తెలియని, అనుభవంలో లేని, విషయాలను మీరు నమ్ముతారు. ఇదే అన్ని ఘర్షణలకు మూల కారణమవుతోంది. మనిషి ధార్మికుడైన క్షణం నుండి అన్ని విభేదాలూ అంతరించిపోవాలి; కానీ దురదృష్టవశాత్తూ, ప్రపంచ వ్యాప్తంగా ధార్మిక మతాలే ఘర్షణలకు కారణం అవుతున్నాయి. వేల సంవత్సరాల నుంచి మతమే ఈ భూమి మీద మిగతా అన్నింటి కంటే ఎక్కువ మందిని బలితీసుకుంది. మతమే భయంకరమైన క్షోభకు, వేదనకు కారణమయింది. మనుషులు తమకు ఇంకా వాస్తవం కాని దానిని బలంగా నమ్మడమే ఇందుకు కారణం.

ఒకరు ఒకటి నమ్మితే, ఇంకొకరు ఇంకొకటి నమ్ముతారు. ఇలా ప్రజల నమ్మకాలు వేరు వేరు కావడంతో వారి మధ్య విభేదాలు సహజం అయిపోయాయి. ఈ నమ్మకాల మూలాన ప్రజలు ఏదో ఒక రోజు ఘర్షణకు దిగుతారు, ఇది తప్పదు. కొంతకాలం పాటు ఈ విభేదాలను నివారించవచ్చేమో కానీ శాశ్వతంగా ఈ సమస్యను రూపు మాపలేం. ఏదో ఒక రోజు ప్రజలు ఘర్షణకు దిగుతారు. కొంతకాలం వారు ఘర్షణ లేకుండా ఉన్నా, ఏదో ఒక రోజు ఘర్షణ పడతారు. మీ మార్గమే సరైనదని ఇటు మీరు... మా మార్గమే సరైనదని అటువారు నమ్మినంత కాలం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ తప్పదు.

అన్ని మతాలూ అంతర్ముఖమార్గంలోనే ఆరంభమైనా, కాలక్రమేణా వక్రీకరింపబడి, అవి కేవలం నమ్మకాల పుట్టలుగా మారిపోయాయి. అన్ని మతాలూ మానవ జీవితం ఎంతో విలువైనదని చెబుతున్నా, మతం పేరుతో ఇవాళ మనం ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి తయారవుతున్నాం. దురదృష్టవశాత్తూ ఈ మతం కారణంగానే ఈ భూమిమీద ఎక్కువ బాధలు, విభేదాలు తలెత్తాయి. అసలు సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరగడంలేదు. ఒక వర్గానికీ, మరొక వర్గానికీ తాత్కాలికంగా సంధి కుదిర్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ అవి ఎక్కువ కాలం నిలబడడం లేదు; ఎక్కడో ఒక చోట మళ్ళీ విభేదం పుట్టుకొస్తోంది.

ఇందుకు కారణం మనుషులు ఇంకా తమకు అవగతం కాని, తెలియని, అనుభూతి చెందని దానిని నమ్మడమే. మీరు వాస్తవానికి వస్తే, మీరు ఏ మతానికి చెందిన వారైనా, అన్ని మతాల మూల సిద్ధాంతం ఒక్కటే; కాని నమ్మకాల విషయం వచ్చేసరికి వేరు వేరు దారులు. ప్రతి ఒక్కరూ మంచి-చెడు, సత్యం-అసత్యం అంటూ తమ తమ నమ్మకాల్లో జీవిస్తారు. ఇలా ప్రజలు తమ అనుభవంలో లేని విషయాలపై బలమైన నమ్మకాలు పెట్టుకోవడమే, అన్ని ఘర్షణలకూ మూలకారణం అవుతోంది.

యోగా ఉద్దేశ్యం ఎప్పుడూ మతాన్ని నమ్మకంతో కాక అనుభవపూర్వకంగా, అంతరంగ అనుభూతిగా అనుసరించడంగా చూస్తుంది. ఆధ్యాత్మిక చింతనను ఏ నమ్మకాలతోనూ ఆరంభించవద్దు, అంతరంగంలో పరిశీలించండి. సత్యమైనదని అనుభూతి చెందినప్పుడు మాత్రమే అడుగు ముందుకు వేయండి. శాస్త్రీయంగానే ముందుకు సాగండి, అంతే కాని నమ్మకాలతో కాదు. మనిషి ప్రాథమికంగా పరమోన్నతస్థితి చేరుకోవడం - ఆ స్థితిని మీరు - దేవుడు దివ్యత్వం, స్వర్గం- ఇట్లా ఏమైనా అనండి; ఈ స్థితికి కేవలం -శరీరం ద్వారా గానీ, బుద్ధి ద్వారా గానీ, భావోద్వేగాల ద్వారా గానీ లేదా ప్రాణశక్తుల ద్వారా కానీ - మాత్రమే అందుకోగలరు అని గుర్తిస్తాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకున్న సాధనాలు ఈ నాలుగు మాత్రమే; ఇక మిగతావన్నీ ఊహించుకున్నవే. అవి వేలం మీకు బోధింపబడుతున్నవి.

యోగాలోని నాలుగు ప్రాథమిక మార్గాలు ఇవే. సర్వోత్తమ స్థితికి చేరుకునేందుకు శరీరాన్ని వినియోగిస్తే అది ‘’కర్మయోగం’’. బుద్ధిని, లేదా ప్రజ్ఞను వినియోగిస్తే, అది ‘’జ్ఞానయోగం’’. ప్రేమ, భక్తి లాంటి భావోద్వేగాలను ఉపయోగిస్తే, అది ‘’భక్తియోగం’’. మీలోని ప్రాణశక్తులను వినియోగిస్తే అది ‘’క్రియాయోగం’’. అంటే - బుద్ధి, హృదయం, శరీరం, శక్తి - వీటి ద్వారానే ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. వాస్తవానికి మీరు ఈ నాలుగింటి సమ్మేళనమే. ఎవరూ కేవలం బుద్ధితోనో, ఒక్క హృదయంతోనో, అవయవాలతోనో, లేక కేవలం శక్తి ఒక్క దానితోనే ఉండరు.

ఎవరయినా ఈ నాలుగు అంశాల సమ్మేళనమే కాబట్టి, ఒక వ్యక్తి ఎదగాలంటే, ఈ నాలుగు మార్గాల సమాహారం కావాలి - భక్తి, జ్ఞానం, క్రియ, కర్మ- మీ జీవితంలో ఈ నాలుగూ ఉండాలి; అప్పుడే ఎదుగుదల. అప్పుడే ఉత్కృష్టస్థితిని చేరుకోవడం సాధ్యమవుతుంది; లేకపోతే ఇక ఉండేవి ముఠాలూ, వర్గాలే, అంతా పోట్లాడుకునే వర్గాలే. ఆధ్యాత్మికంగా ఏమీ జరగదు. ఒక వ్యక్తి అంతర్గతంగా వికసించకపోతే, బాహ్యప్రపంచంలో జరగాల్సింది జరగదు. మీరు ఏమి చేసినా, మీ చుట్టూ విస్తరించేది మీ గుణాన్ని మాత్రమే; మీకు నచ్చినా, నచ్చకపోయినా వాస్తవం అదే. మీ అసలు తత్త్వాన్నే అంతటా విస్తరిస్తారు. మీకు ప్రపంచం గురించి చింతన ఉంటే, ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి సిద్ధపడాలి.

యోగ అంటే ‘నన్ను నేను మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను!’ అని. అంతే కాని ప్రపంచాన్ని మార్చాలనుకోవడం కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకోవడానికి సిద్ధపడటం. మీరు మారడానికి సిద్ధపడినపుడే, ప్రపంచంలో సహజంగా మార్పు వస్తుంది.  కాని మీరు ‘’ఇతరులు మారాలని కోరుకుంటున్నారు’’. అందుకే విరోధం మొదలవుతుంది. మీరు మారటానికి సిద్ధమయినపుడే, పరివర్తన జరుగుతుంది. ఈ స్వయంపరివర్తనే వ్యక్తిగత శ్రేయస్సుకు, సమాజ శ్రేయస్సుకు దారితీస్తుంది. ఇదే నిజమైన విప్లవం, ఇదే నిజమైన మార్పు!