అసలైన శ్రేయస్సుకై ప్రయత్నించండి!

 
 

ఈ భూమి పై మనిషి శ్రేయస్సు కోసం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖ్యంగా గత వంద సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది. దీని వల్ల మనకు ఖచ్చితంగా ఎంతో సౌఖ్యమూ, సౌలభ్యమూ ఏర్పడ్డాయి. మన ముందు తరాల వారు  ఇటువంటి సుఖమయ జీవితాన్ని కనీసం 'కల' కూడా కని ఉండరు. కాని, వీటివల్ల మానవాళి మెరుగుపడిందా?

మీరు ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమదేశాలను, ఉదాహరణకు అమెరికాను చూసినట్లయితే, నలభై శాతం మంది ప్రజలు తమ మానసిక సమతుల్యత కోసం మందులపై ఆధారపడి ఉన్నారు. ఇది శ్రేయస్సు కాదు. మానవాళి ఎందుకు బాగాలేదు అంటే మనం బాహ్యం గురించిన జాగ్రత్తలు తీసుకున్నాము కాని అంతర్గతక్షేమాన్నిఎప్పుడూపట్టించుకోలేదు.  నిజమయిన మానవ శ్రేయస్సు ఒక వ్యక్తి తనలో తాను ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడే కలుగుతుంది. మీలో మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉండాలో మీకు తెలియనప్పుడు, మీరు ఉండే ఇల్లు, నడిపే కారు, వేసుకునే బట్టలు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, వీటి కోసం మీరు చేసిన కృషి, ఇవన్నీవ్యర్ధం అవుతాయి. మీరు మీ స్వతాహాగా ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలిగినప్పుడే, మీ జీవితాన్ని భయమూ, ఆందోళనా లేకుండా గడప గలుగుతారు. "నాకేమి అవుతుందో" అన్న భయం మీలో ఉన్నంతవరకూ, మీరు కేవలం సగం అడుగులు మాత్రమే వేస్తారు. పూర్తి అడుగులు ఎప్పుడూ వేయరు. కాబట్టి, మనిషి తన పూర్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నప్పుడు, మొదట తనలో ప్రశాంతతా, ఆనందంతో కూడిన అంతర్గత స్థిరత్వం కలిగి ఉండాలి. అప్పుడే తను జీవితపు అవకాశాలను అన్వేషించి అందుకోగలుగుతాడు. లేకపోతే, అతని ఆనందం యాధృచ్చికం కావడం వల్ల, అతను జీవితం గురించి ఒక పెద్ద సందిగ్ధస్థితిలో ఉంటాడు.

మీరు ఎవరయినా, ఎంతటి శక్తిశాలురైనా, బయటి పరిస్థితులు ఎల్లవేళలా 100% మీ అదుపులో ఉండవు. ఎందుకంటే అవి కోట్ల ఆటంకాలను కలిగి ఉంటాయి. వాటిలో చాలావరకు మీకు తెలియను కూడా తెలియవు. మీకు తెలిసిన కొన్నింటినే మీరు నియంత్రించే ప్రయత్నం చేస్తారు, కాని మిగితావి మీకు అర్థం కూడా కావు. అలాంటప్పుడు నియంత్రించే ప్రసక్తే ఉండదు. అవన్నీ మీకు అనువుగా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు అంతే. కాని, మీ అంతర్గత  విషయాలకు వచ్చేసరికి మీరు ఒక్కరే ఉంటారు. కనీసం అవైనా మీరనుకున్న తీరులో జరిగితీరాలి. లేదంటే మీరు దారి తప్పారని అర్ధం.

అంతా ఇందువల్లే, అంటే వారి అంతర్గతం వారి ఆధీనంలో లేకపోవడం వల్లే, ఒత్తిడికి గురై, పూర్తిగా అలసిపోతుంటారు. మీ పనిని బట్టి మీరు ఒత్తిడికి గురికారు. మీ వ్యవస్థను మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల ఒత్తిడి జనిస్తుంది. మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత కావాలనుకుంటే, మీ చుట్టూ ఉన్నజీవితంలో అదే నాణ్యత ఉండాలనుకుంటే, మీలోని అంతర్గత పరిస్థితులను స్థిరపరుచుకుని, మీ మనస్సు, మీ భావాలు, మీ వ్యవస్థ బాహ్యజీవితపు ఒడిదుడుకులను అనుసరించకుండా స్థిరంగా ఉండేలా చేయాలిసి ఉంటుంది. మీలో అంతర్గత ఒడిదుడుకులూ, సమస్యలు లేనప్పుడు మీరు బాహ్య సవాళ్ళను సమర్థవంతంగా ఎదురుకోగలరు.

మరి అలాంటి అంతర్గత పరిస్థితిని ఏర్పరుచుకునే మార్గమేదయినా ఉందా? ఉంది. బాహ్యపరిస్థితులను మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతికపరిజ్ఞానం వున్న విధంగానే, అంతర్గత పరిస్థితులనూ మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ప్రపంచాన్నిమనకు అనువుగా నిర్మించుకున్నవిధంగానే, మన అంతర్గతాన్ని కూడా మనం మనకు కావలిసిన విధంగా నిర్మించుకోగలం. కాబట్టి, మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత మెరుగు పడాలి అనుకుంటే, ఆ దిశగా అడుగులు వేయాలి. మీ అంతర్గత శ్రేయస్సుకోసం మీ సమయాన్నికొంత వెచ్చించడానికి సిద్ధపడాలి. ఇది జరిగితే, మీరు పనిచేసే విధానంలో అసాధారణ మార్పు గమనిస్తారు. ఇందుకు కావలసిన పరిజ్ఞానం ఉంది. దీన్నే నేను "ఇన్నర్ ఇంజనీరింగ్ (అంతర్గత నిర్మాణం)" అంటాను. దీని ద్వారా అత్యున్నతమైన శ్రేయస్సును పొందవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం గురించిన వివరాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు:

http://www.ishayoga.org/

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1