ప్రశ్న: ఒక్కో సారి నాకనిపిస్తుంది, నాకు కావలసింది నేను దేవీని సరైన విధానంలో అడగటంలేదేమో అని. నా కోరిక నేరవేరనప్పుడు ‘నేను సరిగ్గా అడగకపోవడం మూలానే ఇలా జరిగిందేమో’ అని అనుకుంటాను. అసలు కోరికలు ఎలా కోరుకోవాలి?

సద్గురు : కోరికలు కోరుకోకపోవడం అన్నిటికంటే ఉత్తమం! మీరు దేవి అనే ఆ కోణంతో ఎంత ప్రగాఢమైన భక్తిలో ఉన్నారనేదే ముఖ్యం, ఎందుకంటే మీరెప్పుడైనా మీకు తెలిసిన దాని గురించే అడుగుతారు. మీకు తెలియని దాని గురించి మీరేమీ అడగలేరు కదా? మీకు తెలిసింది అడగటంలో మీ అభివృద్ధి ఉందని తాత్కాలికంగా మీకనిపించవచ్చు కానీ, నిజానికి  ఇలా చేయడం వలన మీరు వెనకడుగు వేస్తున్నారు.  

మీకు తెలియనిది జరగాలంటే మీరు అడగటం మానేయాలి.

మీకు తెలియనిది జరగాలంటే మీరు అడగటం మానేయాలి. ఆ శక్తితో అనుసంధానమైతే పనులు వాటంతట అవే జరుగుతాయి, ఎలా జరిగినా మనకది సమ్మతమే! ఎందుకంటే ఏదైనా జరగడానికి మీలో మీరు ఎంత స్థిరంగా, స్థాపితమై ఉండాలంటే, మీ చుట్టూ ఏం జరుగుతున్నా మీ జీవితంపై అది ఎటువంటి ప్రభావమూ చూపకూడదు. మీ జీవన లక్షణాన్నిఅది శాసించకూడదు. అయితే మీ చుట్టూ పరిస్థితులు మీ పనిని ప్రభావితం చేయొచ్చు, ప్రపంచంలో మీరు చేసే వివిధ కార్యాలని కూడా ప్రభావితం చేయొచ్చునేమో కానీ..మీ మౌలిక లక్షణాన్ని, మిమ్మల్ని, ఏ మాత్రం శాసించ కూడదు. ఇదే గనక స్థిరంగా స్థాపితమైతే, ఇక అడగటం , కోరికలు కోరుకోవడం ఇవన్నీమీకో అల్పమైన , అవివేకమైన చర్యలా అనిపిస్తాయి  

మిమ్మల్ని మించినదేదైనా మీకు జరగాలంటే. అది కోరుకోవడం ద్వారా జరగదన్న విషయం మీ స్ఫురణలోకి రావాలి. అడగటం అనేది ఓ మౌలికమైన అస్తిత్వం. దీన్ని మించి ప్రగాఢమైన జీవనం జీవించడానికి ఎన్నో విధానాలున్నాయి. అందుకే ‘ఇది జరుగుతుందా, లేదా..అని ఖంగారు పడటంలో అర్ధం లేదు. జరిగితే మంచిది.. జరగకపోతే మరీ మంచిది .

అంటే భైరవితో మీ సమయం వృధా చేసుకుంటున్నారనేనా అర్ధం? నాకో విషయం చెప్పండి .. దైవం మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు దైవాన్ని నడిపిస్తారా? ఈ ఒక్క విషయం మీకర్ధమైతే. ఇక మరే సమస్యా లేదు!

ప్రేమాశీస్సులతో,
సద్గురు