ఆయనే ఆది యోగీ, ఆది గురువు, దక్షిణామూర్తి...!!!

 

15,000 సంవత్సరాల క్రిందట, హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో, ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో, ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో (మూలాలే) ఎవరికీ తెలియదు. ఆయన అలా వచ్చి,ఇలా నిశ్చలంగా  కూర్చున్నారు. చుట్టూ ఉన్నవారికి ఆయన పేరు తెలియకపోవడం వల్ల ఆయనను ‘ఆదియోగి’ అన్నారు. ఆయన సానిధ్యం అసాధారణంగా ఉండటం వల్ల ప్రజలు చాలా మంది గుమిగూడారు.ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా వేచి చూసారు. కానీ ఆయన మాత్రం నిశ్చలంగా,ఎవ్వరినీ అసలేమీ పట్టించుకోకుండా అలాగే కూర్చున్నారు. ఆయన శ్వాస తీసుకుంటున్నారో లేదో కూడా వారు చెప్పలేకపోయారు.

ఆయన కనుల నుండి ప్రవహించే ఆనందబాష్పాలు మాత్రమే ఆయన జీవించే ఉన్నారన్నదానికి సూచన. మామూలుగా ఎవరైనా అలా మాట్లాడకుండా కూర్చుంటే మొదటి పదినిమిషాలు ఏదో జరుగుతుందేమో అని ఉత్సుకతతో  మీరందరూ వేచి చూస్తూఉంటారు . కానీ ఆయన అలానే మౌనంగా కూర్చునుంటే ఓ అరగంటకాకుండానే అందరూ మెల్లిమెల్లిగా జారుకోవడం మొదలుపెడతారు. ఇంకో రెండు గంటలు అలాగే గడిస్తే సగం మందికి పైగా వెళ్ళిపోతారు. సరే ,ఆరు గంటల తరువాత చూస్తే ఏ ముగ్గురో  నలుగురో మిగులుతారేమో. ఆదియోగి విషయంలోనూ ఇదే జరిగింది. ఏదో అద్భుతం జరగబోతోందని వేచి చూస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

వారి దృష్టిలో అద్భుతం అంటే, బ్రహ్మాండమైన బాణా సంచా లాంటిదేదో జరుగుతుందని! కాని, అలాంటిదేదీ జరగలేదు. ఒక అద్భుతం అప్పటికే జరిగింది అన్న సంగతి తెలుసుకునే జ్ఞానం వారికి లేదు. ఓ మనిషి అలా నెలల తరబడి స్థాణువులా కూర్చుని ఉన్నారంటే, ఆ వ్యక్తిని  ‘భౌతిక’ విషయాలేవి ఇక శాసించలేవనేగా అర్ధం! అదే ఓ అద్భుతం కదా!

ఓ మనిషి అలానెలల తరబడి స్థాణువులా కూర్చుని ఉన్నారంటే, ఆ వ్యక్తిని  ‘భౌతిక’ విషయాలేవి ఇక శాసించలేవనేగా అర్ధం!

ఈ భౌతికశారీరానికి అనేక స్థాయిలలో నిర్బంధనలున్నాయి , అది దాని నైజం . మీరిలా కూర్చునున్నారు , కొన్ని గంటలు గడిచేటప్పటికే మీకు తినాలని, తాగాలని అనిపిస్తుంది. ఆ రెండూ అయినతరవాత బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది అయ్యాకా మళ్ళీ తినాలనిపిస్తుంది. కడుపు నిండాకా ఓ కునుకు తీయాలనిపిస్తుంది! శరీరతత్త్వం ఇలా ఉంటుంది. కాని, ఆదియోగి అక్కడే చాలా నెలలు కూర్చున్నారు. కేవలం కుతూహలంతోనే ఆయనను చూడాలని వచ్చినవాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అద్భుతాన్ని కోల్పోయారు. ఏడుగురు మొండివారు మాత్రం మిగిలారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్థించారు. ‘ఇది వినోదం చూద్దామనుకునే వారి కోసం కాదు, ఇది తెలుసుకోవాలంటే, మరేదో అవసరం, మీరు వెళ్ళిపొండి!’ అంటూ ఆయన వాళ్ళను వదిలించుకుందామనుకున్నారు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు వారి పట్టుదలను చూసిన ఆయన, ‘‘సరే! ఇది తెలుసుకునే ముందు దానికి కావలసిన ఒక చిన్న ప్రక్రియను బోధిస్తాను. కొంత కాలం ఇది చెయ్యండి, ఆ తరువాత చూద్దాం!’’ అన్నారు.ఆ ఏడుగురూ దాన్ని సాధన చేయడం మొదలుపెట్టారు . రోజులు వారలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి; కాని ఆయన ఇంకా వాళ్ళను పట్టించుకోలేదు. 84 ఏళ్ళ సాధన తరువాత సూర్యుడు ఉత్తరాయణం నుండి  దక్షిణాయణంలోకి మారిన రోజున, (భూమి మీద దిశ గణన ప్రకారంసూర్యుడి గమనం ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు మారినప్పుడు) ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు ఎంతో తేజోవంతులైన మనుషులుగా, తన జ్ఞానాన్ని స్వీకరించేందుకు తగినవారుగా మారటం ఆయన చూశారు. ఇక ఆయన వారిని ఉపేక్షించ లేకపోయారు.

 ఈ జీవిన వలయాన్ని  దాటి,  సృష్టిలో , దీనికి పూర్తిగా భిన్నమైన మరొక పార్శ్వంలోకి పయనించవచ్చు

ఆ పౌర్ణమి నుంచి తర్వాత పౌర్ణమివరకూ, ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆయన వారిని గమనించిన తరువాతే వారికి బోధన చేయాలని నిశ్చయించుకున్నారు. సూర్యుడు దక్షిణం వైపుకు మళ్ళడంతో, ఆయన కూడా దక్షిణం వైపుకు తిరిగి కూర్చుని, ఆ ఏడుగురికీ జీవ నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని వివరించడం మొదలుపెట్టారు. దీన్నే మనం నేడు 'యోగ' అని అంటున్నాం. ఆయన దక్షిణం వైపుకు తిరిగి ఉండడంతో, ఆయనను ‘దక్షిణామూర్తి’ అని పిలిచారు. అంటే ‘దక్షిణంవైపు ఉన్నవారు’ లేక ‘దక్షిణం వైపుకు చూసేవారు’ అని అర్థం. ఆ పౌర్ణమే గురుపౌర్ణమి. ఎందుకంటే ఆ రోజు ఆది గురువు ఆవిర్భవించారు - అదే రోజు ఆదియోగి, ఆది గురువుగా మారారు. ఈ రోజు ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే మానవ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా - కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు , ఓ మనిషి  ప్రస్తుతం తానున్న స్థాయి నుండి మరొక స్థాయికి క్రమంగా పరిణామం చెందే అవకాశాన్ని కల్పించిన రోజది. అప్పటి వరకూ ప్రజలు – ‘దేవుడు ఇలా మమ్మల్ని సృష్టించాడు, ఇక అది అంతే!’’ అనుకునేవారు.

మొట్టమొదటి సారిగా ‘మీ ప్రస్తుత జీవితం మాత్రమే మీ పరిమితి కాదు, మీరు ఈ జీవిన వలయాన్ని  దాటి,  సృష్టిలో , దీనికి పూర్తిగా భిన్నమైన మరొక పార్శ్వంలోకి పయనించవచ్చు’ అనే అవకాశానికి  ఆదియోగి ద్వారాలు తెరిచారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1