చెడ్డ విషయాలు ఎవరికీ జరగవు. కొన్ని విషయాలు జరుగుతాయి. మీకు కనుక అది నచ్చకపోతే, అది చెడ్డది అని మీరనుకుంటారు. ఒకవేళ ఇవాళ మీ పెళ్లి రోజనుకోండి, మీరు అలా ఊరేగింపుగా వీధిలో వెళ్ళాలి.. కానీ, ఒక పెద్ద వాన ఉరుములతో వస్తోంది. అప్పుడు మీకు అది మంచి విషయం కాదు. కానీ, మరెవరో ఇదే వాన కోసం ప్రార్ధిస్తున్నారనుకోండి, వారు వానపడడంతో ఎంతో ఆనందంగా ఉంటారు. మీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు అన్నదే మంచి చెడులని నిర్ణయిస్తాయి, అవునా? మీరు భగవంతుడిని నమ్ముతారు కదూ..? మీరు భగవంతుడిని నమ్మితే, ఆయన చేసేవన్నీ కూడా సరిగ్గానే ఉండి ఉండాలి. సరైనది కాకపోతే, మనం ఆయనని ఆ స్థానంలో ఉంచకూడదు. ఆయనని తీసేయాలి.

మనం, మన మోసాల్లో ఎంతగా పెట్టుబడులు పెట్టేశామంటే మనకి అందులోనుంచి బయటికి దారి కనబడడం లేదు. ఇవాళ మీ డాక్టరు, “మీకు జీవించడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉన్నాయి” అంటే, మీకు ఎంతో విచారం కలుగుతుంది. “ఇది భగవంతుడి నిర్ణయం, ఎంత అద్భుతమైన విషయం. నేను ఆయన దగ్గరకి వెళ్లిపోతున్నాను” అని మీరు ఆనందంగా వెళ్తారా..? లేదు. మీరు ఎక్కడో ఇవన్నీ మీ మాయలో కలిపేసుకున్నారు.

ఆస్తికులకీ-నాస్తికులకీ మధ్య ఉన్న తేడా ఇదే. ఒక మనిషి, అది నిజం అని నమ్ముతున్నాడు.. మరొకమనిషి, అది అబద్ధం అని నమ్ముతున్నాడు.

మొట్ట మొదటి విషయం ఏమిటంటే, కనీసం మీతో మీరైనా తిన్నగా ఉండాలి. బహుశా మీరు ప్రపంచంలో అందరితోనూ తిన్నగా ఉండలేకపోవచ్చు. కానీ, కనీసం మీతో మీరు నూటికి నూరు శాతం తిన్నగా ఉండాలి. ఇప్పుడు మీరు పూర్వజన్మ అని మాట్లాడారు. ఎవరో చెప్పిన విషయాన్ని మీరు ఎందుకు నమ్ముతున్నారు..? ఆ వ్యక్తికి తెలుసని మీకు ఎలా తెలుస్తుంది..? మీకు తెలియదు. నేనిప్పుడు నా గత జన్మల గురించి మాట్లాడాననుకోండి, అది నాకు నూటికి నూరు శాతం సత్యమే అవ్వచ్చు, కానీ మీకు సంబంధించినంతవరకూ అది ఒక కథ మాత్రమే..!

నేను మీకు ఒక కథ చెప్పాననుకోండి, మీకు రెండు ఎంపికలుంటాయి.. అయితే దానిని నమ్మాలి లేదా నమ్మకుండా పోవాలి. ఒకవేళ మీరు నన్ను నమ్మారనుకోండి, దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. ఒకవేళ మీరు నన్ను నమ్మకపోయినా సరే, మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. మీ అనుభవంలో లేనిది మీరు నమ్మడం, అంటే మీకు మీరు అబద్ధం చెప్పుకుంటున్నట్లే..! ఒక విషయం ఏమిటంటే; మీరు నమ్మితే అది ఒక మంచి కథ లాగా మరొకరికి చెప్పవచ్చు. మీరు నమ్మలేదనుకోండి, మీ జీవితం ఎడారిలా ఉంటుంది. ఆస్తికులకీ-నాస్తికులకీ మధ్య ఉన్న తేడా ఇదే. ఒక మనిషి, అది నిజం అని నమ్ముతున్నాడు.. మరొకమనిషి, అది అబద్ధం అని నమ్ముతున్నాడు. ఇద్దరూ కూడా దేనినో ఒక దానిని నమ్ముతున్నారు.

మీరు భగవంతుడు ఉన్నాడూ అని నమ్మితే అది మీరు సృష్టించుకుంటున్న చెత్త. మీరు భగవంతుడు లేడు అని నమ్మినా సరే, అదీ మీరు సృష్టించుకున్న చెత్తే..! వాస్తవానికి; మీకు నిజంగా తెలియదు. మీకు తెలియనిదానిని నాకు తెలియదు అని చూడగలిగితే, తెలుసుకోవాలి అన్న కాంక్ష మీలో మొదలౌతుంది. ఈ కాంక్ష వచ్చినప్పుడు; దేనినైనా తెలుసుకోవడం సహజంగానే జరుగుతుంది. మీకు తెలియనిదానిని “నాకు తెలియదు” అని చూడగలినప్పుడు, మీ స్వభావం ఎలాంటిదంటే మీరు నాకు తెలియదు అన్న దానితో ఎల్లప్పటికీ జీవించలేరు. మీరు అదేంటో తెలుసుకోవాలనుకుంటారు. మీలో ఏముందో దానిని అనుభూతి చెందడానికి మీకు ఎంత సమయం పడుతుంది..? 12 సంవత్సరాలా..? యుగాలా..? మీరు గనుక సుముఖంగా వుంటే; కేవలం ఒక్క క్షణం.. అంతే..! కానీ; మీరు సుముఖంగా లేరు. ఎందుకంటే, మీరు ఈ నమ్మక వ్యవస్థలో ఎంతో పెట్టుబడి పెట్టారు.

మీరు పుట్టిన క్షణం నుంచి ఇప్పటివరకూ మీకు ఎటువంటి తల్లిదండ్రులు ఉన్నారు..మీకు ఎటువంటి కుటుంబం ఉంది. ఎటువంటి విద్యా బోధన, ఎటువంటి స్నేహితులు,ఇట్లాంటి విషయాలూ, మీరు చేసిన విషయాలన్నీ కూడా మీరు ప్రస్తుతం ఎవరు..అన్నదానిని నిర్ణయిస్తుంది. అవును.. మీరు ఆలోచించే విధానం, మీరు స్పందించే విధానం, మీరు అర్థం చేసుకునే విధానం - ఇవన్నీ కూడా మీ గతం మీద ఆధారపడి ఉంటాయి. మనం దీనిని కర్మ అని అంటున్నాం. ఇప్పటి వరకూ మీరు చేసినదంతా కూడా మీ కర్మ. మీ మనసు ప్రకారం, మీ ఆలోచనల ప్రకారం, మీ అనుభూతుల ప్రకారం వీటి ప్రకారంగానే మీరు జీవితాన్ని అనుభూతి చెందుతారు. మరి కర్మ ఈ పరిమితులను దాటి వెళ్తుందా అంటే.. వెళ్తుంది.. ఖచ్చితంగా వెళ్తుంది. అందులో ప్రశ్నే లేదు.. కానీ మీరు దానిని నమ్మకూడదు. నేను చెప్పేదానిని మీరు నమ్మకూడదు. మీలో మీరు తరచి చూసుకోండి.. ఏది సత్యం..? ఏది అసత్యం..? - అని.

మీరు కనుక ప్రయాణం చెయ్యాలనుకుంటే మీరు ఉన్న చోటు నుంచి మొదలు పెట్టాలి. మీ గమ్యం పక్కన వీధి అయినా లేదా చంద్ర మండలమైనా సరే, మీరు మీ ప్రయాణాన్ని మీరు కూర్చున్న చోటు నుంచి మాత్రమే మొదలు పెట్టగలరు. మీరు కనుక నిజంగా ఈ ప్రయాణం చెయ్యాలనుకుంటే.. మొట్టమొదటిగా మీరు చూడవలసినది “నాకు తెలియదు.. నాకేదీ తెలియదు.. నాకు అది తెలియదు” అని. అప్పుడు మీరు తెలుసుకోవాలన్న ఆకాంక్ష తో తరువాతి అడుగు.. ఆ తరువాతి అడుగు.. ఆ తరువాతి అడుగు వేస్తే తెలుసుకోగలరు. ఈ విధంగానే మీరు మరో చోటుకి వెళ్లగలరు. లేదంటే మీరు కేవలం ఊహాగానాల్లో మిగిలిపోతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు