నిశ్చలతలోని శక్తి

 

నిశ్చలంగా ఉండటం ఇంకా వాక్ శుద్ది ద్వారా మనిషి తన జీవితంలో ఎలా ఉన్నతంగా ఎదగవచ్చనే విషయాన్ని సద్గురు చెబుతున్నారు.


శివుడు తాండవనృత్యానికి ప్రసిద్ధి. అంతకంటే ఎక్కువ ప్రసిద్ధి గాంచింది ఆయన నిశ్చల స్థితికి. పరిపూర్ణంగా నిశ్చలంగా ఎలా ఉండాలో మనం  తెలుసుకోగలిగినపుడే మన అస్తిత్వంలో పరిపూర్ణత ఉంటుంది. అదిలేనపుడు, మీరు నృత్యం చెయ్యండి, పాటపాడండి... ఇవన్నీ బాగానే ఉంటాయి గానీ, అవి ఎంతకాలం కొనసాగించగలరు? ప్రతి చేతనా కాల పరిధికి లోబడినదే. ఒక్క నిశ్చలస్థితిలో ఉన్నప్పుడే కాలానికి మీ మీద ప్రభావం ఉండదు. అది ఎందుకు అలా జరుగుతుంది అని పరిశీలించడానికి అనేక మార్గాలున్నాయి. శివ అంటే "ఏది  కానిది"... అంటే, అది అనంతంగా నిశ్చలస్థితిలో ఉండేది ... సదాశివ... అని అర్థం. మొదటగా ఈ నిశ్చలస్థితిని మీరు కదలకుండా ఉండడం ద్వారా మీ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. క్రమంగా, మీరు భౌతికంగా ఎంత జోరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ మీరు నిశ్చలంగా ఉండగలరు. మీరు మీ నిశ్చలతకు వ్యక్తీకరణగా  కార్యాలను నిర్వహిస్తారు, అంతేగానీ మీ నిర్బంధాలకు లోబదడంవల్ల కాదు. మీరు చేసేదంతా ఈ నిశ్చలతలోంచే ఉద్భవిస్తుంది. 

ఈ నిశ్చలతని మీరు మీ కుటుంబంలోకీ, మీ ఇంట్లోకీ తీసుకురావాలి. నిశ్చలస్థితిలో పెరిగే ప్రతి వస్తువూ, మీ పిల్లలతో సహా, ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. నిశ్చలస్థితి, చాలా చైతన్యవంతంగా ఉండడం... ఈ రెండూ ఈ అస్తిత్వం యొక్క రెండు పార్శ్వాలు. ఇదే యోగ లక్షణం, సృష్టి స్వభావం, ఇంకా మనం "శివ" అని పిలిచేది  నిశ్చలంగా ఉంటూనే అనుక్షణం చైతన్యవంతంగా ఉండేది.  ఒకచోట నిశ్చలంగా కూర్చోగలిగిన ప్రతి మనిషికీ ఇది సాధ్యమే – వారు కూర్చున్న ఆ స్థలమే సచేతనమైన నిశ్చలస్థితిని ప్రదర్శిస్తుంది. 


మొదటిసారిగా నేలను తవ్వి కుండలు తయారుచేసిన వారిని ఒకసారి ఊహించుకోండి. మొట్టమొదటిసారిగా వాళ్ళకి నీళ్ళు నింపుకుని ఇంటికి తీసుకుపోడానికి ఒక సాధనం దొరికింది. వాళ్ళకి అది ఎంత అద్భుతంగా అనిపించి ఉంటుంది! ఒక సామాన్యమైన కుండ వాళ్ళ జీవితాలని మార్చివేసింది. మానవ సమాజాభివృద్ధిలో ఖచ్చితంగా అదొక మైలురాయి అనడంలో సందేహం లేదు. ఈ రోజు మనం అదే మట్టిని తవ్వి వ్యోమనౌకలను నిర్మిస్తున్నాం. అదే వనరుతో ఈ రోజు మనం అనేకం చెయ్యగలుగుతున్నాం. ఇదే యంత్రవిద్య పరిణామం చెందిన తీరు. అలాగే, అదే వనరుతో మనిషి ఇంకా ఎన్నో సాధించగలడు.

సాధన, యోగ అన్నవి మానవ వ్యవస్థతతో మనం చేయగల వాటిని పరిణమింప చేసే ఇంజనీరింగ్. అందుచేతనే, మన బేసిక్ ప్రోగ్రాం కు "ఇన్నర్ ఇంజనీరింగ్" అన్నపేరు పెట్టింది. మానవశరీరం ఒక యంత్రం. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే, తను ఉన్న స్థితికంటే ఉన్నతమైన స్థితిలో పనిచెయ్యగలిగిన వ్యక్తిగా మనిషిని పరిణామం చెందించడం. మిమ్మల్ని మీరు ఎటువంటి స్థితికి పరిణామం చెందించుకోగలరంటే, ఆ స్థితిలో మీరు సృష్టికే మూలాధారంలా పనిచెయ్యగలుగుతారు.  మీరు "శివా" అని ఉచ్ఛరించినపుడు పైకి చూడనక్కరలేదు.  మీరు "శివా" అనగానే, సహజంగా మీ కళ్ళు మూతబడతాయి, ఎందుకంటే ఉన్నదంతా ఇక్కడే ఉంది. ఒక మనిషి అంతవరకూ వెళ్ళగలడు. కేవలం ఒక ప్రాణిగా, జీవించడానికి బదులు, మీరే సృష్టికి కారణహేతువు కాగలుగుతారు.  కానీ, భక్తి సాధన, లేకుండా అది సాధ్యపడదు. 

ప్రపంచంలో సఫలురైన వ్యక్తుల జీవితాలను మీరు ఒకసారి పరిశీలిస్తే... అది వ్యాపారవేత్త అయినా, సంగీతకారుడైనా, కళాకారుడైనా, మరొకరు అయినా... వాళ్ళు కేవలం అదృష్టం వల్లే సఫలురవలేదు. వాళ్ళ సఫలత వెనుక వాళ్ళుచేసిన కృషి ఎంతో ఉంది. అందరూ నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు మేలుకుని ఏదో చేసారు. చిన్న చిన్న సుఖాలకి సంతృప్తిచెందడానికి అందరూ రాజీపడిపోయినపుడు, వాళ్ళు కష్టపడ్డారు. మీరు ఎంత కష్టపడుతున్నా ఏ మార్పూ జరగటం లేదంటే, మీరు ఒక ప్రాణిగా పరిణామం చెందవలసిందే. 

       
ఈ యంత్రం మరొక యంత్రంలో భాగంగా కాకుండా, తనే ఒక స్వతంత్రమైన యంత్రంలా పరిణామం చెందవలసిందే. మనం "శివ" అని దేన్నైతే పిలుస్తున్నామో అది మరొక యంత్రంలోని భాగం కాదు... అది ఆ యంత్రానికి మూలకారణం. అది అస్తిత్వానికి మూలకారణం. అటువంటి పరిణామాన్నే ఒక యోగి అభిలషించేది. పూర్వం కంటే ఒక మోస్తరు పదునుదేరిన యంత్రభాగం కాకుండా, తనయంత్రంలోకి మరింత లోతుగా, గంభీరంగా చొచ్చుకుపోయి, ఏదో ఒకరోజు ఈ యంత్రానికి మూలకారణం అవడం.

మీ జీవితంలోకి నిశ్చలతని తీసుకువద్దామనుకుంటే, మీరు రోజులో ఎన్నిమాటలు పలుకుతారో వాటిలో సగం మాటలు మాత్రమే పలకడానికి ప్రయత్నపూర్వకంగా కృషిచెయ్యండి. దీనినే వాక్ శుద్ది అంటారు. దానివల్ల మీరుమాటాడిన మాటకి పవిత్రత చేకూరుతుంది. ఇది మరెవరికోసమో కాదు. మీ నోటినుండి ఏది బయటకు వస్తోందో అది మీకు చాలా ముఖ్యం. ఇది ఒకరకంగా ఉద్గారాల అంచనా వంటిది. మీరు ఎప్పుడూ వాడే మాటల్లో సగమే వాడుతూ, ఎప్పుడూ చెయ్యగలిగినంత పనిచేస్తున్నప్పుడు, మీలో ఆ నిశ్చలత క్రమంగా కుదురుకుంటుంది. ఇది ప్రయత్నపూర్వకమైన నిశ్శబ్దం. పూర్తిగా నిశ్శబ్దంగా ఉండడం మరొక రీతిలో జరగాలి... సరైన సాధనతో. ఏ పనీ చెయ్యకుండా అన్నిమాటలూ తొక్కిపెట్టడం ద్వారా నిశ్శబ్దత రాదు. ఎందుకంటే, పైకి రాకుండా అణచుకున్న చప్పుడు మరొకవిధంగా బుర్రలోపలికి చేరుతుంది. అది మీకు అనుభవం ద్వారా తెలుస్తుంది. 

మీరు మామూలుగా మాటాడే మాటలకంటే సగం మాటలతోనే మీరు చెప్పదలుచుకున్నది చెప్పడానికి మాటాడే ప్రతి వాక్యాన్ని నిర్మించడానికి మెలకువతో ప్రయత్నించండి,  కానీ క్రియాశీలతను అలానే కొనసాగించాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు