నెల రోజులుగా సాగిన “నదుల రక్షణ” అనే ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం పూర్తి చేసుకొని, ఒక సమగ్ర కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తూ “భారతీయ నదుల పునరుద్ధరీకరణ" ప్రతిపాదనల ముసాయిదాని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ బహుముఖ, బహువిధ ప్రతిపాదన ఏ విధంగా నదులకు దోహదపడుతుందో తెలుసుకోగోరే ఔత్సాహికుల కోసం ఇందులోని ముఖ్యాంశాలని క్రమంగా అందిస్తున్నాము. ముసాయిదా నాల్గవ భాగంలో, అనాదిగా భారతదేశంలో నీటివనరుల వినియోగం, అప్పటి వినియోగ పద్ధతులు సైతం ఏ విధంగా ఆయా వనరులని సంరక్షించేలా రూపొందించబడ్డాయో పరిశీలించడం జరుగుతుంది.

భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి నదుల పట్ల భక్తి భావనలను పెంపొందించి, వాటి ఉనికికి ఎంతమాత్రం భంగం వాటిల్లకుండా, నదులకు తిరిగి పూరించుకోగల సామర్ధ్యం ఉన్నంత వరకే,   అందులోని నీటిని వాడుకోవడం సమాజపు కనీస ధర్మంగా ఆచారాలని తీర్చిదిద్దింది. ప్రాణాన్ని నిలబెట్టే నీటిని అందిస్తూ నదులూ, అవి దుర్వినియోగం కాకుండా వ్యవహరిస్తూ మానవులూ, పరస్పర అన్యోన్య బంధాన్ని తరతరాలుగా నిలబెట్టుకుంటూ వచ్చారు.

పొరుగు ప్రాంతాల్లోని నదుల్లో నీరు, సాగుదల కోసం వాడుకున్నందుకుగాను మౌర్యుల కాలం నాటి రైతులు శుల్కం కూడా కట్టినట్లు దాఖలాలు ఉన్నాయి

అయితే, నానాటికీ పెరిగిపోతున్న జనాభా లేక వివిధ రంగాల్లో జరిగిన పురోగతి మాత్రమే నేటి నదుల దుస్థితికి కారణం అని ఖచ్చితంగా చెప్పలేము. అనాదిగా నీటిపారుదల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. బావులు, చెరువులు, కాలువలు మొదలు నదులపై ఆనకట్టలు సైతం కట్టించినట్లు, వాటిని ప్రయోజనాత్మకంగా నిర్వహించినట్లు ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావన ఉన్నది. సుమారు 5000 యేళ్ళ పూర్వం, హిందూ నాగరికతలో నీటి పారుదలను ఉపయోగించి ధాన్యం పండించిన ఆధారాలు మనం చూడొచ్చు. ఉపరితల నీటి వనరులు, జలాశయాలలో దాదాపు అన్ని రకాల అవసరాలకీ సరిపడేవి. చిన్న చిన్న కట్టడాలతో నదుల్లోని నీటిని సాగు నీరుగా వాడుకోడం జరిగేది. మహారాష్ట్రలోని ఒక సాగునీటి కట్టడం 3700 యేళ్ళ క్రితం నిర్మించినట్లుగా గుర్తించారు. పొరుగు ప్రాంతాల్లోని నదుల్లో నీరు, సాగుదల కోసం వాడుకున్నందుకుగాను మౌర్యుల కాలం నాటి రైతులు శుల్కం కూడా కట్టినట్లు దాఖలాలు ఉన్నాయి. క్రీ.పూ.150 నుండి క్రీ.శ. 200 వరకు ఉన్న "సంగకాలం" రోజుల్లోనే తాటాకుల మీద దీని గురించి కవిత్వం వ్రాసేవారు.

నాటి సాహిత్యంలో వరి పంటల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఆ రోజుల్లోనే తామరబరణి(తామ్రపర్ణి) నదీ తీరాల్లో వరి పండించేవారు. క్రీ.శ. 750-1300 నాటి చోళ, పాండ్య రాజుల కాలంలో తమిళనాడులో సాగునీటి వాడకం పెరిగినట్లుగా పేర్కొన్నారు. కావేరీ నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట 1800 యేళ్ళ క్రితం నాటిది, దాని ప్రాథమిక రూపకల్పన నేటికీ వాడుకలో ఉంది. మొదట్లో సాగునీటి వ్యవస్థ ప్రాధాన్యత అంతా కూడా ఏమాత్రం నీటినిల్వలు లేని పథకాల మీదే ఉండేది. తర్వాతి కాలంలో కృత్రిమ జలాశయాల మీద ఆధారపడటం మొదలైంది - తమిళనాడులో ఈరీలనీ, కర్ణాటకలో కళ్యాణీలనీ,  రాజస్థాన్‌లో బేడీలు ఇంకా మెట్లబావులు ఇలా రకరకాలుగా ఏర్పడ్డాయి. వర్షాకాలంలో అధికంగా కురిసిన నీటిని నిల్వచేయడానికి ఇవన్నీ నిర్మించేవారు, మిగిలిన నీరు యదావిధిగా నదుల్లో కలిసిపొయ్యేవి. అప్పటి ఈ ఏర్పాట్లు జలచక్రానికి ఎటువంటి నష్టమూ, హానీ జరిగే విధంగా ఉండేవి కావు.

మొదట్లో సాగునీటి వ్యవస్థ ప్రాధాన్యత అంతా కూడా ఏమాత్రం నీటినిల్వలు లేని పథకాల మీదే ఉండేది

హరప్పన్‌ల కాలం నుండి మనం సమర్ధించుకోగల రీతిలోనే నీటిని వాడుకుని, నీటి కొరత అనే భయం తెలియకుండా జీవనం సాగిస్తూ వచ్చాము. అటువంటిది ఇటీవలి కాలంలో నీటి ఎద్దడి, జలాశయాలు ఎండిపోవడం, కరువు ప్రాంతాలు ఏర్పడడం తరచూ చూస్తున్నాం. వ్యవసాయమే కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, దైనిందిన అవసరాలకే కానివ్వండి అన్నిటా సజావుగా మొదట నుంచీ నీరు అందుతూ ఉన్న క్రమంలో ఎక్కడ పొరపాటు దొర్లింది? ఎందుకు నేడు ఈ దుస్థితి ఏర్పడింది? ఇవన్నీ తెలుసుకొనే ముందు, ఒకసారి నదులు మానవ జీవితాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం అవసరం.