దేవుడంటే వెలుగు, దివ్యమైన వెలుగు, దివ్య జ్యోతి అని సృష్టికర్త గురించి వివిధ రకాలుగా చెబుతుంటారు. కాని యోగి, మర్మజ్ఞుడు అయిన సద్గురు మాత్రం అంధకారమే భగవంతుడు అని చెబుతున్నారు. ఎందుకో ఈ వ్యాసం ద్వారా చదివి తెలుసుకోండి.

ప్రతీ మతంలోనూ భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పారు. సర్వాంతర్యామి అంటే అంతటా ఉండేది అని అర్ధం. అన్నీ చోట్లా ఉండగలిగింది ఏది? ఈ సృష్టిలో ప్రతీ చోటా ఉండగలిగింది కేవలం గాఢమైన అంధకారం మాత్రమే. వెలుగు అనేది, తాత్కాలికంగా జరిగే ఘటన. వెలుగంటే ఏదైనా కాలినప్పుడు వచ్చేది. అది ఒక దీపం అవ్వవచ్చు, ఎలెక్ట్రిక్ బల్బ్ అవ్వవచ్చు, లేదా అన్నింటికంటే వెలుతురుకి పెద్ద మూలం అయిన సూర్యుడవ్వచ్చు. ఇవన్నీ కూడా నిరంతరం జ్వలిస్తూనే ఉంటాయి.

శివ అంటే అర్థం “ఏదైతే లేదో.. ఏదైతే శూన్యమో” అది 

ఒక దీపాన్ని వెలిగిస్తే నాలుగు గంటలు ఉండవచ్చు. మీరొక ఎలెక్ట్రిక్ బల్బ్ వేస్తే, అది వంద గంటలో, వెయ్యి గంటలో  రావచ్చు. మీరు సూర్యుడి గురించి తీసుకుంటే, ఆయన ఒక పది కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాలిపోయేవే..! మరి, అన్నీ కాలిపోయేవే అయినప్పుడు, ఉన్నదేమిటి..? కేవలం అంధకారమే..! వెలుతురు అనేది చాలా పరిమితమైనది.

"ఏది లేదో"..అదే శి-వ

రాత్రిపూట మీరు అలా సహజంగా పైకి చూస్తే ఎన్నో నక్షత్రాలను గమనిస్తారు. ఇవన్నీ కూడా, చిన్న చిన్న రేణువుల్లా ఉంటాయి. కానీ అనంతమైన  శూన్యం, కేవలం గాఢాంధకారం కూడా అక్కడ ఉంది. కానీ, మీరు దానిని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే, మీ మనుగడా,  మీ అస్తిత్వం కూడా ఎంతో చిన్నది కాబట్టే అటువంటి సృష్టి రూపాలతోనే మిమ్మల్ని మీరు గుర్తించుకోగలుగుతున్నారు.

అన్నీ చోట్లా ఉండగలదో అది కేవలం అంధకారం మాత్రమే. అందుకే, మనం శివుడు నల్లనివాడు అని చెప్తాం. ఆయనే అంతటా ఉండగలడు. శివ అంటే అర్థం “ఏదైతే లేదో.. ఏదైతే శూన్యమో” అది -  అని. సృష్టి అంతా కూడా శూన్యమే..! శూన్యం అంటే అంధకారమే..! ఇంతవరకు మీరు దివ్య జ్యోతి, దివ్యమైన వెలుగు అని విన్నారు. మీరు ఎప్పుడైనా ఒక అడవికి వెళ్ళి జీవిస్తే, చీకటి పడిన తరువాత ప్రాణికోటి చురుగ్గా పాల్గొనడం మొదలు పెడుతుంది. అడవుల్లో అయితే  అవి గర్జిస్తూ ఉంటాయి. ప్రతీ చిన్న పురుగూ, పక్షీ, జంతువూ అవన్నీ కూడా చురుగ్గా ఉంటాయి. మీ కళ్ళు కూడా వాటి కళ్లలాగా తయారు చేయబడి ఉంటే మీరు రాత్రిపూట చూడగలిగినట్లైతే, మీరసలు దివ్యమైన జ్యోతి గురించి ఆలోచించరు. మీరు దివ్యత్వాన్ని అంధకారం అనుకుంటారు.

మీ ఇంద్రియాలు మీ మనుగడ కోసం ఆ విధంగా తయారుచేయబడ్డాయి గనక వెలుగే ముఖ్యం అనిపిస్తుంది. లేకపోతే, అంతటా ఉన్నది కేవలం అంధకారమే. సృష్టి అనేది ఎంతో చిన్నది. కానీ ఏదైతే సృష్టి కాదో, అది అనంతమైనది. ఈ అనంతమైన శూన్యంలోనే  ఏదో ఒకటి అన్నది జరుగుతుంది, లయమైపోతుంది. ఎన్నో నక్షత్ర మండలాలు కూలిపోయి శూన్యంగా మారిపోతాయి. ఏదైతే వెలుతురు అని అంటున్నారో.. ఏదైతే భౌతిక అస్తిత్వం అని అంటున్నారో అది అలా కనిపించి మళ్ళీ ఆ శూన్యంలోకే కలిసిపోతుంది.

అందుకని మనం ప్రతీదీ కూడా, శివుడి నుంచే ఉత్పన్నమై ఆయనలోకే తిరిగి వెళ్లిపోతుంది - అని అంటున్నాము. దేవుళ్ళు, దేవతలు వీరందరూ కూడా ఆయన నుండే వచ్చి, తిరిగి ఆయనలోనే లయం అయిపోతారు. ఇది, కేవలం క్వాంటమ్ ఫిజిక్స్(Quantum Physics) మాత్రమే..! ఇదొక అందమైన కథ లాగా చెప్పబడింది. ప్రజలు చీకటిని చూసి ఎంతగానో భయపడతారు. అంధకారం అంటే ఏమీ లేనిది. మీరు దేనినైనా చూసి భయపడవచ్చు.  కానీ ఏమీ లేనిది మిమ్మల్ని ఏం చేస్తుంది..? కానీ మీకు భయం. ఏదైతే లేదో అదంటే, ఏదో ఒకదానికంటే కూడా ఎక్కువ భయం. మీరు దయ్యం చెయ్యి పట్టుకునైనా నడుస్తారుగానీ, గాఢ అంధకారంలో ఉండలేరు. మీరు ఎప్పుడైనా గాఢ అంధకారంలో ఉన్నారా? మీ చేతులు కూడా మీకు కనపడనంత గాఢ అంధకారంలో..?

చీకటిలో గడపడం ద్వారా మీ ఎరుక పెరుగుతుంది

హాసన్ నుంచి బెంగళూరు వరకు ఒక రైల్వే ట్రాక్ ఉంది. 36 కిలోమీటర్ల దూరంలో సుమారుగా 400 బ్రిడ్జీలూ, 100 టన్నెళ్లూ ఉన్నాయి. ఈ టన్నెళ్ళు ఒక్కొక్కటీ ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్లు ఉంటాయి. మేము, వీటిగుండా ఎన్నోసార్లు ప్రయాణం చేశాం. ఇది అద్భుతమైన ప్రదేశం.  వింధ్యపర్వతాలు ఇక్కడ ఎంతో బాగుంటాయి. ఒకసారి ఆశ్రమంలో వారిని ఇక్కడికి తీసుకు వెళ్ళాం. మేము ఈ టన్నెల్లో నడిచి వెళ్తున్నప్పుడు, అక్కడ గాఢాంధకారంగా ఉంటుంది. ఒక రైల్వే ట్రాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాళ్ళు, రప్పలూ మధ్యలో రైలుపట్టాలూ ఇవన్నీ కూడానూ. కానీ నేను వాళ్లెవ్వరినీ టార్చ్ లైట్ వెయ్యనిచ్చేవాడిని కాదు. మీరు ఇలా చూస్తే, మీకు మీ చెయ్యి కూడా కనబడదు. కాసేపటి తరువాత.. మీ కళ్ళు తెరుచుకుని ఉన్నాయో లేదా మూసుకుని ఉన్నాయో కూడా మీకు తెలియదు.

మీరు నడుస్తున్నప్పుడు అక్కడ గబ్బిలాలూ.. చుష్.. చుష్.. అంటూ వెళ్తూ ఉంటాయి. అవి, మిమ్మల్ని తాకవు. ఎందుకంటే, అవి వెలుతురు మీద ఆధారపడవు. శబ్దం మీద ఆధారపడతాయి. అందుకని, అవి ఎప్పుడూ మీకు తగలవు. కానీ  మీకు ఎంతో దగ్గరగా వెళ్తూ ఉంటాయి. వాటి రెక్కలు మీరు అనుభూతి చెందవచ్చు. ఇలా ఆ అంధకారంలో మీరు నడుస్తూ ఉంటే కాసేపటి తరువాత, ఎంతో అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది.

ఈ సృష్టిమూలం అంతా కూడా అనంతమైన శూన్యం. దీనినే, మీరు భగవంతుడు అని అంటున్నారు.

మీకు మీ కళ్ళు తెరిచి ఉన్నాయో.. మూసి ఉన్నాయో కూడా తెలియదు. నిజానికి ఈ రెండిటి మధ్య, తేడా ఏమీ ఉండదు. మీలో మరింత ఎరుక కలుగుతుంది. ఇది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, మీకు కాసేపటి తరువాత.. వెలుతురు అన్న అవగాహన పోతుంది కాబట్టి. మీ దృష్టిని మళ్లించేదీ వెలుతురే. సూర్యకాంతి ఉన్నప్పుడు మీకు ఆకాశంలో నక్షత్రాలన్నీ కనబడవు. ఈ నక్షత్రాలు సూర్యుడికంటే ఎన్నో రెట్లు పెద్దవి. కానీ,  కేవలం సూర్యకాంతి ఉండడంవల్ల; ఇవన్నీ కూడా మీకు కనబడవు. మీ అవగాహన అంతా తారుమారు అయిపోయింది. సూర్యుడు వెళ్ళిపోయిన తరువాత, సాయంత్రం పూట మీకు ఆకాశంలో ఎన్ని కనిపిస్తాయి. అదే ఉదయమైతే మళ్ళీ ఇవన్నీ కూడా  ఏవీ కనపడవు. మీకు ఈ మాయ అర్థం అయిందా..?

అందుకని  మీ అవగాహనలో ఎంతో తేడా ఉంది. మీ పంచేంద్రియాలు అన్నవి, కేవలం మీ మనుగడ కోసం మాత్రమే..! అవి మీ పరిణామానికి పనికిరావు. కానీ, ఇక్కడ మనుగడకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ, మీరు పరిణామం చెందాలంటే అవి మీకు సరిపోవు. యోగ సంస్కృతిలో ఒక విషయం ఉంది. ప్రజలు కేవలం బాగా జీవించాలి అని అనుకున్నప్పుడు.. మేము భగవంతుడిని వెలుతురుగా చెపుతాము. అదే ప్రజలు ముక్తిని కోరుకున్నప్పుడు భగవంతుడిని అంధకారం అని చెబుతాము.

నిజానికి అన్ని చోట్లా ఉండగలిగింది అంధకారమే కదా. దేవుడు ఎప్పుడూ అన్నీ చోట్లా ఉంటాడు అని చెప్పారు. అందుకని ఇది మనం ఒక సమీకరణంగా చెప్పాలనుకుంటే, భగవంతుడే అంధకారం. ఈ సృష్టిమూలం అంతా కూడా అనంతమైన శూన్యం. దీనినే, మీరు భగవంతుడు అని అంటున్నారు. అందుకని యోగాలో అత్యంత చీకటి రాత్రి, ప్రతీ నెలలోనూ ఎంతో పవిత్రమైనది..అదే అమావాస్య. అదే మీరు కనుక కేవలం శ్రేయస్సునే కోరుకున్నట్లైతే.. పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. మీరు కనుక ముక్తిని కోరుకుంటున్నట్లైతే అమావాస్య ఎంతో పవిత్రమైనది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

nic