అనేక రకాల కారణాల వల్ల గత కొన్ని శాతాభ్దాలుగా భారతదేశము ఒక దేశముగా, అలాగే భారతీయలు మనుషులుగా తమ సామర్ధ్యం కంటే తక్కువ స్థాయిలో  ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచినా కూడా పౌష్టిక ఆహరం, ఆరోగ్యం, విద్యలను ఇంకా సగం జనాభాకు అందించాల్సి ఉంది. కానీ గత సంవత్సరం నుంచీ భారతదేశంలో, అలాగే ప్రపంచమంతా కొత్త ఆశలు, కోరికలు చిగురించాయి. మనకు యువ శక్తి ఉంది కనుక మనల్ని మనం శ్రేయస్సు దిశగా నడిపించుకునే అవకాశం ఉంది. ఒక దేశంగా మనకు తగినంత భూమి, నీరు, పర్వతాలు గానీ లేక అడవులు గానీ లేవు – ఈ 1.25 బిలియన్ జనాభాకు సరిపోయినంత ఆకాశం కూడా లేదు. మన దగ్గర నిజంగా ఉంది మనుషులే. ఈ జనాభాను నిరక్ష్యరాస్యులుగా, ఎటువంటి లక్ష్యం లేని వారిగా, ఏ నైపుణ్యం లేని వారిగా, ఎటువంటి స్ఫూర్తి లేకుండా వదిలేస్తే, అది ఒక పెద్ద ప్రమాదమే. అదే మనం కనుక ఈ తరానికి ఒక లక్ష్యంతో, నైపుణ్యంతో, సామర్ధ్యతతో పనిచేసే స్ఫూర్తిని అందిస్తే, ఒక అద్భుతం జరుగుతుంది.

భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారే అవకాశం ఉంది. శక్తివంతమైనది అంటే శక్తివంతమైన సైన్యం అని కాదు. మన దగ్గర ఈ ప్రపంచ శ్రేయస్సుకై దిశానిర్దేశం చేయగలిగే శక్తి, జ్ఞానం, సామర్ధ్యం ఉన్నాయి. అప్పుడు సహజంగానే ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే అనాదిగా జ్ఞానం అంటే ప్రపంచమంతా తూర్పు వైపు, భారతదేశం వైపు చూసింది. ఈ స్థాన్నాన్ని మనం పోగొట్టుకోకూడదు.

ఈ సందేశంతో నేను ప్రతీ భారతీయ పౌరుడినీ ఇదే కోరుకుంటున్నాను – అది మీరు మన దేశంలో ఉన్నా లేక మరెక్కడైనా ఉన్నా సరే. ఈ అద్భుతమైన అవకాశం సాకారం అవ్వాలంటే అది కేవలం నాయకుల వల్ల మాత్రమే అవ్వదు, ప్రతీ పౌరుడు దీన్ని సాకారం చేసుకోవటంలో పాలు పంచుకోవాలి. “నేను దాన్ని ఎలా చేయగలను?” ఇప్పుడు వచ్చే ప్రశ్న ఇదే. మీ జీవితంలో మీరు ఏమి చేస్తున్నా సరే – మీరు ఒక రైతైనా లేక రాజకీయనాయకుడైనా, ఒక పోలీస్, డాక్టర్, లాయర్ లేక ఇంజనీర్- మీ ఉద్యోగం ఏదైనా సరే, అది సరిగ్గా చేయండి. ఈ దేశాన్ని నిర్మించటానికి ఇది ఒక్కటే మార్గం. గొప్ప ఉపన్యాసాల వల్ల కానీ లేక స్లోగన్ల వల్ల కానీ దేశ నిర్మాణం జరగదు. వివిధ స్థాయిల్లో ప్రతీ ఒక్కరూ వారు చేసే పనులను సరిగ్గా చేయండి, ఏది  చేసినా  సంలగ్నతతో  ఒక సరికొత్త దేశ నిర్మాణానికి దోహదపడేటట్లు చేయండి.

మనం యాభై కోట్ల ప్రజలను ఒక జీవన స్థాయి నుంచి మరొక స్థాయికి మార్చగలిగే అవకాశం కలిగి ఉన్నాము. ఇది ఒక చారిత్రాత్మిక అవకాశం. ఇటువంటి అవకాశం చాలా తక్కువ తరాలకు లభించింది. ప్రతీ భారతీయుడు దీనికై కృషి చేయాలి అనేదే నా ఆకాంక్ష. ముఖ్యంగా నేను రాజకీయ స్థాయిలో ఉన్నవారికి ఒకటి విన్నవించుకోవాలి అనుకుంటున్నాను. ఎన్నికల సమయంలో మీ రాజకీయం చేయండి. మిగతా సమయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం – అది రాష్ట్ర స్థాయిలో అయినా లేక జాతీయ స్థాయిలో అయినా – సరైన పద్ధతిలో పని చేసి ప్రజలకు లాభం చేకూర్చేటట్లు ఉండేలా చూడండి. దయచేసి మీ రాజకీయాలు ఎన్నికలకు ఒక్క నెల ముందు మాత్రమే చేయండి. మిగత సమయంలో మనలో ప్రతీ ఒక్కరిని ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు పని చేయనివ్వండి. దీనికి అవసరమైన ధైర్యం, నిబద్ధతలతో ఈ అవకాశాన్ని నిజం చేసుకునేలా చేద్దాము. ఇది జాతీయతకు సంభందించినది కాదు, ఇది మానవతకు సంభందించినది.

దేశాలు ఎక్కువుగా కుల, మత, జాతి లేక భాష ఆధారంగా నిర్మిచబడ్డాయి. కానీ మన దేశం విభిన్న కులాల, మతాల, జాతుల, భాషల సమ్మేళనము. మనది అత్యంత సంక్లిష్టమైన, ప్రత్యేకమైన దేశము. అయినా కూడా మనం 10,000 సంవత్సరాలుగా ఒక్కటే దేశంగా ఉన్నాము. రాజకీయపరంగా మనం విడదీయబడినా సంప్రదాయపరంగా మనదెప్పుడూ ఒక్క దేశమే. మనందరినీ ప్రాధమికంగా కలిపి ఉంచేది ఏమిటంటే మనది అన్వేషకుల, అంటే సాధకుల దేశము. ఈ ప్రత్యేకతను మనం కాపాడుకోవటం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఒక్కటేలా అవ్వటానికి చూస్తే మనం ఒక నమ్మే దేశంగా మారిపోతాము. జనాలు వారు ఎదో ఒకటి నమ్మటం వల్ల ఒక దగ్గర చేరతారు. కానీ ఇక్కడ, మనదేప్పుడూ అన్వేషకుల దేశం – సత్యాన్వేషణ మరియు ముక్తి. మీరు అన్వేషకులు అయితే మీరు దేనికీ కట్టుబడి ఉండరు. మీరు మీ జీవన ప్రక్రియతో మాత్రమే లయం అయ్యి ఉంటారు, మరి అది ఎప్పుడూ తప్పు అవ్వదు.

ఈ అన్వేషణంలో మనం ఏకత్వాన్ని పొందాము ఎందుకంటే ఈ  అన్వేషణ మీరో లేక నేనో కనిపెట్టింది కాదు. ఒక్క సారి మనుగడకు సంరక్షణ పొందిన తరువాత, విశ్వాస ప్రక్రియలు లేక వేటితోనైనా ఎంతగా కలుషితం అయినప్పటికీ - ప్రతి జీవి సహజంగానే సత్యం ఏమిటో తెలుసుకోవాలని, ముక్తిని పొందాలి అనుకుంటారు. ఎందుకంటే అది మానవ మేధస్సు యొక్క స్వభావం ఈ దేశం ఈ ప్రాధమిక లక్షణం ఆధారంగానే నిర్మించబడి, నిర్వహించబడుతుంది. ఈ అన్వేషణ సజీవంగా ఉన్నంతవరకూ దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. మనం ఒకేలా ఉండడానికి లేక ఒకే నమ్మకానికి మారటానికి ప్రయత్నిస్తే మనం ఒక్కటిగా ఉండలేము. ఈ 68 వ స్వతంత్ర్య దినోత్సవం రోజు భారతీయులను ఒక్కటిగా నడిపిస్తున్నది ఏమిటో అర్ధం చేసుకోవాలి అనేది నా ఆకాంక్ష మరియు దీవెన. ఈ సంప్రదాయాన్ని నిలబెట్టుకుందాము. ఈ వైవిధ్యత యొక్క అందాన్ని ఆనందించే మార్గం ఇది ఒక్కటే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు