ఆనందం అనిర్వచనీయం

మనలో శారీరక, మానసిక, శక్తి కోశాలనే మూడు కోణాలు ఉన్నాయి. ఈ మూడు భౌతిక ప్రవృత్తి కలిగి ఉన్నాయి. స్థూలంగా మొదలైనా, అలా వెళ్తున్నా కొద్దీ ఇంకా ఇంకా సూక్ష్మంగా మారుతూ ఉంటాయి.
 
మనలో శారీరక, మానసిక, శక్తి కోశాలనే మూడు కోణాలు ఉన్నాయి. ఈ మూడు భౌతిక ప్రవృత్తి కలిగి ఉన్నాయి. స్థూలంగా మొదలైనా, అలా వెళ్తున్నా కొద్దీ ఇంకా ఇంకా సూక్ష్మంగా మారుతూ ఉంటాయి. కానీ విజ్ఞానమయ కోశం వీటికి పూర్తిగా భిన్నమైనది. ఇది తాత్కాలికమైనది. ఒక తత్త్వం నుంచి మరో తత్వానికి పరిణామం చెందడానికి మధ్యలోని స్థితి. అంటే భౌతికం నుంచి అభౌతికం వైపు కదులుతున్నది అని అర్థం. ఈ మధ్యంతర స్థితిని ‘విజ్ఞాన’మని అంటాం.
 
ఈ కోణంలో ఎటువంటి పరిణామం సంభవించినా అది శాశ్వతమైనదే అవుతుంది. ఒకవేళ మీకిప్పుడు యోగ నేర్పించి ఆసనాలు ఎలా వేయాలో చూపించామనుకోండి. ఓ అరునెలల తర్వాత శారీరకంగా, మానసికంగా అన్ని విధాలా మీరు ఇదివరకటి కంటే ఆరోగ్యంగా తయారవుతారు. కానీ, ఏ కారణం చేతనో మరో ఆరునెలలు మానేస్తే మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. శారీరక స్థాయిలో ఏం చేసినా అది మళ్లీ మునుపటి స్థితికే వచ్చేసే అవకాశం ఉంది. ప్రాణాయామం, క్రియల వల్ల మీ ప్రాణశక్తిలో మార్పులు తేవచ్చు. ఇటువంటి పరిణామం ఎక్కువకాలం నిలుస్తుంది. అయితే ఇది కూడా శాశ్వతమైనది కాదు. మీ విజ్ఞానమయ కోశంలో తగినంత పరిణామం వస్తేనే అది చిరస్థాయిగా ఉండిపోతుంది.
 
ఆనందమయ కోశాన్ని అనుభూతి చెందాలంటే భౌతిక కోణాలు మూడింటినీ ఒక క్రమంలో సమన్వయంలో ఉంచగలగాలి
 
మీలోని ఐదో పొరని ‘ఆనందమయ’ కోశమని అంటారు. దీనికి అర్థం ఆనందభరితమైనదని! అంటే మీలో ఆనందమయి బుడగ దాగున్నదనా? కాదు. ఇది భౌతికాన్ని మించిన కోణం. అభౌతికమైనది. వివరణకీ, నిర్వచనాలకీ అతీతమైనది. ఇది కేవలం మన అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ఇది మన అనుభూతిలోకి వచ్చినపుడు పరమానందానికి లోనవుతాం. అందుకే దాన్ని ఆనందమయ కోశం అని అంటున్నాం. అనందం మీ అంతర్గత ప్రవృత్తి కాదు. అది భౌతికానికి అందనిది. భౌతికానికి మించినది. నిజానికి దాన్ని వర్ణించలేం.
 
ఆనందమయ కోశాన్ని అనుభూతి చెందాలంటే భౌతిక కోణాలు మూడింటినీ ఒక క్రమంలో సమన్వయంలో ఉంచగలగాలి. ఇది ఎంతో సహజమైనది. మీ జీవితంలో ప్రతీక్షణం ఆనందమయమే. ఈ అభౌతిక కోణాన్ని తాకినపుడు మిమ్మల్ని ఆధ్యాత్మికులంటారు. ఈ మూడు కోణాలు సమన్వయంలో ఉన్నప్పుడు.. మీ జీవన యానం శ్రమలేకుండా హాయిగా సాగిపోతుంది. అంతే కాదు మీ సామర్థ్యం కూడా పరిపూర్ణంగా వికసిస్తుంది.
 
ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతిలో చదవండి: ఆనందం అనిర్వచనీయం