శ్రీకృష్ణ, బలరాములను అంతం చేయాలని కంసుడు వారిని ఏ విధంగా మధురకు రప్పించాడో సద్గురు తెలుపుతున్నారు.

కృష్ణుని మేనమామ, క్రూరుడైన కంసునికి తనను చంపే పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడని, అతడిని నాశనం చేసేందుకు తను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని తెలిసింది. ఒకనాడు కృష్ణుడు వచ్చి తనను వధిస్తాడనే భవిష్యవాణిని తరచు చుట్టూ ఉండే జనం అతనికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆ బాలుడు వ్రే పల్లెలో పెరుగుతున్నాడనే విషయం రూఢిగా తెలుసుకొన్నాడు. కనుక ఏ విధంగానైనా బలరామునితో సహా మధురకు రప్పించి అతడిని కుట్ర పన్ని చంపించాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణునికి బంధువైన అక్రూరుని శ్రీకృష్ణ బలరాములను మధురకు ఆహ్వానించి తీసుకొని రమ్మని నియమిస్తాడు. 

బలరామ కృష్ణులను ఆహ్వానించేందుకు ఒక సాకుగా కంసుడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కాలంలో ధనుర్యాగాన్ని చేయటం సర్వసాధారణం. ధనుర్యాగానికి రాజు ప్రత్యేకంగా ఒక ధనుస్సును నిర్మింపచేస్తాడు. అది సామాన్యులకు లేపటానికి గాని, ఎక్కుపెట్టానికి గాని సాధ్యం కాని విధంగా తయారు చేయిస్తారు. అత్యంత అనుభవశాలి, వీరుడు అయిన వాడు మాత్రమే ఆ ధనుస్సు నారిని బిగించి ఎక్కుపెట్టగలిగే విధంగా ఆ ధనుస్సు నిర్మిస్తారు. ధనస్సుకు గల నారిని సంధించి నిర్ణీతమైన గురిని కొట్టగలగిన వ్యక్తిని విజేతగా ప్రకిస్తారు. సాధారణంగా ధనువును ఎక్కుపెట్టి నారి సంధించి బాణ ప్రయోగం చేయటం అనేది స్వయంవరాలలోగాని, ఇతర శౌర్య పరీక్షలలో గాని ఏర్పాటు చేస్తారు. (సీతాస్వయం వరం, ద్రౌపది స్వయం వరం ఇటువంటి పరీక్షలే) ఈ ధనుర్యాగ సందర్భంలో కంసుడు అనేకమైన ఇతర క్రీడలను, బాహు యుద్ధం అని పిలువబడే మల్లయుద్ధాన్ని కూడా ఏర్పాటు చేసాడు. 

ఆ కాలంలో ఏవీరుడు గాని, రాజు గాని మల్లయుద్ధ ప్రవీణుడై ఉండటం అత్యంత అవసరం అని తలచేవారు. ఎందుకంటే అన్ని రకాల ఆయుధాలు నిరుపయోగమై పోయిన సందర్భం వస్తే వారికి బాహుయుద్ధం రక్షణ కలిగిస్తుంది. వీరుడైన వాడు చేతులతోనే (పరస్పర బాహువులతో) శత్రువును బంధించటం తెలిసికొని ఉండటం అవసరమని, భావించేవారు. సైనికులకు ఆయుధాలను ఉపయోగించటమే కాక ఒకరితో ఒకరు కలియబడి యుద్ధం చేయటంలో కూడా శిక్షణ ఇస్తారు. ఈ బాహు యుద్ధం లేక మల్లయుద్ధం అనేది ఈ సంస్కృతిలో చిర కాలంగా వర్ధిల్లుతోంది. కంసుడు స్వయంగా గొప్ప మల్లయుద్ధ వీరుడు. అతని ఆస్థానంలో ప్రసిద్ధి పొందిన మల్లయోధులు ఎందరో ఉండేవారు.

ఒకవేళ మధుర చేరిన తరువాత కృష్ణుని చంపేందుకు ఏర్పాటు చేసిన ఇతర ప్రయతాలన్నీ విఫలమైతే, చివరగా కృష్ణుని మల్లయుద్ధపు బరిలో చంపించాలని నిశ్చయించుకుాండు. అంతకన్నా మరొక విధంగా యాదవులు చూస్తుండగా కృష్ణుని చంపటం సాధ్యంకాదు. యాదవులకు కృష్ణుడంటే ప్రాణం కన్నా ఎక్కువ. అతడు ఎన్నో సందర్భాలలో వారిని రక్షించిన కథలు అప్పటికే బాగా ప్రచారం పొందాయి. ఒకరినించి ఒకరికిగా వ్యాపించిన ఈ కథలలో అతిశయోక్తులు కూడా వచ్చి చేరాయి. యాదవులతో పాటు మధురలోనూ అందరూ కృష్ణుని గురించి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ వింటున్న, చూస్తున్న కంసునికి చిరాకుతో పాటుగా అంతరంగంలో ఒక విధమైన భయం కూడా కలిగింది. ఆ భయం వల్లనే కంసుడు ధనుర్యాగం మిషతో కృష్ణుని మధురకు రప్పించి అంతం చెయ్యాలని ఏర్పాట్లు చేసాడు.

బలరామ కృష్ణులను మధురకు ఆహ్వానించేందుకై వచ్చిన అక్రూరుడు ప్రపంచాన్ని గ్రహించినవాడు, సాధుశీలి. అతడు బలరామ కృష్ణులను చూడగానే పూర్తిగా కృష్ణుని ప్రభావంలో మునిగిపోయాడు. 'భవిష్యవాణి చెప్పిన వ్యక్తి 'నిజంగా ఇతడేనా?' అనే సందేహం పదహారేళ్ళ కృష్ణుని చూసినప్పుడు ఏభైఏళ్ళ అక్రూరుడికి వచ్చింది 'ఇతడు భగవంతుని అవతారమా, ఈ చిన్న బాలుడు ప్రపంచాన్ని కాపాడే వాడా?' ఎన్నో ప్రశ్నలు అక్రూరునిలో చెలరేగాయి. నందగోకులంలోను, మధురానగర ప్రయాణంలోను అక్రూరుడు కృష్ణుని పరిశీలించాడు. కృష్ణుని నిరాడంబరత, అతడి సౌందర్యం, తోిపాటు వారిపట్ల, పశుపక్ష్యాదులయందు అతడు చూపే అంతులేని వాత్సల్యం, ప్రేమ, అతడి నడత, స్థిరమైన, శారీరక, మానసిక స్థితిగతులు, ఇవన్నీ అక్రూరుడు గమనించాడు. శ్రీకృష్ణుని ప్రత్యేకతలు గమనించిన కొద్దీ అక్రూరుడు తన మనస్సును, దృష్టిని వేరొకదానిపై నిలపలేక పోయాడు. సర్వం కృష్ణమయంగానే అతడికి కన్పించింది. ''అందరూ నువ్వు రక్షకుడివి అంటారు. నిజమా?'' అక్రూరుడు కృష్ణుని ప్రశ్నించాడు.

నా జీవితం ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకే నిర్ణయింపబడింది. ఈ నా జీవితం ముగిసేలోపుగా ధర్మ ప్రతిష్ఠాపన చేయటమే నా కర్తవ్యం. 

''అదేమో నాకు తెలియదు. అయితే నాకొక విషయం మాత్రం తెలుసు. నేను ఎల్లలు లేనివాడను, నా జీవితం ఈ సమాజంలో ధర్మాన్ని కాపాడేందుకే నిర్ణయింపబడింది. ఈ నా జీవితం ముగిసేలోపుగా ధర్మ ప్రతిష్ఠాపన చేయటమే నా కర్తవ్యం. అన్న విషయం మాత్రమే నాకు తెలుసును'' కృష్ణుడు బదులిచ్చాడు. ''నీ కెలా తెలుసు? ఎవరైనా చెప్పారా?'' అక్రూరుడు కృష్ణుని ప్రశ్నించాడు. ''లేదు, ఎవరూ చెప్పలేదు అది (ఆభావన) నాలోనే ఉంది.ఇలా చెప్తే నీకు నవ్వు రావచ్చును. నీవు నా పట్ల అనుమానంగా చూస్తావని కూడా గ్రహించగలను. ఇప్పుడు నేనేం చెప్పినా అది అర్దరహితమనుకుంటారనీ తెలుసు. కానీ ఇది నిజం ''దయచేసి నాకంతా చెప్పు నా చిన్నతనం నుంచీ వింటున్నాను. నా జీవితకాలంలో ఒక రక్షకుడు, ఒక ఉద్దారకుడు జన్మిస్తాడని అందరూ చెప్తున్నారు. అలా జరగాలని, జరిగితే చూడాలని నా గుండె అల్లాడిపోతోంది. నిర్దయుడు, క్రూరుడైన కంసుని కొలువులో అతడి మంత్రులలో ఒకడుగా బ్రతుకుతున్న నాకు ఆ అదృష్టం కలుగుతుందా, అలా జరిగే అవకాశం ఉందని (సాధ్యమౌతుందని) తోచటం లేదు. ఈ సందేహం నా మెదడుని తొలిచేస్తోంది.'' కన్నీళ్ళతో అక్రూరుడు ప్రార్థించాడు. 

కంసుని మంత్రిగా అక్రూరుడు అధర్మము, హింసాత్మకము అయిన పనులెన్నో చేయవలసి వచ్చింది. ''దుష్టుడైన కంసుని మంత్రిగా ఆలోచిస్తే నాకు ఎటువంటి ఆశ ఉండదు. నా జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు ఈ మాటను నేను విశ్వసింపలేకపోతున్నాను. కానీ నా హృదయం మాత్రం ఈ మాట సత్యం, ఒకరోజున ఒకరు వస్తారు మనందరినీ ఈ స్థితినుంచి విడుదల చేస్తారు అని ఘోషిస్తూనే ఉంది. మొదటగా నిన్ను చూసినప్పుడు ఈ చిన్నబాలుడా అని నమ్మలేకపోయాను, కాని నా మనసు మాత్రం ఎప్పటికన్నా ఎక్కువగా ఆశలను కల్పిస్తోంది. దయచేసి నాకు నిజం ఏమిటో తెలియచేయి.''

కృష్ణుడు కొండ మీద తనకు కలిగిన అనుభవాన్ని వివరింపసాగాడు..

''గర్గాచార్యుల వారు నేను నందుని పుత్రుని కాదని, నా రాకతో ఒక బృహత్కార్యం జరగవలసి ఉందని నాకు గుర్తు చేసారు. అప్పుడు నేనొక కొండపైకి వెళ్ళి శిఖరం పైన నిలబడి చుట్టూ చూశాను. అలా చూసినప్పుడు సూర్యునిలో, ఆకాశంలో, సమస్త ప్రకృతిలో నా రూపమే కన్పించింది. నేను నా కర్తవ్యం ఏదో దానిని ఈ జీవిత కాలంలో నిర్వహిస్తే, మనుష్యులంతా దేవతలవలె సగర్వంగా తలెత్తుకుని తిరగటం నాకు కన్పించింది. అప్పుడు జనులు భయం, ఈర్ష్య, దురాశల వంటి గుణాలతో బ్రతకరు. ఆనందంతోను, ఆత్మగౌరవంతోను జీవించగలరు. నేను చేయవలసిన కర్తవ్యం పూర్తి చేస్తే అందరు గౌరవంతో మర్యాదా పురుషులుగా తిరగటం నేను చూశాను. ఆక్షణం నుంచీ నేనంటే ఏమిటో, నేను కానిదేమిటో నాకు తెలియటం లేదు (సర్వమూనేనే)

అక్రూరుడు దుఃఖంతో కృష్ణుని పాదాలపై పడిపోయాడు

''నువ్వు వచ్చావు. నా చిన్న తనం నుంచీ వాళ్ళంతా చెప్తూనే ఉన్నారు. అతడు వచ్చినప్పుడు ఇలాగే మ్లాడుతాడని చెప్పారు. (అన్నీ నేనే, అంతా నేనే- అని) ఇప్పుడు నీ స్వరం ఇదే నిత్యసత్యం అని చెప్తోంది.'' అక్రూరుడు లేచినిలచి శ్రీకృష్ణుని ముఖం వైపు చూసాడు. అక్కడ అతనికి సూర్య చంద్రులు, నక్షత్రాలు కృష్ణుని చుట్టూ పరిభ్రమించటం కన్పించింది. అతడికి పూర్తిగా నమ్మకం కలిగింది. కృష్ణుడే సర్వాంతర్యామి. తామంతా ఎదురు చూస్తున్న జగద్రక్షకుడు అని ఇప్పుడు అతనికి తాను చెయ్యవలసిన పని స్ఫురించింది. బలరామకృష్ణు లిద్దరినీ తీసికొని మధురా నగరానికి ప్రయాణమయ్యాడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: Abee5