సద్గురుతో ముఖాముఖీ ...
 
 

ఈ మధ్య హైదరాబాద్‌లో ఓ పత్రికా విలేఖరితో జరిగిన ముఖాముఖీలో సద్గురు ఎమన్నరో  ఆ విశేషాలు తెలుసుకుందాం.....

ఆధ్యాత్మికతను ఎలా అర్థం చేసుకోవాలి?

మన కళ్లకు కనిపించేది, అనుభవంలోకి వచ్చేది మాత్రమే కాకుండా ఈ సృష్టిలో ఇంకా అనేక విషయాలున్నాయి. వీటిని అర్థం చేసుకోవటమే అసలైన ఆధ్యాత్మికత. మన పూర్వీకులు- మనకు కనిపించేది కేవలం మాయ అని నిర్వచించారు. దీని వెనక ఒక నిగూఢమైన అర్థముంది. ఉదాహరణకు మన చర్మం మీద వేల కోట్ల సూక్ష్మజీవులుంటాయి. వాటిని మనం చూడలేం. వాటిని చూడలేం కాబట్టి అవి లేనట్టా? కాదు. అవి ఉన్నాయి. వాటిని చూడటానికి పరికరాలు సృష్టించుకున్నాం. ఈ పరికరాల ద్వారా మనం వాటిని చూడగలుగుతున్నాం. ఇదే విధంగా మనకు తెలియని విషయాలను చూడాలంటే అంతర్ముఖ శోధన అవసరం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని సృష్టంగా అర్థం చేసుకోవాలి. ఏదైనా పదార్థంపై కాంతి పడినప్పుడు అది పరావర్తనం చెందితే- దానిని మన కన్ను గ్రహిస్తుంది. అందువలన మనం ఆ పదార్థాన్ని చూడగలుగుతాం. అంటే ఇక్కడ వెలుగు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కానీ నేను చెబుతున్న అంతర్ముఖ శోధనకు మూడో నేత్రం అవసరం. దీనికి భౌతికమైన కాంతి అవసరం లేదు. కాంతితో సంబంధం లేకుండా కూడా మనం అంతర్ముఖులం కావచ్చు.
మీరు చెప్పింది తార్కికంగా ఉంది. కానీ ఆధ్యాత్మికతపై ఇంత సందిగ్ధత ఎందుకు ఏర్పడుతోంది?
మనిషి సహజంగా తార్కిక జీవి. తార్కిక దృష్టి అతని అభివృద్ధికి మూల సాధనం. ప్రతి విషయాన్ని నమ్మకం, జిజ్ఞాస అనే రెండు కోణాల నుంచి చూడవచ్చు. నమ్మకం ఎక్కువ కాలం నిలబడదు. జిజ్ఞాస పరీక్షకు నిలబడుతుంది. నేటి యువతకు జిజ్ఞాస ఆయువుపట్టు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మనిషి ఈ ప్రపంచంలో మంచి పనులు చేస్తే స్వర్గం లభిస్తుందని చెబుతున్నారు. ఈ స్వర్గం కూడా అన్ని మతాల వారికి ఒకే విధంగా ఉండదు. ఒక మతానికి సంబంధించిన స్వర్గంలో నలుడు- రుచికరమైన వంటలు వండిపెడుతూ ఉంటాడు. మరో మతానికి సంబంధించిన స్వర్గంలో- ధవళ వర్ణ దుస్తులతో సుఖంగా ఉంటారు. ఇంకో మతానికి చెందిన స్వర్గంలో కన్యలు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. కాసేపు ఈ స్వర్గ సుఖాలను పక్కనపెడదాం. మనం చనిపోయిన తర్వాత శరీరాన్ని పూడ్చిపెడతారు. అలాంటప్పుడు మనం స్వర్గానికి ఎలా వెళ్తాం? ఇది ఈనాడు యువతకు ఎదురవుతున్న తొలి ప్రశ్న. దీనికి సమాధానం లభించనప్పుడు అసహనం కలుగుతుంది. ఇలా ఒక దాని తర్వాత మరొకటి తర్కానికి అందని ప్రశ్నలు ఎదురవుతున్న కొద్దీ వారికి మతంపైన, ఆధ్యాత్మికతపైన నమ్మకం పోతుంది. దేనిని నమ్మని వ్యక్తి తీవ్ర వేదనకు లోనవుతాడు. వీరికి స్వర్గం ఎక్కడో లేదు మనలోనే ఉందనే విషయాన్ని తార్కికంగా చెప్పగలగాలి. లేకపోతే 80 శాతం యువత- మత్తుపదార్థాల్లోను, ఇతర చెడు అలవాట్లలోను స్వర్గం ఉందనుకుంటారు. దీనిని ఎలా అడ్డుకోవాలనేదే మన ముందున్న పెను సవాలు.
ఈ సవాలును ఎదుర్కోవటమెలా?
నేటి యువతలో ఆధ్యాత్మికత భావనలు పెంపొందించాలి. ఈ భావనలు నమ్మకం ఆధారంగా ఉండకూడదు. శాసీ్త్రయంగా ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనం ఎలాంటి లాభాలు పొందుతున్నామో- ఆధ్యాత్మికతను ఉపయోగించి కూడా యువత లాభం పొందాలి. ఆధ్యాత్మికత ఒక మత్తులాంటిది. చాలా గొప్ప మత్తు అది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మత్తుపదార్థం ఇవ్వలేనంత మత్తు దానిలో ఉంటుంది. ఆ మత్తు వల్ల మనకు అంతులేని లాభం కూడా ఉంటుంది. అలాంటి పరికరాలను మనం తయారుచేసి అందించాలి. ఆ విధంగా మేము తయారుచేసిన ఒక సాధనమే- ఇన్నర్ ఇంజినీరింగ్. దీనిని సరైన రీతిలో సాధన చేస్తే అంతర్ముఖులవుతాం. అంతులేని ఆనందాన్ని పొందుతాం.
చాలా మంది యువతీ,యువకులు- చిన్న పరాజయాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు. దీనికి పరిష్కారమేమిటి?
మన లక్ష్యం మీద కచ్చితమైన అవగాహన ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడదు. మీకోక ఉదాహరణ చెబుతాను. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ మనం చేసే పనులను విడగొడదాం. ప్రతి పనికి ఒక లక్ష్యముంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికే ఆ పనిచేస్తాం. మనం మంచి నీళ్లు తాగుతున్నామనుకుందాం. దీని లక్ష్యం- మన దాహాన్ని తీర్చుకోవటం. దీనిలో విజయం సాధించాం కనక తృప్తి చెందుతాం. అయితే అసలైన విజయానందం ఎప్పుడు వస్తుంది? పనులన్నీ కేవలం మన కోసమే కాకుండా ఇతరుల కోసం చేసినప్పుడూ.. వాటిలో విజయం సాధించినప్పుడు నిజమైన ఆనందం కలుగుతుంది. ఈ విషయాలను గ్రహిస్తే చిన్న విషయాలకు నిరాశ చెందటమనేది ఉండదు.
ఆంధ్రప్రదేశ్‌లో మీరు స్థాపించదలుచుకున్న లీడర్‌షిప్‌ అకాడమీ గురించి చెప్పండి..
దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేశారు. ఆశ్రమానికి వందల ఎకరాలు ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. వీటిలో వాస్తవం లేదు. నేను స్థాపించాలనుకున్నది ఆశ్రమం కాదు. లీడర్ షిప్ అకాడమీ. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సమర్థుడైన నేత. ఒక సందర్భంలో నన్ను ఈ అకాడమీ గురించి అడిగారు. వెంటనే నేను ఏర్పాటు చేయటానికి అంగీకరించాను. ఈ అకాడమీని స్థాపించాలనుకోవటం వెనక ఒక బలమైన కారణముంది. మన దేశం ప్రగతి పథంలో దూసుకువెళ్లాలంటే బలమైన నాయకులు అవసరం. మిగిలిన సబ్జెక్ట్  ల మాదిరిగానే లీడర్ షిప్ అనేది ఒక సబ్జెక్ట్. అయితే పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా మన దేశంలో దీనిని బోధించే విద్యాలయాలు లేవు. ఈ కొరతను తీర్చటానికి- అంతర్జాతీయంగా పేరుపొందిన నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఒక అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్నా. ప్రతి రంగంలోను నాయకులను తయారుచేయాలనేది మా ఉద్దేశం.

ఈ అకాడమీ పని కొనసాగుతోందా?
బెంగుళూరులో దీనికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఆంధ్రప్రదేశలో కూడా ఏర్పాటు చేస్తాం. ఒకేసారి రెండు చోట్ల ఏర్పాటు చేయటం అసాధ్యమైన విషయం కాదు. ఇలాంటి అకాడమీలను అన్ని పట్టణాలలోను ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1