దైవాన్ని గురించి మీ తీర్మానాలన్నీవీడండి!

 

ఒక వ్యక్తికి తాను పెరిగిన పరిస్థితుల వల్ల తనలో బలంగా నాటుకున్న నమ్మకాలను అధిగమించి, కనీసం తన జీవితంలోని అత్యంత ప్రాధమిక అంశాల గురించి కూడా తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. మీకు రెండు చేతులు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, లేక రెండు చేతులు ఉన్నాయని మీకు తెలుసా? మీ చేతులను చూసేందుకు మీ రెండు కళ్ళూ వాడక పోయినా, మీకు రెండు చేతులు ఉన్నాయని మీకు తెలుసు. అది మీకు అనుభవపూర్వకంగా స్పృష్టంగా తెలుసు. కాని దైవం వద్దకు వచ్చేసరికి, మిమ్మల్ని దేవుడిని నమ్మమని చెప్పారు. కాని ఎవరూ దేవుడిని అన్వేషించమని చెప్పలేదు.

ఒక విషయాన్ని నమ్మడం వలన పరివర్తన రాదు. అదే విషయాన్ని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు, అది మీలో సంపూర్ణమైన పరివర్తనను తీసుకువస్తుంది. ఏదైనా ఒక అనుభూతి మిమ్ముల్ని స్పృశించకుండా, మీరు నమ్మే వాటికి అర్థమేమి ఉండదు.ఉదాహరణకు మీరు పుట్టిన క్షణం నుంచీ నేను మీకు “నా చిటికెన వేలే దైవం” అనిచెపితే, నా చిటికెన వేలును మీకు చూపినపుడల్లా మీలో భక్తిభావం కలుగుతుంది. మీరు పుట్టినప్పటినుంచి అదే వేలును చూపినేను“నా చిటికెన వేలే దెయ్యం” అని బోధిస్తే, నా చిటికెన వేలును మీకు చూపినపుడల్లా మీలో భయం కలుగుతుంది. మీ మనస్సు యొక్క స్వభావం ఇదే.

మనస్సు ఒక ద్రవ పదార్ధంలాంటిది, దాని నుంచీ మీరు ఏవయినా సృష్టించుకోవచ్చు.

మీ మనస్సు ద్వారా మీరు ఏమి తెలుసుకున్నా, దానికి నిజమైన సార్థకత లేదు. ఒక పరికరంగా మాత్రమే అయితే సరే, కాని  అంతిమ విశ్లేషణలో దానికి అర్థం ఉండదు. ఎందుకంటే అది ఇవాళ ఒక స్వరూపాన్ని తీసుకోవచ్చు, రేపు మరొక స్వరూపాన్ని తీసుకోవచ్చు. మనస్సు ఒక ద్రవ పదార్ధంలాంటిది, దాని నుంచీ మీరు ఏవయినా సృష్టించుకోవచ్చు. అది ఎలా మారుతుంది అనేది కేవలం అది ఎలా ప్రభావితం చేయబడతుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. లోతుగా గమనిస్తే, 'మీ మనస్సు” అని మీరు పిలిచేది, వాస్తవానికి మీ చుట్టూ వున్నకొన్ని వేల మంది నుంచి మీరు అరువు తెచ్చుకున్నదే. మీ మనస్సు మీరు అనేక శకలాలను చేర్చి ఏర్పరచుకున్నదే. మీ నేపధ్యమే మీ మనస్సు. మీ కుటుంబ పరిస్థితులు, చదువు, మతం, మీ దేశము, మీ చుట్టూ ఉన్న సమాజము, మీరు నివసించే ప్రపంచము...వీటిని బట్టే మీ ఆలోచనలు ఉంటాయి.

ఈ మేధస్సు అనేది కేవలం మనుగడకు పనికివచ్చే పనిముట్టు. మీ జీవితంలో దీని స్థానం పరిమితమయినది. మనుగడ అవసరమే కాని అది సంతృప్తినివ్వదు. మీరు కనుక జీవితపు లోపలి పార్శ్వాలను తెలుసుకోవాలనుకుంటే, ముందుగా మీకు దానికి అవసరమైన పరికరాలు కావాలి. ప్రస్తుతం జీవితాన్ని మీరు పంచేంద్రియాల సహాయంతో మాత్రమే చూస్తున్నారు. చూసి, విని, స్పృశించి, వాసన చూసి, రుచి చూసి అనుభవిస్తున్నారు. వీటితో మీరు భౌతికానికి అతీతంగా ఉన్న విషయాలు తెలుసుకోలేరు. సముద్రపు లోతును ఒక చిన్నకొలబద్దతో కొలవలేరు. ప్రస్తుతం అందరి విషయంలో జరుగుతున్నది ఇదే! కావలసిన పరికరాలు లేకుండా వారు తమ జీవితపు లోతైన ప్రమాణాలను తెలుసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి, వారు తప్పుడు తీర్మానాలకు వచ్చేస్తున్నారు.

ప్రజలు తీర్మానాలు చేయటానికి తొందరపడతారు. ఎందుకంటే తీర్మానాలు లేకుండా వారిలో ఏ విషయం లేదు.

ప్రజలు తీర్మానాలు చేయటానికి తొందరపడతారు. ఎందుకంటే తీర్మానాలు లేకుండా వారిలో ఏ విషయం లేదు. మీరు 'నేను' అని పిలుచుకునేది, ఆ వ్యక్తిగా, వ్యక్తిత్వంగా చెప్పేది, కేవలం జీవితాన్ని గురించి మీరు చేసిన  “తీర్మానాల” సమూహమే. కాని, మీరు ఏ తీర్మానాలు చేసినప్పటికి, మీరు తప్పకుండా తప్పు దారి పడతారు, ఎందుకంటే, జీవితం ఏ తీర్మానాల చట్రంలోనూ ఇమడదు.

ఈ విషయాన్ని సులభంగా గ్రహించాలంటే, ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకోండి. ఎపుడో ఇరవై ఏళ్ళ క్రితం ఆ వ్యక్తిని కలిసినపుడు అతను చేస్తున్న పని మీకు నచ్చలేదు. కాబట్టి, అతను మంచి వాడు కాదని మీరు తీర్మానించుకున్నారు. ఆ వ్యక్తిని మీరు ఇప్పుడు కలిస్తే, అతను ఒక అత్యంత అద్భుతమయిన వ్యక్తిగా మారి ఉండవచ్చు. కాని, మీ మనస్సు మిమ్మల్ని అతనిని ప్రస్తుతం ఎలా ఉన్నాడో అలా అనుభూతి చెందనివ్వదు. అంటే, ఒక తీర్మానానికి రాగానే, మీరు మీ ఎదుగుదలను ఆపేస్తారు. అంటే, జీవితంలోని సాధ్యతలను ఆపేస్తారు, నాశనం చేస్తారు.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే తొందరపడి తీర్మానాలు చేసుకోవటం కాదు. మీరు ఇక్కడ ఏ తీర్మానాలు లేకుండా ఉండగలిగే ధైర్యం చేయగలిగినప్పుడే, ప్రతి క్షణం పరిశీలించడానికి సిద్ధపడినప్పుడే, ఇక్కడ ఉనికిలో కేవలం ఒక చిన్ని రేణువుగా ఉండడానికి  సిద్ధపడినప్పుడే, మీరు ఈ ఉనికికి హద్దులు లేవని తెలుసుకుంటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1