స్వాతంత్ర్య పోరాట సమయంలో మనం అనేక మంది నాయకులని చూశాం. అయితే, అప్పట్లో ఈ నాయకత్వం ఇప్పటి నాయకత్వం కంటే ఎంతో విభిన్నమైనది. ప్రజలు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన కాలం అది. అప్పట్లో కనీ వినీ ఎరుగని రీతిలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన మహాత్మా గాంధీనే ఉదాహరణగా తీసుకోండి. ఓ దేశాన్ని నిలువరించగల సత్తా ఆయనలోనే కనిపించింది. అప్పట్లో జరిగిన సత్యాగ్రహ లక్ష్యమంతా ఓ దేశాన్ని ఎలా ఆపడమన్నదే. ఆయన దేశాన్ని నిలువరించడం ద్వారా బ్రిటిష్‌వారిని మోకరిల్లేటట్టు చేశారు. ఈ బంద్‌లు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు అప్పటి నుంచీ వస్తూనే –ఉన్నాయి. అయితే, మనం ఇప్పటికీ ఆ అలవాటు నుంచి బయటపడలేక పోతున్నాం.

ఈ దేశంలో మీరు నాయకుడు కాదలచుకుంటే, ఓ 25 మందిని కూడగట్టుకుని రేపు ఓ రోడ్డు మీద బైఠాయించండి. అలా రోడ్డు మీద కూర్చుని, దేన్నీ అటూ ఇటూ వెళ్లనివ్వవద్దు. ఓ రెండు రోజుల పాటు ప్రజల్ని నానా అవస్థలూ పెట్టండి. మూడో రోజయ్యే సరికి మీరో గొప్ప నాయకుడైపోతారు. ఈ మాత్రం చేస్తే సరిపోతుంది. రోడ్డు మీద బైఠాయించి, రాకపోకల్ని స్తంభింపజేయడం ద్వారా చాలా మంది రాత్రికి రాత్రి నాయకులై పోవడాన్ని నేనే అనేక సందర్భాల్లో స్వయంగా, కళ్లారా చూశాను. వాళ్ళు చేసిందల్లా కొన్ని  చెట్లను నరికి రోడ్డు మీద పడేయడమే.

ఇప్పుడు కూడా ఆందోళనకారులే నాయకులవుతున్నారు. ఈ ఆందోళనకారులే పాలకులు అవుతున్నారు.
విదేశీయుల దురాక్రమణ ఏనాడో పోయింది. ఇప్పుడిది మన సొంత దేశం. కానీ, ఇప్పటికీ మనం బంద్‌లు చేయాలనుకుంటున్నాం. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వ, పాలనా యంత్రాంగమే బంద్ కోసం పిలుపు నిస్తుంది. ఇది తమ హక్కగా అది భావిస్తుంటుంది. ఒక్క ఈ దేశంలో మాత్రమే ప్రభుత్వం కూడా బంద్ పిలుపునిస్తోంది. దేశాన్ని మూసేయించడం తమ ప్రాథమిక హక్కగా వాదిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఈ దేశాన్ని మరెవరో పాలిస్తున్నప్పుడు దీన్ని ఆపడంలో అర్థం ఉంది.

విదేశీ శక్తులు వెళ్ళిపోయిన తరువాత మీరు దేశాన్ని ముందుకు వెళ్లేలా చేయాలి. సత్యాగ్రహమంటే దేశాన్ని నిలువరించేలా చేయడం. ఇప్పుడు దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలా అన్నది ఆలోచించాలి. అయితే, ఈ దేశానికి పట్టిన దుర్గతి ఏమిటంటే, సత్యాగ్రహం అన్నది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆందోళనకారులే నాయకులవుతున్నారు. ఈ ఆందోళనకారులే పాలకులు అవుతున్నారు. తాము చేయాల్సిందేమిటో వాళ్లకు అర్థం కావడం లేదు. దేశాన్ని ముందుకు నడిపించడం ఒక రకమైన నైపుణ్యం, దేశాన్ని ముందుకు పోకుండా ఆపడం మరో రకమైన నైపుణ్యం. చాలామంది నాయకులకి తాము పాలించాల్సిన  ప్రజల పట్ల ఏమాత్రం చింతలేదు.

 మీ తీరును మీరు మార్చలేకపోయినప్పుడు, మీరు తయారు చేసే నాయకుడు కూడా మీ లాగే ఉంటాడు.
పరిస్థితి చేయిదాటి పోయిందనా దీనర్థం? లేదు. ఇదొక ప్రజాస్వామ్య దేశం. మనం  తలచుకుంటే వాళ్లను అయిదేళ్లలో పక్కన పడేయొచ్చు. అటువంటిదే జరగాలి. కానీ, దురదృష్టవశాత్తూ దేశం ఆ దిశలో ప్రయాణించడం లేదు. రాజకీయ వ్యవస్థ గురించి ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ, సరిచేసేందుకు కనీస బాధ్యతను తలకెత్తుకోరు. అవసరమైనప్పుడు అడుగు బయటపెట్టి ఓటు కూడా వేయరు. ఈ చిన్న పని చేసి కూడా వారు తమ ఆందోళనను బయటికి వ్యక్తం చేయరు. మీ తీరును మీరు మార్చలేకపోయినప్పుడు, మీరు తయారు చేసే నాయకుడు కూడా మీ లాగే ఉంటాడు. మరో విధంగా ఉంటాడని ఆశించకూడదు. దేశాన్ని వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తున్న వారిని నేనేమీ వెలివేసే ప్రయత్నం చేయడం లేదు. నేను చెప్పదలుచుకున్న దేమిటంటే, మీరు సాగుచేస్తున్న భూమి పరిస్థితిని మీరు మార్చలేకపోయినప్పుడు, మీకు బ్రహ్మాండమైన పంట చేతికి వస్తుందని అనుకోలేం. మీరు చెట్టు మీద ఉన్న పండునే చూస్తున్నారు. కానీ, చెట్టు బలం, దాని పండు, పండు నాణ్యత, వంటివి మొక్క నాటిన భూమి మీద ఆధారపడి ఉంటాయి. అవునా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు