మీ గతమూ, మీ వర్తమానమూ, మీ భవిష్యత్తూ మీ శరీరం మీదంతా రాయబడి ఉన్నాయి!

ఒక విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి శరీరానికి గానీ, మనసుకు గానీ, భావోద్వేగాలకు గానీ, జీవ శక్తికి గానీ సంభవించిన వివిధ విషయాల తాలూకూ అవశిష్టమైన ‘వాసన’లు లేక జ్ఞాపకాలే (Residual memory) ఆ వ్యక్తి ‘కర్మ’ అని చెప్పచ్చు. వివిధ సందర్భాలలో ఏర్పడిన పరిస్థితుల గురించిన ‘వాసనలు’, జ్ఞాపకాల మిగులు భాగం కర్మ.

అసలు ‘మీరు’ అనబడే దాన్లో అధికాంశమైన భాగం, ఒక వ్యక్తిగా మీరు జీవించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కాలంగా జీవిస్తూ వస్తున్నది. అంటే మనం అంటున్నది పునర్జన్మ గురించో, జన్మాంతరాల గురించో అనుకోకండి! మీరు ఆధునిక పరిభాషలో ‘జన్యు శాస్త్రం’ (genetics) అంటున్నారే, దాన్ని అనుసరించి వెళ్ళేట్టయితే, మీ పూర్వీకులు నేటికీ మీ ద్వారా ‘సజీవం’గా ఉన్నారు అనటంలో సందేహం ఉండదు. వాళ్ళకంటే మీరొక భిన్నమైన ప్రత్యేక వ్యక్తి అనుకోవటం కేవలం మీ నమ్మిక.

చాలామందిలో ఓ విచిత్రం కనిపిస్తుంది. 40-45 సంవత్సరాల వయసు దాటగానే వాళ్ళు చాలావరకూ వాళ్ళ తల్లి తండ్రులలాగే ప్రవర్తించటం ఆరంభిస్తారు. వాళ్లు ప్రయత్నపూర్వకంగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని ఉంటే తప్ప. మీ తల్లిదండ్రులు వాళ్ళకు అనుకూలమైన పద్ధతిని వాళ్ళు అవలంబించారు. మీరూ ఆ పద్ధతినే అనుసరించటానికి కారణమేమిటి?

కర్మ అంటే కేవలం మీరు పూర్వం చేసిన పనులూ, చేయని పనులూ అని కాదు. అది అవశిష్ట జ్ఞాపకం, 'వాసన'. ఈ కర్మలకు ఆరంభం, సృష్టి మొదలయినప్పుడే జరుగుతుంది. మీరు సరైన జ్ఞానంతో సరైన సచేతనత్వం(consciousness)తో, మీ శరీరపు పొరలన్నీ ఛేదించుకొంటూ వెళితే , పోయి పోయి సృష్ట్యాదిని కూడా చూడవచ్చు. అప్పటినుంచి జరిగిన ప్రతి విషయమూ, ప్రతి దానిలోనూ నమోదయ్యే ఉంటుంది, ముఖ్యంగా, మానవ వ్యవస్థ(human system)లో తప్పకుండా ముద్రితమై ఉంటుంది. ఇది అనుభవంతో మాకు తెలిసిన విషయం.

ఈ రోజు విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఎంత వరకూ అంటే, ఈ నాటి శాస్త్రజ్ఞులు ఒక 'సికోయా' (Sequoia) మహావృక్షాన్ని ఒక పద్ధతి ప్రకారం కోసి చూసి, గత 3000 సంవత్సరాల కాలంలో జరిగిన విశేషాలనెన్నింటినో, పుస్తకం చదివినట్టు చెప్పగలరు - వానలెలా కురిశాయి, ఉష్ణోగ్రతలెలా ఉంటూ వచ్చాయి, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి, ఎలాంటి ప్రాకృతిక విపత్తులు వాటిల్లాయి, ఇలాంటివెన్నో చెప్పగలరు. ఇది కూడా ఎవరో సాముద్రికుడు మీ చేయి చూసి మీ భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ చెప్పటం లాంటిదే. ఇలాంటి అధ్యయనం ఎన్నో విషయాలను గురించి ఎన్నో విధాలైన ఆధారాలను అందించగలదు.

నేనిప్పుడు మీ చేయి చూసి మీ జీవితంలో ఏమేమి జరిగాయో, ఏమేమి జరగబోతున్నాయో చెప్పగలను. అదంతా మీ చేతులో కనిపించేస్తుందా? ఒక్క చేతిలోనే అన్న మాటేమిటి, అది మీ శరీరం మీదంతా రాయబడే ఉంటుంది! నేను మీ శరీరంలో ఏ భాగాన్ని పరీక్షించయినా, మీ గతాన్నీ, మీ భవిష్యత్తునూ చెప్పగలను. అయితే, కొన్ని శరీరభాగాల ద్వారానయితే, ఈ సూచనలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. మీ చెవి దొప్ప వెనక భాగం జాగ్రత్తగా పరిశీలిస్తే, మీగురించి దాదాపు అన్ని విషయాలూ చెప్పేయగలను! ఇదేదో ఛలోక్తి అనుకొంటున్నారేమో, కాదు!

నేను ప్రాముఖ్యత గల ప్రదేశాల కెక్కడికయినా వెళ్లినప్పుడు, అక్కడి 'టూరిస్ట్ గైడు'నో మరొకరినో ఆ ప్రదేశంలో జరిగిన చారిత్రిక విశేషాల గురించి అడగను. చిరకాలంగా ఎలాంటి చలనమూ, మార్పూ లేకుండా పడి ఉన్న ఒక కొండరాయిని వెతుక్కొని, దాని'తో' కూర్చొంటాను. ఇక ఆ ప్రాంతం గురించి నాకు అంతా తెలిసిపోయినట్టే. ఎందుకంటే, ఆ రాయికి కూడా తన చుట్టూ జరిగిన పూర్వ సంఘటనలన్నింటిని గురించిన స్మృతులూ, 'వాసనలూ' ఉంటాయి.

ఈ భూగ్రహం మీద ఉన్న విభిన్న వస్తువులన్నీ, విభిన్నమైన ప్రకంపనలను ప్రసరిస్తూ ఉంటాయి. భూగ్రహం ఏ స్థానంలో ఉన్నది అన్న దాన్ని బట్టి ఈ ప్రకంపనలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ శాస్రజ్ఞులు కొలతలు వేయగలిగారు. కానీ, వీటి వెనక ఉన్న చరిత్రలను మాత్రం వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. ప్రతి కొండ రాయీ, ప్రతి గులక రాయీ కొంత సమాచారాన్ని తెలుపుతున్నది. ఆ విషయం ఆధునిక శాస్త్రజ్ఞులకు yతెలుస్తూనే ఉన్నది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ సమాచారం ఎవరికయినా అర్థమయ్యే విధంగా అవి చెప్పగలుగుతున్నాయా అని. దానికి తోడు, అవి చెప్పే సమాచారాన్ని అర్థం చేసుకొనే గ్రహణ శక్తి మనకు ఉందా అని కూడా. అవతలి వాళ్ళు చెప్పేది మనకు బోధ పడాలంటే, మనకు వాళ్ళు మాట్లాడుతున్న భాష తెలిసి ఉండాలి. మనం ఆ భాషకు స్పందించగలిగి ఉండాలి. లేకపోతే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేం. అవి ఎన్నెన్నో విషయాలు చెప్తున్నాయి గానీ వాటిని విని అర్థం చేసుకోగల వాళ్లు లేరు.

మీ శరీరం ఈ బ్రహ్మాండానికి సూక్ష్మ రూపం

మీ చుట్టూ వున్న సృష్టితో, బ్రహ్మాండంతో, ‘జీవం’తో మీరు సరయిన సహానుభూతి చూపగలిగిన (sensitive) వారయితే, అవి చెప్పేదేమిటో మీరు గ్రహించచ్చు. అంతకంటే ముఖ్యం మరొకటి ఉంది. మీరు 'నేను' అని భావించుకొనేదేదో ఉన్నదే, దాని స్థితిగతులు సృష్ట్యాది నుంచి ఇప్పటివరకు ఎలా సాగాయో ఆ సమాచారమంతా మీ భౌతిక శరీరం లోనే ఇమిడి ఉంది, దాన్ని రాబట్టుకోగల విషయ గ్రహణ శక్తి మీకుంటే ఆ విషయమంతా గ్రహించచ్చు! మీ శరీరం అంటే ఈ బ్రహ్మాండానికి సూక్ష్మ రూపమే తప్ప మరొకటి కాదు. అందుకే దీన్ని పిండాండం (microcosm) అంటాం. బ్రహ్మాండం- macrocosm- అంటే ఈ పిండాండ రూపాన్ని ఎన్నోవేల కోట్ల రెట్లు పెంపుచేసిన రూపం. అంతే తేడా. బ్రహ్మాండంలో జరిగినదంతా, ఈ సూక్ష్మ రూపంలోనూ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది.

ఇంకా జరుగుతూనే ఉన్నది అని చెప్పటం ఎందుకంటే, సృష్టి అనేది ఒక సారి జరిగి అంతటితో ఆగిపోయి అలాగే అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయి ఉన్న ప్రక్రియ అనీ, అది అసలు ఆరేడు రోజులలోనే పూర్తి అయిపోయిన ప్రక్రియ అనీ భావించడం అపరిపక్వ మైన భావన. సృష్టి పూర్వకాలంలో ఎప్పుడో ఒక్కసారిగా జరిగి అంతటితో అలా ఆగి పోయే విషయం కాదు. ఎప్పుడూ జరుగుతూనే ఉండేది. అసలు, ‘కాలం’ అనేదే ఒక అపరిపక్వమైన భావన. 'పది లక్షల సంవత్సరాల క్రితం' అంటూ ఏమీ లేదు. సృష్టి యావత్తునూ సన్నిహితంగా, నిశితంగా పరిశీలించే వాడికి, అంతా 'ఇప్పుడే', 'ఇక్కడే' !

మరి ఆ ‘ఇక్కడ’ అనేది ఎక్కడుంది? ఇప్పుడు మీరు కూర్చొన్న ప్రదేశంలోనే ఉందా? లేదు! అది మీలోపల అంతర్గతంగా ఉంది. మీ అనుభూతులకూ అనుభవాలకూ జ్ఞానానికీ అన్నిటికీ ఆశ్రయం అదే. ఈ జగత్తంతటిలో అదొక్కటే మీకు యథాతథంగా ఆవిష్కృతం చెయ్యబడింది. అది తప్ప ఈ జగత్తులో ఏదీ మీకు దాని యథార్థ స్వరూపంతో సాక్షాత్కరించదు. మన కళ్ళముందు దృశ్యమానమవుతున్న పదార్థాలూ విషయాలూ వాటి అసలు స్వరూపాలలో గోచరించవు. ఎంతో కృషి చేస్తే తప్ప, వాటి యథార్థ స్వరూపాలను తెలుసుకోలేము.

కాబట్టి కర్మ అనేది ఒక మామూలు చిన్న పదం కాదు. ‘ఇది నువ్వు చేసిన కర్మ!’ అంటే చాలా పెద్ద అర్థం ఉంది. సృష్ట్యాదిలో జరిగిన మహా విస్ఫోటం కూడా నువ్వు చేసుకొన్న కర్మలో భాగమే! అసలు సృష్టి ఆరంభించటం కూడా నీ వల్ల జరిగిన కర్మే! అది కూడా నీ లోపలే ఉన్నది. అన్నీ మీరు ‘చైతన్యం’ (consciousness) అని ప్రస్తావించే దానిలో జరిగినవే. ఆ చైతన్యం మీకు పరాయిది కాదు, బాహ్యమైంది కాదు, విజాతీయమైంది కాదు. ‘మీరు’ అన్న ఉనికికే అది ఆధారం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

కాబట్టి ఈ సృష్టి ఆరంభం మీ లోపలే ఆంతరికంగా ఉన్నది!