మానవ వ్యవస్థపై చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుంది..?

 

చంద్రుడు మన భూమికి ఉపగ్రహం. ఈ గ్రహానికి ఆకర్షితుడై విధిలేక ఈ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. మరి ఇది మనకి ఏ విధంగా ముఖ్యమైంది? ఈ పౌర్ణములు, అమావాస్యలు ఎందుకు మనకు ప్రాముఖ్యమైనవి? మీకు ఇది అనుభవపూర్వకంగా తెలిసి ఉండకపోవచ్చు, కాని మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అది ఏమిటంటే  ఎవరికైనా కొంచెం  మానసిక వ్యాధి ఉందనుకోండి పౌర్ణమి రోజులు, అమావాస్యలలో వారి రుగ్మత మరికొంచెం పెరుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? మీకు కూడా జరుగుతుందా? ఇది మీకు జరుగదు కానీ ఇది మరెవరికో జరుగుతూ ఉంటుంది.  అంటే చంద్రుడు ఒకరకమైన పిచ్చితనాన్ని కలిగిస్తాడు అని కాదు. ఈ చంద్రుడి స్థానాన్ని తీసుకున్నప్పుడు  మీరు ఏమిటో ఆ స్వభావం కొంచెం పెంపొందించబడుతుంది. మీరు ప్రేమగా ఉన్నారనుకోండి ఇంకొంచెం ప్రేమగా మారుతారు, మీరు ఆనందంగా ఉంటే, ఇంకొంచెం ఆనందంగా తయారవుతారు, మీరు పారవశ్యంతో ఉంటే, మీరు మరింత పారవశ్యంతో ఉంటారు. మీకు కొంచెం పిచ్చితనం ఉంటే, మరికొంచెం పిచ్చిగా తయారవుతారు . మీరు ధ్యానం చేయగలిగితే మీరు ఇంకొంచెం ధ్యానం చేయగలిగేట్టుగా మారుతారు. మీరు ఏది? మీ స్వభావం ఏది? అన్నదాన్ని ఇది మరి కొంచెం పెంపొందిస్తుంది. అందుకే ఈ రోజులు  ముఖ్యమైనవి అని మనం అనుకుంటాం.

ఏదయితే తర్కించలేమో పాశ్చాత్య దేశాలలో దీన్నే పిచ్చితనం అని అనడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం తర్కానికి పరిమితులు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

అందుకని మీరు ఎరుకతో మీకు కావల్సిన స్వభావాన్ని ఈ రోజుల్లో పెంపొందించుకుంటారు. ఇవాళ పౌర్ణమి అనుకోండి మీరు  పొద్దున్న లేచి స్నానం  చేసి మీలో ఒకరకమైన ప్రవృత్తిని, స్వభావాన్ని మీకు ఏది  కావాలో దాన్ని ఉండేలా చూసుకుంటారు. అప్పుడు  సాయంత్రానికి మీకు ఏం కావాలో ఆ రకమైన  స్వభావాన్ని అది మరికొంచెం మీలో మెరుగుపరుస్తుంది. ఇది ఎరుకతో చేయడం, మనకు తెలియకుండానే కేవలం దానికి బాధితులు అయిపోవడం కాకుండా, ఇది ఎంతో ఎరుకతో చేయడం, అంటే చంద్రుడు తనంత తానుగా మిమ్మల్ని పిచ్చివారుగానో లేకపొతే ధ్యానం చేసుకోగలవారిగానో తయారు చేయడు, మీరు అలావుంటే దాన్ని చంద్రుడు మరి కొంచెం పెంపొందిస్తుంది, అంతే, ఆ స్వభావాన్ని మరి కొంచెం పెంపొందిస్తుంది. మీకు తెలుసా? ఈ సముద్రం కూడా కొంచెం పిచ్చి తలలు వేస్తుంది అని.

మీరు బీచ్ లో ఈత కొట్టే వారైతే  మీకు అది పిచ్చితనంగా కనిపిస్తుంది. కానీ మీరు ఒక పెద్ద ఓడను ప్రయాణం చేయించాలంటే అది మీకు ఓ పెద్ద వరంగా అనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ సముద్రమే ఎగసిపడాలని ప్రయత్నం చేస్తోంది. ఈ సముద్రమే ఎగసిపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదగడానికి  సానుకూలంగా ఉండి ఉండచ్చు. దీనిని మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లైతే ఈ మానవ జీవితం అన్నది ఇంకా ఎంతో మెరుగైనది, మీతో మీరు ఏం చేయాలన్నా మీకు ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? అని ఎరుకతో ఉండడం అన్నది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఈ ఎరుకతో ఉంటే మీలో ఒక్కొక్క రకమైన స్వభావాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. మనకు ఆంగ్ల భాషలో చంద్రుడిని 'లూనార్' అంటారు, మరో అడుగు వేస్తే "లునాటిక్" అంటే 'పిచ్చితనం'. సహజంగా చంద్రుడి ప్రభావం అనేది మనం తర్కించలేనిదిగా చెప్తాము. ఏదయితే తర్కించలేమో పాశ్చాత్య దేశాలలో దీన్నే పిచ్చితనం అని అనడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం తర్కానికి పరిమితులు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

తర్కాన్ని దాటి వెళ్ళగలగాలి

తర్కం ఎంతో ఉపయోగకరమైనదే. మన జీవితంలో మన బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి తర్కం అన్నది అవసరం. అది వ్యాపారమైనా, ఇల్లు కట్టుకోవడమైనా. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి తార్కికంగా ఉండడం అన్నది ఎంతో అవసరం. ఇవి ఈ విధంగా మాత్రమే చేయగలం. మరో విధంగా చేయలేం. కానీ మనతో వచ్చిన సమస్య ఇదే. మనం బయట విషయాలను చేసుకోవడానికి దివ్యత్వాన్ని పిలుస్తూ ఉంటాం. మన అంతర్ముఖంలో చేయవల్సిన పనులనేమో, తార్కికంగా చేయాలని అనుకుంటాము. మనం బాహ్య ప్రపంచంలోనూ, అంతర్ముఖంగాను కూడా విజయం సాధించలేకపోతున్నాము. ఇక అంతర్ముఖ విషయాలకు వచ్చేసరికి మీరు కనక మీ తార్కిక స్వభావాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే జరిగేది ఏమి ఉండదు. నేను మిమ్మల్ని కళ్ళు మూసుకోండి అని సరళమైన ప్రక్రియ ఏదో చేయమన్నాననుకోండి. మీరు ఇక్కడ కూర్చొని నేను ఇది చేస్తే నాకేమి వస్తుంది, నాకేమవుతుంది అది, ఇది అని లెక్కలు వేయడం మొదలు పెడతారు. ఇలా ఐతే ఎప్పటికి ఏమి జరుగదు.

ధ్యానం గాని, ప్రేమ గాని, పారవశ్యం గాని, ఏదయినా అందమైనది మీ జీవితంలో మిమ్మల్ని స్పృశించాలి  అంటే మీలో కొంత పిచ్చితనం ఉండాలి

ధ్యానం గాని, ప్రేమ గాని, పారవశ్యం గాని, ఏదయినా అందమైనది మీ జీవితంలో మిమ్మల్ని స్పృశించాలి అంటే మీలో కొంత పిచ్చితనం ఉండాలి. అన్ని తార్కికముగా ఉండవలసిన విధంగానే ఉన్నాయి. కానీ మీరు దిగాలు మొహం వేసుకుని కూర్చుని ఉన్నారనుకోండి అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, మీరు సరిగ్గానే ఉన్నారు కానీ జీవితం ఇలా పని చేయదు. మీరు పొద్దున్నే లేచారనుకోండి, రేపు పొద్దున్న మీరు లేచిన తరువాత మీ మంచం మీద పడుకొని మీరు నూటికి నూరు శాతం తార్కికంగా ఆలోచించండి. మీరు అన్నీ మీ జీవితంలో ఆనందంగా ఆహ్లాదంగా గడిపిన క్షణాలని వేటినీ తలుచుకోకండి, ఇలాంటి అనుభవాల్ని తలుచుకోకండి. మీకు ఎంతో విలువైన అనుభవాల్ని తలుచుకోకుండా ఉండండి, ఈ ఆకాశంలో పక్షులు గాని, సూర్యదయాన్ని కానీ, మీ తోటలో పూసిన పూలను కానీ, మీ పిల్లవాడి మొహం కానీ, మీ జీవితంలో మధురమైన క్షణాలను కానీ వేటినైనా తలుచుకోకండి. కేవలం తార్కికంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు మంచం మీద నుంచి లేవాలంటే అది చిన్న విషయం అవదు కదూ, అదేమైనా చిన్న విషయం అవుతుందా? కాదు. ఇంకా దానికి మించి మీ కాల కృత్యాలు తీర్చుకోవాలి. ఇంకా అప్పుడు తినాలి, పని చేయాలి, తినాలి, పని చేయాలి తిని చేయాలి, పడుకోవాలి మళ్ళీ ఆ తరువాత రోజు ఇదే కథ.

మీలో అనుభవాలు అన్నవి తీసేసామనుకోండి ఒక్కసారి మీ జీవితాన్ని నూటికి నూరు శాతం తార్కికంగా ఆలోచించి చూడండి ప్రతిరోజు అవే పన్లు చేస్తూ ఉండాలి ఇంకో ముప్ఫయ్, నలభయ్ సంవత్సరాల పాటు అనుకోండి, మళ్ళీ మీరు యోగ కూడా చేసినట్లైతే మీ జీవితం ఇంకొంచెం పొడిగించచ్చు కూడాను. అది ఇంకొంచెం పొడిగిస్తుంది. ప్రతి రోజు ఇదే పని, ఇదే పని చేయాలంటే ఒక్కసారి తార్కికంగా ఆలోచించి చూడండి, ఇదంతా చేయడం అవసరమా అని? అది చేయడం అవసరమా? లేదు మీకు విపరీతమైన తర్కం చేస్తే అది ఆత్మహత్య వంటింది. అది ఆత్మహత్యలా అనిపిస్తుంది. మీ అందరు కూడా ఇదే విధంగా ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు, కానీ ఈ రోజుల్లో అన్ని ఒక్కసారిగా ఏది చేయరు కదా. అన్ని వాయిదా పద్ధతులలోనే చేస్తారు. మీరు మీ ఆత్మహత్యను కూడా ఇలా వాయిదా పద్ధతుల్లోనే చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోలేకపోతే మీరు ఇంటికి వెళ్లిన తరువాత మీకు ఐదారు ఏళ్ళ వయసులోని మీ ఫోటోలు తీసి చూసుకోండి అప్పుడు మీ మొహం ఇలా ఉండేదో  చూసుకోండి. ఇప్పుడు ఎలా దిగాలుగా తయారైపోయింది అని.

అందుకని మీరు మీ తర్కం నుంచి బయటపడాలి అనుకోండి మీరు దీన్నో విధంగా చేస్తే తప్పితే దానికి అర్ధం లేనిదిగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదయినా అర్ధవంతంగా ఉండాలి అంటే, అది లాజికల్ గా  ఉండాలి. కానీ చూడండి మీ జీవితంలో ఎంతో అందమైన క్షణాలు మీరు మీ తర్కాన్ని పక్కకు పెట్టినప్పుడు మాత్రమే జరిగాయి. అవునా? మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని తర్కించి చూడండి, అది ఎంతో మూర్ఖంగా అనిపిస్తుంది అవునా?కాదా? కానీ మీ జీవితంలో అది ఎంతో అందమైన విషయం అయ్యుండవచ్చు. కానీ దాన్ని తార్కికంగా శల్య పరీక్ష చేసి చూస్తే అది ఎంతో మూర్ఖమైన పనిలాగా అనిపిస్తుంది. కానీ అది మీ జీవితంలో ఎంతో అందమైన అనుభూతిని కలిగించి  ఉండచ్చు.

హఠయోగ అంటే ఏవిటి? “హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు” ఈ రెండూ రెండు అంశాలు.

అందుకని జీవితంలో తర్కం అనే అంశం అనుభవపూర్వకమైన అంశం, ఇవి రెండు భిన్న ధ్రువాలు. యోగంలో మిమ్మల్ని రెండు అంశాలుగా చూస్తాం. సూర్యుడు, చంద్రుడు అని. హఠ అన్న మాట విన్నారా? హఠయోగ అంటే ఏవిటి? “హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు” ఈ రెండూ రెండు అంశాలు. దీనికి ఎన్నో రకాల ప్రతీకలు ఉన్నాయి. శివుడు సగం , పురుషుడు సగం స్త్రీ గా చూపించడం చూసారు ఇవన్నీ ఎందుకంటే మీకు ఒక తార్కికమైన కోణం, అది కాని మరొక కోణం ఉన్నాయి అని చూపించడానికి ఇవన్నీ ప్రతీకలు. మీరు ఇదో, అదో ఐతే మీరు సంపూర్ణమైన వారు కారు.. లేకపోతే మీరు సగం జీవితం మాత్రం గడుపుతున్నారు. మీరు సగం ప్రాణి గానే మిగిలిపోతారు. మనం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియో, యోగానో అన్నప్పుడు  ఏమనుకుంటున్నాము అంటే ఒక పరిపూర్ణమైన జీవన ప్రక్రియగా ఎలా మారాలి అని, ఏదో అలా ఒక సగం జీవన ప్రక్రియగా మాత్రం కాదు. కేవలం శరీరం మాత్రమే సజీవంగా ఉంటే అది మాత్రమే సరిపోదు కదా. ఇక్కడ మీరు కూర్చున్నా, మీరు కళ్ళు మూసుకున్నా మీరు ఏం చేస్తున్నాసరే ఇక్కడ ఉండడం ఉపయోగకరమే. మీలో ఓ భాగం మాత్రమే సజీవంగా ఉంటే,  ఏం చేసినా అది ఉపయోగంగా అనిపించదు.

ఒక పౌర్ణమి రోజైనా, ఒక అమావాస్య రోజైనా సరే చంద్రుడి ప్రభావం మన మీద ఉంటుంది. ఇది ఎంతగానో ఉంటుంది. మీరు అవగాహన చేసుకోగలిగినా, అవగాహన చేసుకోలేకపోయినా ఈ ప్రభావం అన్నది ఉంటుంది. మీలో ఒక తార్కికమైన అంశం ఉంది. ఇది మీరు బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే మీరు గమనించినా, గమనించకపోయినా ఈ చంద్రుడి ప్రభావం మీ మీద ఎంతగానో ఉంది. పౌర్ణమి రోజుల్లో కంటే, అమావాస్య రోజుల్లో, మీ మీద చంద్రుడి ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. మీరు దేనినైనా అవగాహన చేసుకున్నా, చేసుకోకపోయినా సరే ఉన్నదేదో ఉంటుంది.

మీలో ఒక తార్కికమైన కోణం ఉంది. ఇది మన పరిసరాల్ని మన బాహ్య ప్రపంచంలో ఎన్నో పనులు చేయడానికి ఉపకరిస్తుంది. అలానే తార్కికాన్ని మించిన కోణం కూడా మీలో మరొకటి ఉంది. అది లేకుండా మీ అంతర్ముఖమైన విషయాలను మీరెప్పటికీ సరిచూసుకోలేరు. ఈ చంద్రుడు దీనికి ప్రతీక. ఆ కోణానికి ప్రతీక.

ప్రేమాశిస్సులతో,
సద్గురు