బంధనం లేనప్పుడే పరమానందం కలుగుతుందని బుద్ధుడు చెప్పాడు. కాని అలా ఎందుకు అన్నాడో, నిమగ్నతతో ఉండడం వల్ల బంధనం ఎలా ఏర్పడదో, ఆధ్యాత్మికత అంటే నిమగ్నతే అని సద్గురు చెబుతున్నారు.

ప్రశ్న: బంధనం లేనప్పుడే పరమానందం కలుగుతుందని బుద్ధుడు అన్నాడు. దీని అర్ధం ఏమిటి?

సద్గురు: ఏ బంధనం లేకుండా జీవించినప్పుడే పరమానందం కలుగుతుంది అని బుద్ధుడు అన్నాడు. బంధన మీకు బాధని కలిగిస్తుంది. అంటే,  దీనర్థం మీరు ప్రజలతో కలసిమెలసి ఉండకూడదనా..? అలా కాదు. నిమగ్నత మీకు ఎటువంటి బాధని కలిగించదు. కానీ బంధన ఖచ్చితంగా బాధని కలిగిస్తుంది. దేనిలోనైనా నిమగ్నత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిమగ్నతే జీవితం. నిమగ్నత లేకపోతే జీవితమే లేదు. బుద్ధుడు ఏమి చెప్పాడో అది మీ జీవితాన్ని పరిణామం చెందించదు. మీరు కనుక, మీ బుద్ధిని వాడితే అది మీ జీవితాన్ని పరిణమింప చేస్తుంది. బుద్ధుడు ఇది చెప్పాడు, కృష్ణుడు అది చెప్పాడు...ఇలా వీటి వల్ల లాభం ఏముంది..? వాళ్ళు, ఇక్కడ బాగా జీవించి వెళ్ళిపోయారు. మరి మీ సంగతి ఏమిటి..?? నాకు బుద్ధుడిలో గానీ, కృష్ణుడిలో గానీ ఆసక్తి లేదు. ఎందుకంటే, వాళ్ళందరూ చనిపోయారు. నా వ్యవహారమంతా ఇక్కడ జీవించి ఉన్న వారితోనే..!!

మీరు కనుక నిమగ్నతతో ఉన్నప్పుడు, మీరు కలిసి ఉంటే, ఎంతో గొప్పగా ఉంటుంది. మీరు దూరంగా ఉన్నా సరే, అది అద్భుతంగానే ఉంటుంది.

మీరు  ఎందుకు ఇలా బంధనాల్లో చిక్కుకు పోతున్నారంటే, మీరు దేనిలోనూ నిమగ్నమై ఉండకపోవడంవల్లే..!! మీకు, ఎందులోనూ నిమగ్నత లేదు. ఇప్పుడు  మీ చుట్టూరా ఉన్న వస్తువులతో గానీ, ప్రజలతో గానీ కలిసి ఉండడానికి మీకున్న మార్గం - వారితో బంధన ఏర్పరచుకోడం ద్వారానే..!!  మీరు కనుక  మీ చుట్టూరా ఉన్న వాటన్నిటితోనూ సంపూర్ణంగా నిమగ్నమై ఉండగలిగితే, అప్పుడు మీకు అసలు బంధన అన్న మాటే మీ జీవితంలో రాదు. మీరు ఏ స్థాయిలో నిమగ్నమై ఉండాలంటే, చుట్టూ ఉన్న ప్రపంచం మాయమైపోవాలి. మీకు గనుక ఇదే రకమైన నిమగ్నత మీ చుట్టూ ఉన్న ప్రతీ జీవంతోనూ ఉంటే, అది చేతనమైనదైనా, అచేతనమైనదైనా సరే. అప్పుడు బంధన అన్నది ఉండదు.

మీరు ఒకసారి ఈ బంధనలో చిక్కుకుపోయిన తరువాత అవతలివారు జీవించినా మీకు బాధే, మరణించినా మీకు బాధే..! ఎంతోమంది ప్రజలకు ఇలాగే జరిగింది. వాళ్ళు  ఒకరితో ఒకరు కలిసి ఉండలేరు. వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. అలా అని, మీరు వాళ్ళని 24 గంటల పాటూ విడదీస్తే.. ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. మళ్ళీ  మీరు వాళ్ళను తెచ్చి ఒక దగ్గర పెట్టగానే.. పది నిమిషాల్లో పోట్లాడుకోవడం మొదలు పెడతారు. మీరు కలిసీ ఉండలేరు, మీరు విడిగానూ ఉండలేరు. దీనినే బంధన అంటారు.

మీరు కనుక నిమగ్నతతో ఉన్నప్పుడు, మీరు కలిసి ఉంటే, ఎంతో గొప్పగా ఉంటుంది. మీరు దూరంగా ఉన్నా సరే, అది అద్భుతంగానే ఉంటుంది. ఆధ్యాత్మికత అంటేనే, తీవ్రమైన నిమగ్నత. ఎటువంటి నిమగ్నత అంటే, మీ చుట్టూరా ఉన్నదాని కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి వెనుకాడకపోవడం. ఇలా మీ చుట్టూరా ఉన్నవారి కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, అటువంటి సమయంలో బంధన గురించిన భయం మీకు ఉండదు. మీరు ఎల్లప్పుడూ మీ చుట్టూరా ఉన్నవాటితో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్నప్పుడు బంధన అనేది జరుగదు.

బుద్ధుడు ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. అది ఆయన జీవితాన్ని ఎంతగానో పరిణమింప చేసింది. మీ గురించి మీరు ఏదో ఒకటి చెయ్యాలి.  ఆయన అద్భుతంగా జీవించి వెళ్లారు. ఆయన ఎలా జీవించారు - అన్నది మనకు సమస్య కాదు. మనం ఇక్కడ ఎలా జీవిస్తున్నాం అన్నది అసలు సమస్య. మీరు ఎంత గొప్పగా జీవిస్తున్నారు..? మీ జీవితంలోని నాణ్యత ఎలా ఉంది? ఇక్కడ మనం మాట్లాడే విషయం అంతా అదే..!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు