అన్నిటికీ అతీతంగా..
చిన్నప్పటి నుండి మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మన మీద ఎన్నో రకాల ముద్రలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని అణచివేసేవిగా, మరికొన్ని బాధకి గురిచేసేవిగా, ఇంకా ఎన్నో రకాలుగా ఉండవచ్చు. ఈ ముద్రలకి అతీతంగా ఉంటూ ఆనందంగా ఉండగలిగే అవకాశం మనకు ఉందా?
 
 

చిన్నప్పటి నుండి మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మన మీద ఎన్నో రకాల ముద్రలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని అణచివేసేవిగా, మరికొన్ని బాధకి గురిచేసేవిగా, ఇంకా ఎన్నో రకాలుగా ఉండవచ్చు.  ఈ ముద్రలకి అతీతంగా ఉంటూ ఆనందంగా ఉండగలిగే అవకాశం మనకు ఉందా?  ఈ ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకోవాలంటే  ఈ వ్యాసం చదవండి.


చిన్నపిల్లవాడిగా ఉన్నప్పడు మీరు ఆనందంగా ఉన్నారు. అప్పుడు మీరు ఆనందంగా ఉండేవారు, అందులో ప్రశ్నే లేదు. మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా, కొన్ని విషయాలు, కొన్ని అభిప్రాయాలు, చర్యలు, పరిస్థితులు మిమ్మల్ని అణచి వేసేవి. చిన్నపిల్లలు స్వభావ రీత్యా ఆనందమయ జీవశక్తితో ఉల్లాసంగా ఉంటారు. అయినప్పటికీ వారిలో కూడా ఒక విధమైన అసహాయత ఉంటుంది.

ప్రస్తుతం పెద్దవారైన మీతో పోలిస్తే, వారు ఎంతో ఎక్కువగా ఇతరుల ఇష్టా అయిష్టాలకు అనుగుణంగా ఉండవలిసి ఉంటుంది. శారీరకంగా అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు, నొప్పిని భరించలేక, బాధని భరించలేక వాడిని వాడే బాధలోకి నెట్టుకోవచ్చు, అది వేరు. కానీ చాలా మంది ఆరోగ్యవంతులైన పిల్లలు కూడా ఇప్పుడు దుఃఖంతో ఉంటున్నారు. పిల్లల స్వభావం వల్ల ఇలా జరగడం లేదు. జీవితపు ప్రాధమిక దశలో వారి మీదపడే ముద్రలు వల్ల ఇలా అవుతోంది. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని అణిచివేసే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆ వాతావరణం మీ మీద అటువంటి ముద్రలనే వదిలిపెడుతుంది.

మనుషులలో వారిని బాధకు గురిచేసే ఇతర రకాల ముద్రలు కూడా ఉంటాయి. ఆ ముద్రలు ఆ వ్యక్తిని 'అసలైన జీవితం ఇది కాదు' అని తెలుసుకునే విధంగా బాధల్లోకి నెడుతుండవచ్చు. కానీ, మిమ్మల్ని అలా నెట్టే బాహ్య పరిస్దితులు లేదా అంతర్గత ముద్రలతో సంబంధం లేకుండా, ఎప్పుడైనా మీరు ఎలా ఉండాలన్నది మీరే ఎంపిక చేసుకునే అవకాశం మీకు  ఉంటుంది.

మీరు తగినంత స్పృహతో ఉంటే, ఈ ముద్రలకి అతీతంగా ఉంటూ ఆనందంగా ఉండగలిగే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆ ముద్రలన్నీ కూడా బయట నుండే వస్తాయి కానీ, మీ ఆనందం కాదు. భావనాభిప్రాయాల ముద్రలు పడతాయి, తొలిగిపోతాయి, కానీ ఆనందం వచ్చి వెళ్ళదు. అది మీలోనే ఉన్న జీవ మూలం.

భావనాభిప్రాయాల ముద్రలు పడుతాయి, తొలిగిపోతాయి. కానీ, ఆనందం వచ్చి వెళ్ళదు. అది మీలోనే ఉన్న జీవన్మూలం.

ఒకే ఒక్క విషయం ఏమిటంటే మీరు ఆ ఆనందాన్ని వ్యక్తం కానిస్తారా, లేదా? అదే అసలు విషయం. ఈ ప్రపంచంలో ఆనందం లేని వ్యక్తి ఎవరూ ఉండరు అని నేను అన్నప్పుడు, దాని అర్ధం ఏమిటంటే ప్రపంచంలో ఆనందం లేని ముఖాలు ఉండవచ్చు, ఆనందం లేని శరీరాలు ఉండవచ్చు ఆనందం లేని మనసులు ఉండవచ్చు, కానీ ఆనందం లేని వ్యక్తులు ఉండరు అని. ప్రతి జీవి ఒక ఆనందమయ జీవే.

మీరు కేవలం మీ శారీరిక ప్రక్రియలలో, మీ మానసిక ప్రక్రియలలో లేదా మీ భావోద్వేగ ప్రక్రియలో చిక్కుకుపోయినట్లయితే, అప్పుడు మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోక పోవటానికి లేదా బాధ పెట్టుకోవటానికి కోటి కారణాలు, మార్గాలు ఉంటాయి. కేవలం దేని గురించైనా ఆలోచిస్తూ, మీకు నచ్చని దానిని దేనినైనా గుర్తు తెచ్చుకుంటూ లేదా రేపు మీకు నచ్చనదిదేదో జరుగుతుందని ఊహించుకుంటూ, మీరు ఆనందంగా లేకుండా ఉండచ్చు.

మనుషులు నిరంతరం ఇలా చేస్తూనే ఉన్నారు, అవునా? ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని కత్తితో పొడిచి మీకు బాధని కలిగించనక్కరలేదు. ఎవరో పదేళ్ళ క్రితం అన్నమాట మీకు ఇప్పటికీ బాధ కలిగించవచ్చు. ఎవరైనా రేపు మిమ్మల్ని ఏమైనా అంటారేమో అన్న భయం మీకు ఇప్పుడే బాధ కలిగించవచ్చు. లేదా ఎవరైనా అనవలసిన మాట అనలేదనుకోండి, అది కూడా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు.

మీకు బాధ కలిగించటానికి అంతులేని మార్గాలున్నాయి. అదొక పిచ్చి, అంతే. మీరు చిన్నప్పటి నుంచే బాధగా ఉన్నారా లేదా పెద్దైన తరువాతనే బాధగా ఉంటున్నారా అన్నది విషయం కాదు. నాకు ప్రపంచంలో పెద్దవాళ్ళు ఎవరూ కనబడట్లేదు. చిన్న శరీరం ఉన్న పిల్లలు, పెద్ద శరీరం ఉన్న పిల్లలు - ఈ ఇద్దరే నాకు కనిపిస్తున్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1