జాతీయ కలరి ఛాంపియన్షిప్ పోటీలలో ఈశా విద్యార్ధుల అద్భుత ప్రతిభ

Isha Students Bag Medals for Tamil Nadu at National Kalari Championships
 

ఈశాలోని కొద్దిమంది విద్యార్ధులకు శివరాత్రి తర్వాతి రోజు జాతీయ కలరి ఛాంపియన్షిప్ పోటీలు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 – 26 తేదీలలో, సెంట్రల్ స్టేడియం, తిరువనంతపురంలో జరిగిన జాతీయ కలరియపట్టు ఛాంపియన్షిప్ పోటీల్లో ఈశా సంస్కృతి మరియు ఈశా హోం స్కూల్ విద్యార్ధులు తమిళనాడును జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఇండియన్ కలరియపట్టు ఫెడరేషన్ వారు నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 15 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

10 – 21 సంవత్సరాల వయసు గల 16 మంది ఈశా విద్యార్ధులు సబ్ జూనియర్స్, జూనియర్స్ మరియు సీనియర్స్ వంటి వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. వీరు మేయపట్టు, చువడుగల్ మరియు హై కిక్ లలో మొత్తం 17 పతకాలు గెలుచుకున్నారు.

ఈశా సంస్కృతి పతకాలు:

  • బంగారం – 3
  • వెండి – 5
  • కాంస్యం – 7

ఈశా హోం స్కూల్ పతకాలు:

  • బంగారం – 1
  • కాంస్యం – 1

“ ఈ పోటీలో పాల్గొనడం మాత్రమె కాక ఒక పతకం కూడా గెలవగలగటం చాలా బాగుంది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ కలరియపట్టు క్రీడాకారులను చూడటం చాలా ఆనందాన్నిచ్చింది.” అని ఒక విద్యార్ధి తన అనుభవాన్ని పంచుకున్నారు. మరొకరు, చిన్న వయసు వారిలో సైతం పోటీ ఎంత కఠినంగా నిలిచిందో గుర్తుచేసుకున్నారు. “ నేను పోటీలో గెలుస్తానా లేదా అనే ఎటువంటి ఆలోచనా పెట్టుకోలేదు కానీ, నా పూర్తి సామర్ధ్యాన్ని పోటీలో ప్రదర్శించాలి అని మాత్రమే అనుకున్నాను. చివరి స్కోర్లు ప్రకటించిన తర్వాత నాకు ఇంకొకరితో టై ఏర్పడింది. టై ని ఛేదించేందుకు మరొకసారి పోటీని నిర్వహించారు, తర్వాత నాకు రెండవ స్థానం ప్రకటించారు. నేను నా పూర్తి సామర్ధ్యంతో పోటీలో పాలుపంచుకున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది.”

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తమ ప్రతిభ ఎలా మెరుగుపడిందనే దానిపై కొద్దిమంది విద్యార్ధులు తమ హర్షం వ్యక్తం చేశారు. “ గత సంవత్సరం పోటిలలో, నేను బాగానే శిక్షణ పొందాను, కాని అప్పుడు బహుమతి పొందలేకపోయాను. ఈ సంవత్సరం కొన్ని ఇతర కారణాల వల్ల శిక్షణకు తక్కువ సమయం కేటాయించవలసి వచ్చింది, పోటీ కూడా చాలా కష్టతరంగా జరిగింది. అయినప్పటికీ  నేను ఒక్క బహుమతినైనా సాధించాలనే దృఢ సంకల్పంతో పాల్గొన్నాను. రెండు ప్రధమ బహుమతులు సాధించటం పట్ల నాకు చాలా ఆనందం కలిగింది.” అని ఒక యువ కలరియపట్టు విజేత తెలిపారు.