  సామాజిక స్పృహను,  స్పందనను పెంపొందించేందుకు ప్రపంచంలోని భిన్న జాతుల వారు, భిన్న విశ్వాసాలకు చెందిన వారు, భిన్న నేపధ్యం  కలిగిన వారు, అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు,  కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ధరిత్రి దినోత్సవం రోజున మనం చేయగలిగిన పనులు

1) ఒక చెట్టు నాటడం

2) మనం సొంత నీటి సీసాను,కిరణా సంచిని మన వెంట తీసుకునిపోవటం

3) శాఖాహారిగా మారటం

4) స్థానికంగా పెరిగే కూరగాయలు కొనటం

5) 'ముద్రణ' (ప్రింటింగ్‌) ని  తగ్గించటం

6) మోటారు వాహనాలకు వాడకుండా నడవడం, సైకిల్ తొక్కడం

7) ప్రతి రోజునీ ధరిత్రి దినోత్సవంగానే భావించి, పై వాటిని పాటించడం

మానవ చైతన్యం(Consciousness), పర్యావరణ పరిరక్షణల గురించి సద్గురు

ఆద్యాత్మిక పథంలో ఉన్నవారు ప్రతి దాని గురించి ఎరుక(అవేర్‌నెస్)తో ఉండటం ఎంత ముఖ్యమో సద్గురు ఈ కథలో వివరించారు.

ఓ జెన్ గురువుకి సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. ఆసియా ఖండంలో ప్రజలు సాధారణంగా  చన్నీటి స్నానం చేస్తారు. ఎప్పుడో ఒకసారి వేడి నీటితో స్నానం చేస్తారు.  అలా వేడి నీటితో స్నానం చేసేటప్పుడు కుర్చీపై  కూర్చొని ఒంటిని నూనెతో బాగా మర్దన చేయించుకుంటారు. దీనికి ఒకరిద్దరి సహాయం అవసరమౌతుంది.

ఇటువంటి పనినే ఒక ఇద్దరు శిష్యులు ఆ జెన్ గురువు గారికి చేసారు. స్నానం అయిపోయిన తరువాత మిగిలిపోయిన నీటిని ఆ శిష్యులు పారబోసారు. అది చూసిన ఆ జెన్ గురువు  ఆ నీటిని ఎందుకు పారబోసారని ప్రశ్నిస్తూ ఒక కర్రతో వారిద్దరిని దండించారు.

అప్పుడు ఆ శిష్యులు, "కొంచెం నీరే కదా ? మీరెందుకు గొడవ చేస్తున్నారు?" అని అడిగారు.

ఆ గురువు గారు “ఆ కొంచెం నీటిని ఒక చెట్టుకి పోయవచ్చు కదా” అని బదులిచ్చారు. “మీరు పోయమంటే మేము చెట్లకి నీరు పోసేవాళ్ళం కదా. ఆ కొంచెం నీటితో మునిగేదేముంది?" అని ఆ శిష్యులు ప్రశ్నించారు. అప్పుడు ఆ గురువు గారు “విషయం ఏమిటంటే  మీరు నడిచే భూమి, పీల్చే గాలి, త్రాగే నీరు అన్ని జీవాన్ని రూపొందించే పదార్దాలు. మీరు ఎప్పుడూ కూడా మీ చిన్న వేలుని, 'ఇది చిన్నవేలే కదా' అని విరిచి పారవేయలాని అనుకోరు. మీరు నిజంగా అన్నిటిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనుకుంటే(include చేసుకోవాలనుకుంటే) మీరు అన్నిటిని సమదృష్టితో చూడటం నేర్చుకోవాలి. ఇందుకు చైతన్యాన్ని(consciousness) పెంపొందించుకోవాలి. అది చాలా ముఖ్యం” అని సెలవిచ్చారు

ఇది లైట్‌ని ఆర్పటం, వేయటం గురించి కాదు. నీటిని, ఆహారాన్ని  పరిరక్షించటం గురించి కాదు. చేతనతో  జీవించటం ఎంత ముఖ్యమో తెలుసుకోవడం గురించి. మీ చుట్టూ ఏమి ఉన్నా, అది ఫ్యాన్ అయినా, బల్బ్ అయినా, ఏదైనా ఎరుకతో ఉపయోగించండి. ఎరుకతో ఉండడం మీకు ముఖ్యం. అంతేకానీ కరెంటు, ఫ్యాన్‌లకు కాదు.

సంపాదకుడి సూచన: "ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్" (http://www.projectgreenhands.org) అనే భారీ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఒక చెట్టుని నాటి మీ మద్దతు తెలపండి

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1