మీరు ఒక ఆనంద పరిశ్రమ‍!

మనం మన జీవితంలో చేసే ప్రతిదీ ఆనందం కోసమే చేస్తున్నాం. కాని ఎంత చేసినా, ఏమి చేసినా కూడా మనం మాత్రం రోజులో కొద్ది క్షణాలు కూడా నిజంగా ఆనందంగా ఉండటం లేదు. మనం నిరంతరం ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి? అన్న విషయాల గురించి సద్గురు మాట్లాడిన మాటలను "ఆనందం 24x7" అనే ఒక సీరీస్‌గా(ధారావాహికంగా) ఈ వారం నుంచి అందజేస్తున్నాం. ఈ సీరీస్‌లోని మొదటి వ్యాసాన్ని ఈ వారం చదవండి!
 
 

మనం మన జీవితంలో చేసే ప్రతిదీ ఆనందం కోసమే చేస్తున్నాం. ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, పిల్లలని కన్నా, ఇలా ప్రతిదీ ఆనందం కోసమే చేస్తున్నాం. ఇలా ఎంత చేసినా, ఏమి చేసినా కూడా మనం మాత్రం రోజులో కొద్ది క్షణాలు కూడా నిజంగా ఆనందంగా ఉండటం లేదు. దీనికి కారణం ఏమిటి?ఈ విషయాల గురించి సద్గురు మాట్లాడిన మాటలను మీకు అందజేస్తున్నాం.


మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి - గత 24 గంటలలో మీరు ఎన్ని క్షణాలు ఆనందంగా ఉన్నారు? ప్రతిఒక్కరూ, రోజు ముగిసిన తరువాత, ఇది ఎల్లప్పుడూ చూసుకోవాలి. ప్రతి రాత్రీ పడుకునే ముందు, కేవలం 5-10 నిముషాలు మీ అకౌంట్లను సరి చూసుకోండి - 'ఈ రోజు ఎన్ని క్షణాలు ఆనందంగా ఉన్నాను ? నిన్నటి కంటే ఈ రోజు పరిస్ధితి మెరుగయిందా లేక దిగజారిందా? నా సంతోషం పెరిగిందా లేక తగ్గిందా?' ఇలా ప్రతిరోజూ గమనించుకోండి.

ప్రస్తుతం మీరు మీ జీవితాన్ని చూస్తే, మీరు చేసే ప్రతిదీ ఆనందం కోసమే. అంటే, మీరు ఒక ఆనంద పరిశ్రమ.

ప్రస్తుతం మీరు మీ జీవితాన్ని చూస్తే, మీరు చేసే ప్రతిదీ ఆనందం కోసమే. అంటే మీరు ఒక ఆనంద పరిశ్రమ. మీరు ఒక ఆనంద పరిశ్రమ అయితే, ఐదేళ్ళ వయసు నుండి మీ ఉత్పత్తి పెరుగుతుందా లేదా తగ్గుతుందా అన్నది మీరు సరి చూసుకోవాలి.

మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఇతరులు మిమ్మల్ని చిన్నపిలవాడిగా పరిగణించారు, కానీ వాస్తవానికి మీరు ఒక బానిస. ఎందుకంటే మీరు కేవలం ఆదేశాలను పాటించారు. ఎవరైనా “నుంచో” అంటే మీరు నుంచున్నారు. ఎవరైనా ”పడుకో” అంటే మీరు పడుకున్నారు. ఇంకా ఎవరైనా “స్కూల్‌కి వెళ్ళు!” అంటే స్కూల్‌కి వెళ్ళారు. వారు మిమ్మల్ని ఒక చిన్నపిల్లవాడు అనుకున్నారు. కానీ మీ అనుభవంలో, మీరు అతి త్వరగా పెద్దవ్వాలని తొందరపడుతూ ఉన్న ఒక బానిస. ఇప్పుడు మీరు పెద్దయిన తరువాత, మీకు మీ స్వంత జీవితం, మీ స్వంత బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. మీకు సంబంధించిన ప్రతిదీ మీకు నచ్చిన విధంగా చేస్తున్నారు. ఐతే ఇప్పుడు మీ అనందం రెట్టింపయిందా? లేదు. అది తగ్గిపోయింది లేదా విభజించబడింది, అవునా, కాదా?

దయచేసి కాస్త గమనించండి, మీరు చేసినది ప్రతిదీ ఆనందం కోసమే చేసారు. మీరు ఒక ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, పిల్లలని కన్నా, ఇలా ఏమి చేసినా, ప్రతిదీ ఆనందం కోసమే చేస్తున్నారు. కాని ఆనందంగా మాత్రం ఉండటం లేదు. పైగా ఆనందం కోసమని చేస్తున్న ఈ పనులలో మీరు కూరుకుపోతున్నారు. దీనిని ఒక మర మగ్గాన్ని నడపటంతో పోల్చవచ్చు. మనం వస్త్రం తయారు చేయాలంటే, 24గంటలూ పని చేసి, ముడి పదార్ధాలన్నీ ఉపయోగించినా కూడా, ఆఖరికి ఏమీ తయారవకపోతే ఆ మగ్గాన్ని ఏమి చేస్తాం?  దానిని మూసేస్తాం లేదా బాగుచేస్తాం- మీకు ఉన్న చాయిస్ అంతే. ఆ మగ్గాన్ని మూసైనా వేయాలి లేదా బాగైనా చేయాలి, అంతే. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. అందుకని మీరు మీ జీవితాన్ని ముగించేయాలని మేము అనడం లేదు. ఎందుకంటే మీరు మీ జీవితాన్ని నిత్యానందమయం చేసుకునే అవకాశం మీకు ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1