ఆధ్యాత్మిక మార్గంలో సమస్యలు ఎందుకు..?
 
 

ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు ఎదుర్కొనే సమస్యలు ఆ మార్గం మూలంగా వచ్చినవి కావని, అవి వారి ‘మనసు’ అనే గందరగోళం మూలంగా పుట్టినవని సద్గురు మనకు వివరిస్తున్నారు.

Sadhguruమీరు యోగాసనాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, మీ శరీరం ఎంత  బిగుతూగా ఉందో, మీరు తేలికగా గమనించవచ్చు. కాని మానసికంగా, భావపరంగా మీరెంత బిగుసుకుపోయారో తెలుసుకునేందుకు కాస్తంత వివేకం అవసరం. ఆలోచనల పరంగా, భావావేశాల పరంగా చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు కలవారు, ఈ విధంగా ఆలోచించడానికి, చూడడానికి కనీసం అవకాశం కూడా ఇవ్వరు, అందుకనే వారు అన్ని రకాలుగా తామే ఉత్తములం అనుకుంటారు. మీరు అలాంటి మనిషిని కలిసినప్పుడు, మీకు అతను తలతిక్క వాడిలా అనిపించవచ్చు; కాని అతను మాత్రం తనని తాను ఓ చక్కటి వ్యక్తిగానే భావిస్తాడు. అదేవిధంగా శక్తిపరంగా కూడా బిగుసుకుపోయిన వాళ్లుంటారు. ఒకరి శక్తి సౌమ్యస్థితిలో ఉన్నప్పుడు, అతను యోగాభ్యాసం ప్రారంభించి, చిన్నపాటి క్రియ చేసినా అతనిలో శక్తిచలనం మొదలవుతుంది. అదే ఇంకొకరు ఎన్నోరోజులుగా సాధన చేస్తున్నాకూడా, వారి శక్తిలో చలనమేమీ ఉన్నట్లు కనబడదు. ఇదంతా మీలో శక్తి ఎంత చురుకుగా ఉన్నదనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ బిగుసుకొని ఉండడం అనేది, అన్ని స్థాయులలో ఉంటుంది. ఇవన్నీ ఒక దానికి ఒకటి అనుసంధానమై ఉంటాయి ఒక స్థాయిలో ఉన్న కఠినత్వం మరొక స్థాయిలో కూడా ప్రకటితమవుతుంది.

పతంజలి యోగమార్గం ఎలాంటిదంటే, మీరెంత మూర్ఖత్వంలో ఉన్నా, మీరెంత ఎఱుక లేకుండా ఉన్నా, ఎన్ని కర్మబంధాలలో చిక్కుకొని ఉన్నా సరే, అది మీకు మార్గాన్ని చూపించగలదు.  మీరు కనీసం మీ శరీరాన్ని కాస్త వంచడానికి సుముఖంగా ఉన్నా సరే , తక్షణమే మీకు ఒక కర్మ కరిగిపోతుంది. మీ నుదురు మోకాలికి తగిలించగలిగితే శారీరకంగా ఓ కర్మ నుండి ఉపశమనమైనట్లే. అలా శరీరాన్ని వంచగలగడం అంత చిన్న విషయం కాదు మరి. ఇంతకుముందు ఎన్నడూ చేయని వారికి అది ఒక గొప్పవిషయమే కదా. లేకపోతే చిన్న చిన్న ప్రతిబంధకాలే కాలక్రమేణా పెరిగి పెద్దవుతాయి; దానివల్ల ప్రస్తుతం మీలో ఉన్న ఈ కొంచెం మృదుత్వం కూడా క్రమంగా తగ్గుతుంది. ఇలానే ఉంటే మీరు భౌతికంగా, మానసికంగా పూర్తిగా బిగుసుకు పోయే రోజు వస్తుంది.

చాలామంది జీవితంలో పురోగమించటం లేదు, తిరోగమిస్తున్నారు.

అందరికీ ఇలానే జరుగుతోంది కదా. మీ జీవితాన్నే గమనించండి! పది, పన్నెండేళ్ల వయసులో మానసికంగా, శారీరకంగా మీరు ఎంత మృదువుగా ఉన్నారు? ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఈ మృదుత్వం చాలా వరకు తగ్గింది. ఇక ముప్ఫయి ఏళ్ళు వచ్చేసరికి ఆ  మృదుత్వం  పూర్తిగా కనుమరుగై పోయింది. రాను రానూ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కాఠిన్యం పెరిగింది, అది జీవితంలో పురోగమనం కాదు, తిరోగమనం. చాలామంది జీవితంలో పురోగమించటం లేదు, తిరోగమిస్తున్నారు. తమకు పుట్టుకతో వచ్చిన కొన్ని సానుకూలతలను, దురదృష్టవశాత్తూ వారు వృద్ధిచేసుకోలేదు సరికదా, ఉన్నవాటిని కూడా వ్యర్థం చేస్తున్నారు.

ఆధ్యాత్మిక మార్గం నిజానికి చాలా సులువైనది, కాని మీ వ్యక్తిత్వంతో దాన్ని ఎంతో జటిలం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గం స్వతహాగా సంక్లిష్టమైనది కాదు, ఆధ్యాత్మిక మార్గంలో మీకు ఎదురౌతున్న సంక్లిష్టతలు ఆ మార్గంలోనివి కావు, అవి మీ ‘మనసు’ అనే గందరగోళం వల్లే ఉద్భవించినవి. అంతర్గతంగా మీలో ఎలాంటి చలనం కలగడం లేదు. మీరొక రుబ్బురోలు లాగా గట్టిపడిపోయారు. ఒక్క గురుకృపతోనే మీ బుర్రలోని జాడ్డ్యాన్ని వదిలించుకోగలుగుతారు.

గురుకృపను మీరు మీలోకి అనుమతిస్తేనే మార్గం సుగమం అవుతుంది. మార్గమే గమ్యం కూడా. అప్పుడు మీరు ఊరికే అలా కూర్చుని ఉన్నా సరే, మీ జీవం అనంత అస్తిత్వంలో లీనమైపోతుంది.

మీలోని శక్తిని మీరు ఎంతగా తొక్కిపెట్టారంటే, మీ మనసు దౌర్జన్యంగా మీ జీవితాన్నే అణచివేస్తోంది.

మీలోని శక్తిని మీరు ఎంతగా తొక్కిపెట్టారంటే, మీ మనసు దౌర్జన్యంగా మీ జీవితాన్నే అణచివేస్తోంది. మీ మనసు కేవలం మీ అహాన్ని ప్రేరేపించే విషయాలను తప్ప మరే ఇతర అంశాలను పొసగనీయడం లేదు. మీ శక్తి కూడా మీ అహానికి ఇబ్బంది కలగనంత వరకే కదలుతోంది. మీలో మరికొంత  శక్తి ప్రజ్వరిల్లితే తక్షణం మీ అహం ఆవిరైపోతుంది. ఈ విషయం మీ అహానికి తెలుసు; అందుకే అది మీ శక్తిని అణచిపెట్టి ఉంచుతోంది. ఒకవేళ మీలో శక్తి పూర్తిగా నశిస్తే, దాంతో మీ అహం కూడా శక్తిహీనం అవుతుంది. ఇది కూడా మీ అహానికి ఇష్టం లేదు. అందుకే అహం అవసరమైనంత మేరకు, తన ఉనికికి ముప్పు రానంత వరకు శక్తిని అనుమతిస్తుంది. శక్తి తీవ్రమైతే అహం దెబ్బ తింటుంది.

ఒక్కసారి కుండలినీ శక్తి కదలటం మొదలైతే అన్నీ ఛిన్నాభిన్నమౌతాయి, ఇంకేమీ మిగలవు. మీరు కేవలం మీ చుట్టూ ఉన్నవాటితో మిళితమయ్యే శక్తి ఔతారు. మీకంటూ ఒక సంకల్పం ఉండదు. మీ అస్తిత్వాన్ని వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి, మేము సాధనల ద్వారా మీలో శక్తిని ప్రజ్వలింపచేయడానికి కృషిచేస్తున్నాం. అందుకోసమే ఈ ఆసనాలు, క్రియలు. మీ అంతట మీరు శక్తిని ప్రజ్వలింప చేసుకోలేకపోతున్నారు కాబట్టి. కుండలిని ఒకసారి కదలటం మొదలుపెడితే అదే అన్నిటినీ సరిచేస్తుంది.  తుఫాను వస్తే శతాబ్దాల తరబడి ఉన్న ఈ ప్రపంచాన్ని తన వేగంతో  కొన్ని గంటలలోనే తుడిచివేయగలదు. కుండలినీ శక్తి ఒక వరద లాంటిది. మీరు చేసే సాధన ఎక్కడికో వెళ్ళడానికి కాదు. సాధన ఒక మార్గం, మీ తుచ్ఛమైన వైఖరిని రూపుమాపే ఉద్ధృతమైన వరద, అది ఈ సృష్టికర్త మీరు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా మిమ్మల్ని మార్చేస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1