మనల్ని మనం మన శరీరం, మనస్సులతో  గుర్తించుకొని మన నిజమైన ఉనికిని కోల్పోతున్నామని, అలా మనం జీవిస్తున్న సమాజానికి ఒక ప్రతిబింబంగా మాత్రమే మిగిలిపోతున్నామని, అలా కాకుండా మనకంటూ ఒక అస్థిత్వం ఉండాలని సద్గురు అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!


చూడండి! మీలోని జీవి మాత్రమే ఆనందంగా ఉండగలడు, కానీ  ప్రస్తుతం  నిజంగా  'మీరు' అనబడేదేది మీ అనుభవంలో లేదు. ప్రస్తుతం ‘మీరు’ అనేది కేవలం సామాజిక పరిస్ధితుల నుండి మీరు సమీకరించుకున్న ఒక చెత్త కుప్ప మాత్రమే.

మీలోకి మీరే చూసుకోండి. 'నేను' అని మీరు అనగలిగేది ఏదైనా మీలో ఉందేమో చూడండి. ప్రస్తుతానికి మీరు అనేది మీరు చదివిన పుస్తకాల నుండి, మీ చుట్టుప్రక్కల ఉన్న మనుషుల నుండి, పరిసరాల నుండి మీరు సేకరించుకున్న అనేకరకాలైన చెత్త మాత్రమే. అది కేవలం మీరు స్వీకరించిన ఒక పెద్ద అభిప్రాయాల మూట మాత్రమే. అందులో ‘మీరు’ అన్నది లేదు.

నిజానికి అక్కడ రెండు కుప్పలు ఉన్నాయి; ఒకటి శరీరం, రెండోది మనసు. మీ భౌతిక శరీరం మీరు తిన్న ఆహారపు కుప్ప, అవునా, కాదా? మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఈ కుప్ప ఎంత పెద్దదయిందో చూడండి(నవ్వు). మీ మనసు మీరు స్వీకరించిన ఒక పెద్ద అభిప్రాయాల కుప్ప. ఈ రెండు పెద్ద కుప్పలలో మీరు ఎక్కడ ఉన్నారు? మీకంటూ అసలు అస్థిత్వమే లేదు. అలాంటప్పుడు మీరు ఆనందంగా ఎలా ఉండగలరు? అటువంటి అవకాశమే లేదు.

  

ప్రస్తుతం మీరు జీవిస్తున్న సమాజానికి మీరు ఒక ప్రతిబింబం మాత్రమే, ఇందులో మీరంటూ లేరు. ఒక వ్యక్తి మాత్రమే ఆనందం అంటే ఏమిటో తెలుసుకోలగలడు, సమాజం కాదు

ముందు మీకంటూ ఒక అస్థిత్వం ఉండాలి, తరువాత ఆనందంగా ఉండడమనేది వస్తుంది. ప్రస్తుతం మీరు జీవిస్తున్న సమాజానికి మీరు ఒక ప్రతిబింబం, ఇందులో మీరంటూ లేరు. ఒక వ్యక్తి మాత్రమే ఆనందం అంటే ఏమిటో తెలుసుకోలగలడు, సమాజం కాదు.

ప్రస్తుతం మీరు ఒక గుంపు, ఒక జనసమూహం, అవునా, కాదా?ఈ సమూహానికి ఆనందం తెలియదు. ఎందుకంటే ఈ సమూహం మీలోని వైరుధ్యాల, ఘర్షణల గందరగోళం. ఈ గ్రహం మీద వేరే యుద్ధాలేమీ జరగక్కరలేదు, మనుషులు తమ లోపల తాము నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, అవునా, కాదా? మీకు యుద్ధం చేయటానికి తుపాకులు, కత్తులు అవసరం లేదు - మీరు కళ్ళు మూసుకుని కూర్చుని మీలో మీరే ఒక యుద్ధాన్ని మొదలుపెట్టుకోగలరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.