ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటో తెలియకుండానే చాలా మంది దీనిని కోరుకుంటూ ఉంటారు. నిజానికి వారు కోరుకునేది వారి జీవితంలో కోల్పోయిన ఆనందాన్నే అని సద్గురు చెబుతున్నారు. మనకి ఏది కావాలన్న దాని గురించి సూటిగా వెళ్ళడమే సరైన పద్దతి అని అంటున్నారు.

సాధకుడు: ఒకరు ఆత్మసాక్షాత్కారం లేక జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు..?

సద్గురు: మీరు ఎంతో పెద్ద ప్రశ్నని చాలా తేలికగా అడిగేస్తున్నారు. అసలు మీరు ఆత్మసాక్షాత్కారం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు..?

సాధకుడు:  సంతోషంగా ఉండడం కోసం.

సద్గురు: సరే! మనం సూటిగా దాని దగ్గరకే వద్దాం. ఇది - మనం ధనం పొందడం ఎలా..? మద్యం తాగడం ఎలా..?  స్వర్గానికి వెళ్ళడం ఎలా..? అన్నట్లుగా - అడుగుతున్నారు. ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు డబ్బు సంపాదించాలనుకున్నా, పేరు-ప్రఖ్యాతులు గడించాలనుకున్నా ఒక కుటుంబాన్ని తయారు చేసుకోవాలనుకున్నా, గుడికి వెళ్ళినా.. లేదా బార్ కి వెళ్ళినా సరే..!!  ఇవన్నీ కూడా, మీరు సంతోషాన్ని వెతుక్కుంటూ చేస్తున్నారు.   కొంతమంది సంతోషం స్వర్గంలో ఉన్నదని అనుకుంటారు. కొంతమంది ఆహారం తింటే వస్తుందనుకుంటారు, మరి కొంతమంది మద్యం తాగితే వస్తుంది అకుంటున్నారు. మరికొంతమంది భర్త ద్వారా, భార్యద్వారా, లేదా పిల్లల ద్వారా పొందగలం అనుకుంటున్నారు. అందరూ కూడా, ఆనందాన్నే పొందాలనుకుంటున్నారు. కానీ వివిధ మార్గాలలో,  ప్రయత్నం చేస్తున్నారు.

మీ ప్రాణశక్తికి దు:ఖం, పారవశ్యం, బాధ, ఆనందం, ప్రశాంతత, స్థిమితం లేకపోవడం - ఇవన్నీ కూడా చేయగల సామర్థ్యం ఉంది.

ఇప్పుడు, మీరు ఎంచుకున్న మార్గం ఆత్మసాక్షాత్కారం. అందుకని మనం సూటిగా దానిగురించే మాట్లాడుకుందాం. సరేనా..? మీరు ప్రపంచంలో ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకొని, దానితో మమేకం అయి ఉండవచ్చు.  కానీ నిజానికి మీరు కొంత ప్రాణశక్తి.. అంతే కదా? మీరు, “ నేను ఒక పురుషుడిని, నేను ఒక స్త్రీని,  నేను ఇది, నేను అది..” – అనుకుంటూ ఉండి ఉండవచ్చు.  ఇది జీవితంలో, మీ అనుభూతిని బట్టి ఉంటుంది. కానీ ఈ క్షణంలో, మీరు ఇక్కడ ఇప్పుడు ఇలా ఊరికే కూర్చొని ఉంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మాయం అయిపోతే - అప్పుడు మీరేంటి..? మీరు కేవలం కొంత ప్రాణశక్తి..!!

అది,  ఇప్పుడు ఈ విధంగా పని చేస్తుంది. నేను ప్రాణశక్తి అంటున్న దీనిని మీరు “ నేను “ అనుకుంటున్నారు. ఇది ఒక్కోసారి ఎంతో సంతోషంగా ఉంటుంది, ఒక్కోసారి ఎంతో విచారంగా ఉంటుంది, ఒక్కోసారి ప్రశాంతంగా, ఒక్కోసారి కోలాహలంగా, ఒక్కోసారి దు:ఖంలో, ఒక్కోసారి పారవశ్యంలో ఇలా అన్నీఈ ప్రాణశక్తి అనుభూతి చెందుతున్నవే..! మీ ప్రాణశక్తికి దు:ఖం, పారవశ్యం, బాధ, ఆనందం, ప్రశాంతత, స్థిమితం లేకపోవడం - ఇవన్నీ కూడా చేయగల సామర్థ్యం ఉంది. ఇవన్నీ చేయగల సామర్థ్యం ఉండీ, మీకు గనక ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే, మీరు దేనిని ఎంచుకుంటారు..? మీ జీవశక్తి ఎలా అనుభూతి చెందాలనుకుంటారు..? మీరు దు:ఖాన్ని కోరుకుంటారా..? పారవశ్యాన్నా ..?

సాధకుడు: పారవశ్యాన్ని.

సద్గురు: ఆమాత్రం తెలివితేటలు మీకున్నాయి. కదూ..? ఈ మాత్రం తెలివి అందరికీ ఉంటుంది. మీకు దీనికోసం, ఎవరూ తత్వాలు బోధించనక్కర్లేదు. దీనికోసం, మీకు గ్రంథాలు అవసరమా..? ఎందుకంటే, మీలో ఉన్న జీవం.. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కాంక్షిస్తుంది. ఇది మరొకరి ఆలోచన కాదు. అవునా..? కాదా..? అందుకని మీరు ఆనందంగా ఉండడం అనేది ఎవరి లక్ష్యమో కాదు. అది వేరెవరి ఆలోచన కాదు. అది ఎవరి తత్వమో కూడా కాదు. ఇది మీలో ఉన్న జీవం ఈ విధంగా ఉండాలని కాంక్షించడమే..! ఒక పువ్వు ఎలా అయితే వికసించాలనుకుంటుందో, అలానే మీలోని జీవం, ఎల్లప్పుడూ ఎలా సంతోషంగా ఉండాలా అని అనుకుంటుంది. కానీ, మీరు ఆ ప్రయత్నాన్ని భంగం చేయడానికి ఏమిచెయ్యగలరో అవన్నీ చేస్తున్నారు.

మీరు ఆనందాన్నే గనుక కోరుకుంటున్నట్లయితే, మీ జీవ శక్తి ఆ విధంగా పనిచేసేలాగా, చూసుకోవాలి. మీ జీవశక్తి మీకు కావలసిన విధంగా పని చేస్తే, జీవితంలో దు:ఖంగా ఉండడం అనేదే జరుగదు. ఇప్పుడు మీకు కావలసినది అదే..! మీ శరీరం, మీ మనస్సు, మీ ప్రాణశక్తి… మీరు కోరుకున్న విధంగా పని చెయ్యాలి. ఇదే గనుక జరిగితే, మీరు దేనినైతే ఆత్మసాక్షాత్కారం అంటున్నారో, అది సంతోషానికి సంబంధించిన విషయం అవ్వదు. మీరు ఎంతో ఆనందంగా ఉన్నారనుకోండి, మీరు అంతకన్నా పై స్థాయికి వెళ్లాలనుకుంటారు.

కేవలం మీరు బాగా జీవించడమే మీ లక్ష్యం అయినప్పుడు మీరు భగవంతుడి గురించి, ఆత్మసాక్షాత్కారం గురించి మాట్లాడకూడదు.

కానీ మీరు ఈ జీవితాన్ని బాగా జీవించాలని అనుకోవడం లేదు. ఏదో విధంగా జీవిస్తూ ఆత్మ మూలాన్ని తెలుసుకోవాలకుంటున్నారు. అలాంటి సమయంలోనే మీరు ఆత్మసాక్షాత్కారం గురించి మాట్లాడతారు. కానీ, అలాంటి సమయంలో కేవలం మీరు బాగా జీవించాలనుకుంటున్నారు. అందుకని వీటన్నింటి గురించి మాట్లాడకూడదు. కేవలం మీరు బాగా జీవించడమే మీ లక్ష్యం అయినప్పుడు మీరు భగవంతుడి గురించి, ఆత్మసాక్షాత్కారం గురించి మాట్లాడకూడదు. కేవలం బాగా జీవించడమే మీరు కోరుకుంటే - మీ శరీరాన్నీ, మనస్సునీ, మీ శక్తినీ సక్రమంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ఇలా ఉంటే, మీరు బాగా జీవించగలరు. కానీ ఎప్పుడైతే కేవలం బాగా జీవించడం అన్నది మీకు సరిపోక, మీరు జీవ మూలాన్ని తెలుసుకోవాలనుకుంటే – మీరు దాన్ని తెలుసుకోవడం కోసం జీవితాన్నే అంకితం చేసెయ్యలనుకుంటున్నారో.. అప్పుడు, మీరు ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకుంటున్నట్లు.

ఇప్పుడు కేవలం మీరు, మీ జీవితాన్ని బాగా జీవించాలనుకుంటున్నారు. దానికోసం మనం స్వర్గానికి వెళ్ళనక్కరలేదు. దానిని మీరు సూటిగా ఎలా పొందాలని చూస్తే, ఇప్పటికే అది మీలో ఉందని తెలుసుకుంటారు. మీలో ఉన్నదానిని తెలుసుకోవడానికి, మీరు ప్రపంచం అంతా చుట్టి రావడం దేనికి..? ఒకరోజున ఇలా జరిగింది.. ఎవరో ఒక ప్రయాణీకుడు వచ్చి ఒక చిన్న పిల్లవాడిని, “నీకు మహాబలిపురం ఎంత దూరమో తెలుసా..?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “మీరు గనుక ఇటు వెళ్లాలనుకుంటే 24,996 మైళ్ళు” అని చెప్పాడు. కానీ, “మీరొక్కసారి వెనుకకు తిరిగి వెళితే 4 మైళ్ళు, సరేనా..?” అన్నాడు. మీతో మీరు చేసుకుంటున్నది కూడా అదే..!   మీరు ఆనందంగా ఉండాలి, పార్వశ్యంలో ఉండాలి - అనుకుంటున్నారు. అది మీ లోపలే ఉంది. కానీ  మీరు ప్రపంచాన్ని అంతా చుట్టి అక్కడికి రావాలనుకుంటున్నారు. ప్రపంచాన్ని అంతా చుట్టి అక్కడికి వచ్చేసరికి మీరు మరణించవచ్చు.  మీకు లక్ష సంవత్సరాల జీవన కాలం లేదు కదా..? జీవితం అనేది ఎంతో చిన్నది. మానవ జీవితం ఎంతో చిన్నది.  మీకు గనుక లక్ష సంవత్సరాల జీవనకాలం ఉంటే, మీరు ప్రపంచాన్నంతా చుట్టి రావచ్చు. కానీ ఇప్పుడు అంత జీవనకాలం లేదు కాబట్టి, ఈ విధానం సరైనది కాదు.

మీలో ఉన్నదానిని మీరు చేరుకోవడానికి, ప్రపంచాన్ని చుట్టి రావడం ఏమైనా అర్థవంతమైన పనేనా..? కేవలం ఒక మూర్ఖుడు మాత్రమే అలా చేస్తాడు. అది మీలోనే ఉన్నప్పుడు, మీరు చెయ్యవలసినదంతా, మీరు, ఒకసారి వెనుదిరిగి అంతర్ముఖులవ్వడమే..! అంతేకానీ ప్రపంచాన్ని చుట్టి రావడం కాదు. మీలో జరిగేది అంటే అది మీలోపాలి అనుభూతి అని అర్ధం..! ఈ అనుభూతులన్నీ కూడా అది ఆనందమయినా, సంతోషమయినా. అన్నీ మీలోనే జరుగుతున్నాయి. అవునా? అది మీలోనే జరుగుతున్నాప్పుడు, మీరు అంతర్ముఖులయ్యి దానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచుకోవాలి. అంతేకాని, ప్రపంచాన్ని అంతా చుట్టివస్తే ఏమి జరుగుతుంది..? దానికి.. ఏమీ అర్థం లేదు. అందుకని మనం దానిని ఎదుర్కొందాం. మీ సమస్యలని సూటిగా ఎదుర్కోవడం నేర్చుకోండి. చుట్టూ తిరిగే విధానాలు, పద్ధతులూ ఎందుకు..? మీకు 24,996 మైళ్ళు చుట్టివచ్చే శక్తి ఉందా..? లేదు. చాలామంది సగంలోనే చనిపోతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు