ఈ రోజు మహర్నవమి. మన సాంప్రదాయంలో ఈ రోజున మనకు ఉపకరించే సాధనాలకు, పనిముట్లకు ఆయుధ పూజ చేయడమన్నది మన ఆనవాయతి. అయితే మన శరీరము మనసు కూడా మన సాధనాలేనని సద్గురు మనకు గుర్తుచేస్తున్నారు.

ఒకసారి ఒక వ్యక్తికి దివ్యశక్తులు సంపాదించాలన్న కోరిక కలిగింది. తగిన ఉపదేశం పొందడానికి గురువులను వెతుకుతూ ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వెళ్ళాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎలాగైతేనేం, సుదూర హిమాలయ అడవుల్లో ఎక్కడో ఒక ఆశ్రమం చేరుకున్నాడు.

అతను వచ్చిన కారణం తెలుసుకుని ఆ గురువు అతన్ని ఆ లక్ష్యం నుండి విముఖుణ్ణి చెయ్యడానికి ప్రయత్నించాడు. "ఈ శక్తులతో నువ్వేం సాధిస్తావు? నీకు నీటి మీద నడవడం తెలిస్తే నీకు వచ్చేదేముంది? మూడు రోజుల తర్వాత నీకు ఒక పడవే మెరుగనిపిస్తుంది. ఇటువంటి నిరుపయోగమైన లక్ష్యాల కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. దానికి బదులు, నీకు ధ్యానం ఎలా చేయాలో చెబుతాను." అన్నాడు. గురువు ఎన్నో ప్రయత్నాలు చేశాడు గానీ ఆ వ్యక్తి పట్టినపట్టు విడవలేదు.

చివరకి గురువు, "సరే, నువ్వంత పట్టుదలగా ఉంటే, రేపు ఉదయం నాలుగో గంటకల్లా నదిలో స్నానం చేసి నా దగ్గరకి రా. నీకు దివ్య శక్తులు సంపాదంచడానికి ఉపదేశం ఇస్తాను," అన్నాడు.

ఆ మనిషి ఎంతో ఉత్సాహభరితుడయ్యాడు. తెల్లవారు ఝామున హిమాలయ నదులు, అవి గడ్డకట్టించి మనిషి రంగు మార్చేంత చల్లగా ఉన్నాయి, అందులో స్నానం చేసి, ఎంతో ఆశతో గురువు ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు గురువు,"చూడు! ఇది చాలా సులభం. నా దగ్గర ఒక రహస్య మంత్రం ఉంది. రాబోయే 40 రోజులూ నువ్వు రోజుకి 3 సార్లు ఈ మంత్రం జపిస్తే, అన్ని దివ్యశక్తులూ నీ వశం అవుతాయి," అని అతనికి ఈ క్రింది మంత్రం ఉపదేశించాడు:

అసతోమా సద్గమయ. (అజ్ఞానంలోంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దాని అర్థం)

"ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లు క్రమం తప్పకుండా 40 రోజులు జపించావంటే అన్ని దివ్యశక్తులూ నీ వశం అవుతాయి. కానీ, ఈ మంత్రం జపిస్తున్నపుడు  కోతుల గురించి ఆలోచించకు." అన్నాడు గురువు. ఆ మనిషికి ఆ సాధన ఇంత సులభమంటే నమ్మబుద్ధి కాలేదు. "అంతేనా?" అని, "అయితే, మరి శలవా?" అని అడిగాడు. గురువు వెళ్ళడానికి అనుజ్ఞనిస్తూ, "తప్పకుండా. మళ్ళీ 40 రోజుల తర్వాత కనిపించు." అన్నాడు.

ఆ శిష్యుడు ఎంతో ఉత్సాహంతో బయటకు నడిచాడు. "నా దగ్గర ఏమీ తీసుకోకుండానే మూర్ఖుడైన గురువు నాకు తన రహస్యాలన్ని చెప్పేసాడు!" అని అనుకున్నాడు. "ఆయన నన్ను కోతుల గురించి ఆలోచించ వద్దన్నాడు. నేను కోతుల గురించి ఎందుకు ఆలోచిస్తాను. అర్థం లేదు." అనుకున్నాడు.

 మీకు మీ మనసులో ఫలానా ఆలోచన రాకూడదని చెప్పుకుంటే, సరిగ్గా మీ మనసులో ముందుగా వచ్చే ఆలోచన అదే!

అతను కొండలు దిగి, గంగా నదీ తీరానికి వచ్చాడు.  నదిలో మునకేసి తన సాధన ప్రారంభించడానికి కుచున్నాడు. కానీ అతను "అసతోమా" అని మంత్రం ప్రారంభించాడో లేదో, బుర్రలో కోతి ప్రత్యక్షమైంది. బుర్రలోకి కోతి ప్రత్యక్షమైన ప్రతిసారీ అతను గంగలో మునకేసి ఒడ్డుకి చేరేవాడు. అతను ఆ మంత్రాన్ని అనేక రకాల యోగ ముద్రలలో కూర్చుని ప్రయత్నించాడు. కానీ అతను మొదటి ముక్క అనగానే, ప్రతిసారీ కోతులు గుంపులు గుంపులుగా కళ్ళముందు కనిపించేవి. ఒక వారం సాధన పూర్తిచేసే సరికి ఇక మంత్రం అవసరం లేదు, అతని ఆలోచనల నిండా కోతులే - కోతుల పీడకలలే. ఈ  కోతుల బాధపడలేక, అతను గురువు దగ్గరికి వెళ్ళి, " నాకీ దివ్య శక్తులు అవసరం లేదు. ముందు నన్నీ కోతుల బాధనుండి తప్పించండి," అని బ్రతిమాలాడు. మీకు మీ మనసులో ఫలానా ఆలోచన రాకూడదని చెప్పుకుంటే, సరిగ్గా మీ మనసులో ముందుగా వచ్చే ఆలోచన అదే! మనిషి మనసు తత్త్వమే అంత!

ఈ మధ్య కాలంలో  మెదడు పనిచేసే తీరుతెన్నుల మీద చాలా శాస్త్రీయమైన పరిశోధనలు జరిగాయి. మెదడులో నాడీకణాలు(neurons) పరిగెత్తే తీరు గమనిస్తే, వాటి క్రియాశీలతలో చెప్పుకోతగ్గ ఐక్యత కనిపిస్తుంది. ఈ ఐక్యతే శరీరం సమర్థవంతంగా పనిచేయడం రూపంలో ప్రకటితమౌతుంది. నిజానికి, ఈ క్షణంలో మీ శరీరంలో కొన్ని కోట్ల సంక్లిష్టమైన పనులు జరుగుతున్నాయి. అది ఈ నాడీ కణాలు ఒకదానితో ఒకటి సమర్థవంతంగా అనుసంధానమై ఉండడం వల్లనే సాధ్యపడుతోంది.

కానీ, చాలామంది అనుభవంలో, మనసు ఒక సర్కస్సు అయిపోయింది. నిజానికి సర్కస్సులో పైకి గందరగోళంగా కనిపిస్తున్నట్టు చూపెట్టబడినా, అవన్నీ ఒకదానితో ఒకటి ఒక పద్ధతి ప్రకారం అనుసంధానం చెయ్యబడ్డ కార్యక్రమాలు. చివరకి సర్కస్ లో హాస్య చేష్టలు చేసే జోకరు కూడా మంచి నైపుణ్యం ఉన్నవాడే. అతను జోకరులా నటించవచ్చు, కానీ అతను  చేస్తున్న దానిలో చాల కౌశలం ఉన్నవాడు. అలానే చాలామంది మానసిక కార్యకలాపాల విషయంలో, మెదడుతో వారి అనుభవాన్ని సరిపోల్చవలసి వచ్చినపుడు ఈ సర్కసు జోకరుతో సరి పోల్చటం  సరిగ్గా సరిపోతుంది.

అంత అద్భుతమైన కౌశలం ఉన్న మెదడు ఒక్కసారిగా జోకరుగా ఎలా మారిపోయింది? అద్భుతాలకు మూలం కావలసింది గందరగోళంగా ఎలా మారింది?  అంత అద్భుతమైన సాధనం, బాధ పెట్టే యంత్రంగా ఎలా మారింది?

 మీకు మీ మనసులో ఫలానా ఆలోచన రాకూడదని చెప్పుకుంటే, సరిగ్గా మీ మనసులో ముందుగా వచ్చే ఆలోచన అదే!

ఇంతకు ముందు చెప్పినట్టు, ప్రతి మనిషి లోపలా బయటా కూడా ఆనందాన్నే కోరుకుంటున్నాడు. బాహ్య ప్రపంచం విషయానికి వచ్చేసరికి, అక్కడ పరిస్థితులు అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. వాటన్నిటి మీదా పూర్తి అదుపు ఎవరికీ ఉండదు. మీ అంతరంగంలోని విషయానికి వచ్చేసరికి , అక్కడ ఉన్నది ఒక్కటే. అది మీరే. మీరొక్కరే  మీ అంతరంగాన్ని నిర్మించుకునే శిల్పీ, సృష్టికర్తా. కానీ అది ఎలా నిర్మించుకోవాలో మీకు తెలీదు, ఇక్కడే ఉంది చిక్కంతా. మీకు దాని మీద పట్టు ఉంటే, మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకుని ఉండేవారు కాదు. అసలు మీకున్న మౌలికమైన స్వాతంత్య్రం, మీకు నచ్చినది ఊహించుకోగలగడం. అలాంటప్పుడు, మీరు మంచి ఆలోచనలు ఎందుకు ఆలోచించకూడదు?

అసలు సమస్య ఏమిటంటే: మీ మనసు మీ నుండి సూచనలు తీసుకోవడం లేదు. రాతి యుగంలో నివసించే మనిషి కంప్యూటరు కీ బోర్డు నొక్కుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకొండి. కంప్యూటర్ తెర మీద కనిపించేది ఎంత చిందర వందరగా  ఉంటుంది. యోగా అన్నది మీకూ, మీ మనసుకీ మధ్య ఉన్న అంతరాన్ని గుర్తింపజేసే సాంకేతిక ప్రక్రియ. మీకూ, శరీరమూ, మనసూ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలకీ మధ్య కొంత అంతరం ఉంది. ఇటువంటి అంతరం ఉన్నదన్న స్పృహ మీకు ఉండడమే మీ స్వాతంత్య్రానికి మొదటిమెట్టు. మీరు పోగుచేసుకున్న భౌతిక, మానసిక అనుభూతులే జీవితంలోనూ, ఆ తర్వాత కూడా మీకు వలయాలను సృష్టిస్తాయి. మీరు నిరంతరం మీకూ, మీ శరీరం-మనసులకీ మధ్యనున్న ఎడం గురించిన ఎరుకతో ఉండగలిగితే, మీరు అంతులేని అవకాశాలు కలిగించే ఒక కొత్త ప్రమాణానికి తెర తీసినట్టే.

ఈ ప్రపంచంలో రెండే రకాల బాధలున్నాయి: శారీరకమూ- మానసికమూ. పైన చెప్పిన ఎడం మీ అనుభవంలో చెదరని ఆంశం అయినప్పుడు, మీరు బాధల ముగింపుకి చేరుకున్నట్టే. బాధల గురించి భయం ఎప్పుడు పోతుందో, మీరు జీవితాన్ని చకచకా అడుగులేసుకుంటూ, జీవితంలో ఏముందో పరీక్షించడానికి నిర్భయంగా ముందుకి అడుగెయ్యగలరు. మీరు ఆ రెండింటికీ బయట ఉండగలిగినపుడు, అత్యంత సున్నితమైన శరీరం-మనసుల అద్భుత కలయికని వాడుకోగలిగిన సమర్థతని పూర్తిగా ఒక ఉన్నతమైన ప్రమాణానికి తీసుకుపోగలరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pixabay