ఆనందం ఎక్కడి నుండి వస్తుంది..? బయటి నుండా, లోపలి నుండా..? అసలు ఆనందానికి బాహ్య ప్రేరణ అవసరమా..? ఈ ప్రశ్నలకి సద్గురు సమాధానాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!  


మనం ఆనందాన్ని అనుభవించినప్పుడు, అది ఎప్పుడూ కూడా లోపలే ఉద్భవించి బాహ్యంగా వ్యక్తీకరించబడుతుంది. అది ఎప్పుడూ మీ మీద వర్షించదు. కాబట్టి ఖచ్చితంగా అది లోపలి నుండే వస్తుంది. మీరు కేవలం దాని స్టార్ట్ బటన్‌ని బయట పెట్టారు, అంతే.

సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటే మీరు ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే మీరు ఆనందపడాలంటే సూర్యుడు అస్తమించాలి లేదా ఉదయించాలి. అతను 12 గంటలు పైనే ఉంటే, మీకది ఆనందాన్ని కలిగించదు. అతను ఉదయించేప్పుడు, అస్తమించేప్పుడు ఆ కొన్ని క్షణాలు మాత్రమే మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అతను పైన ఉన్నప్పుడు మీరు అతన్ని తిట్టుకుంటారు, మీరు ఆనందంగా ఉండరు.

ఒక రోజులో సూర్యుడు ఎన్ని సార్లు అస్తమించగలడు? ఒక్కసారి మాత్రమే. 'నాకు సూర్యాస్తమయం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది’ అని మీరు అన్న క్షణం, మీరు రోజులో కొన్ని క్షణాలు మాత్రమే ఆనందంగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు; రేపు ఒక వేళ మబ్బుగా ఉంటే ఆ కొన్ని క్షణాలు కూడా సూర్యాస్తమయం చూసే అవకాశం ఉండదు. అలాగే మీరు ఇక్కడ, ఈ పర్వత పాదాల వద్ద కూర్చంటే, ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ  ఈ పర్వతాలు అడ్డగా ఉండటం వల్ల మీరు సూర్యాస్తమయాన్ని చూడలేరు.

మీరు మీ జీవితాన్ని గడుపుతున్న విధానాన్ని చూడండి, మీరు మీకు గెలిచే అవకాశమే ఇచ్చుకోవడం లేదు..

మీరు మీ జీవితంలో చేసేది కూడా ఇదే. మీరు మీ జీవితాన్ని గడుపుతున్న విధానాన్ని చూడండి, మీరు మీకు గెలిచే అవకాశమే ఇచ్చుకోవడం లేదు.  మీరు ఆనందంగా ఉండటానికి ఏదో ఒక బాహ్య ప్రేరణ మీద ఆధారపడుతున్నారు. కాని, ఆనందంగా ఉండటానికి ఏ బాహ్య ప్రేరణ అవసరం లేదు.  ఆనందం కోసం బాహ్య ప్రేరణ మీద ఆధారపడడం అనేది మీలో మీరే తయారుచేసుకున్న ఒక నిర్భంద స్ధితి.

ఉదాహరణకి, మీకు అంత వయసు లేకపోవచ్చు, కానీ మీరు 1940లలో ఒక కారు కొనుక్కుని ఉంటే, మీరు ఆ కారుతో పాటు ఇద్దరు నౌకర్లని కూడా పెట్టుకోవలసి ఉండేది. ఎందుకంటే ఉదయం మీ కారుకు ఒక ‘పుష్ స్టార్ట్’ కావలసి ఉంటుంది. మీరు1950లో కొనుక్కొని ఉంటే, ఒక నౌకరు సరిపోయేవాడు. ఎందుకంటే అప్పటికి ‘క్రాంక్ స్టార్ట్ ‘ వచ్చింది.

ఈ రోజులో మీ అందరి కార్లకి ‘సెల్ఫ్ స్టార్ట్’ ఉంది, అవునా, కాదా? మరి మీ ఆనందాన్ని కూడా ‘సెల్ఫ్ స్టార్ట్’ మీద పెట్టవలసిన సమయం ఇంకా రాలేదంటారా? నేను మీ టెక్నాలజీస్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను (నవ్వు). దానికి ఇంకా సమయం రాలేదంటారా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.