యోగ మార్గంలో భగవంతుడిని జీవన మూలంగా కాక, జీవనమూలానికి పరమోన్నత వికాసంగా భగవంతుడిని భావిస్తారు. ఇటువంటి వికాసాన్ని ఎలా అందుకోవాలి? యోగ శాస్త్ర పరిజ్ఞానమంతా ఈ అధ్బుతమైన తోటపనిని చేయడమే అని సద్గురు విసరిస్తున్నారు.

సద్గురు: యోగ మార్గంలో పుష్పం పరమోన్నతానికి ప్రతీక, ఎందుకంటే యోగమార్గంలో భగవంతుడిని ఈ పుష్పవికాసంగా భావిస్తారు, భగవంతుడిని సృష్టికర్తగానో, జీవానికి ఆధారంగానో, మూలంగానో భావించరు. మీరు ఎక్కడినుండి వచ్చారన్న దానితో యోగాకు ఆసక్తి లేదు. మీరు ఎక్కడికి చేరబోతున్నారన్నదే దాని ఆసక్తి. ఏది సంభవమో దానిని సమీపించాలంటే ఎక్కడున్నామో అన్నది తెలిసుకోగలగాలి. మనమున్న చోట మనకు ఒక అవకాశం ఏర్పరుచుకోవాలని ఆశిస్తున్నాము. అందుకుతప్ప, మన ఆసక్తి జరుగుతున్న దానిపైనో లేక జరిగిపోయినదానిపైనో లేదు. మన ఆసక్తి ఏది జరగబోతున్నదో దాని పైనే.

విత్తనాన్ని పోషించడం

మేము జీవితాన్ని చూసే విధానం ఇతరులు చూసే విధానానికి భిన్నంగా ఉంటుంది, ఇతరులు దేనినైతో తండ్రిగా భావిస్తారో, మేము దానిని తండ్రిగా భావించము. అంటే, మా వారసత్వాన్ని కాదనుకుంటున్నాము. భగవంతుడు మన గర్భంలోనే ఉన్నట్లుగా మనము చూస్తున్నాము . దానిని పోషించినట్లయితే అది మీకు చేరుతుంది. మీరు దానిని పోషించకపోయినట్లయితే మీరు ఆ బీజంతో అలాగే ఎప్పటికీ మిగిలిపోతారు.

పండులో ఉన్న తియ్యదనం ఇంకా పౌష్టికత, పువ్వులో ఉన్న సౌందర్యం ఇంకా దాని పరిమళం, ఇవి మాత్రమే మనకు విత్తనం మీద ఉన్న ఆసక్తికి కారణాలు. అవి లేకపోతే, మనకు విత్తనం మీద ఆసక్తి ఉండేది కాదు. యోగ అని పిలువబడే విజ్ఞానము, ఆధ్యాత్మికము అనబడే ప్రక్రియ మంచి తోటపని మాత్రమే - విత్తనాన్ని సంరక్షించి దానిని పువ్వుగా మార్చగలగడమే.

అందుకే యోగులు మిమ్మల్ని తలక్రిందులుగా పెట్టాలని నిశ్చయించారు. సౌకర్యంగా ఉన్న స్థితిలో కన్నా అసౌకర్యంగా ఉన్న స్థితిలో బహుశా మీరు సత్యాన్ని మరింత బాగా అర్ధంచేసుకోగలరేమోనని. యోగ అనే సాంకేతిక జ్ఞ్యానం అన్ని స్థాయిలలోని అంతర పరివర్తనను సాధ్యపర్చగలదు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి - ఒక సాధన చేస్తున్నప్పుడు - అందులో అంతర్లీనంగా పరివర్తనకు దారితీయగల లక్షణం ఉన్నా- అదే సర్వం కాదు. మీరెలా చేస్తున్నారు అన్నది ఎంతో ముఖ్యం.

ఒక ప్రక్రియ నిజంగా ఒక నికార్సయిన ప్రక్రియగా మారాలంటే మొట్టమొదటగా మీరు మీ మనసులో దానిని ఉపయోగించుకోవాలని నిశ్చయించుకోవాలి. అప్పుడే అది మీకు ఉపయుక్తమైన ప్రక్రియగా మారుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియను షరతులులేని నిబద్ధతతో మొదలుపెట్టి కొంతకాలం చేయడం మంచిది - ఒక ఆరు నెలలు సాధనను చేయండి. ఏ విధమైన లాభం పొందనక్కరలేదు, ఊరకే చేయండి. ఆ తరువాత మీ జీవితాన్ని విశ్లేషించి చూసుకోండి, మీరు ఎంత శాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ప్రశాంతతను చవిచూస్తున్నారు అన్నది. అది మీతో ఏమి చేస్తోంది?

 

 

ఈ డిసెంబర్‌లో చెన్నైలో సద్గురుతో జరిగే ఇన్నర్ ఇంజనీరింగ్ సమాపన కార్యక్రమంలో పాల్గొనండి.

ఆంతర్యంలోని వెలుగు

స్పెయిన్ దేశంలో ఎల్ గ్రేకో అనే చిత్రకారుడు ఉండేవాడు. వసంత ఋతువులో ఒక చక్కటి ఉదయాన అతడు కిటికీలు అన్నీ మూసుకుని లోపల కూర్చుని ఉన్నాడు. అతని స్నేహితుడు వచ్చి"అన్ని తలుపులు మూసుకుని ఇలా కూర్చున్నావెందుకు? రా బయటకు వెళదాము, బయట అధ్బుతంగా ఉంది, కనీసం కిటికీలన్నా తెరువు"అన్నాడు. "నేను కిటికీలు తెరవను ఎందుకంటే నా లోని వెలుగు ప్రకాశిస్తోంది, దానిని బయట వెలుగుతో భంగం చేయడం నాకు ఇష్టం లేదు" అని సమాధానమిచ్చాడు.

అయితే, మనలోని విత్తనం పెరిగి పువ్వుగా వికసించాలంటే, మనం వెలుగు యొక్క స్విచ్ నినొక్కాలా? లేదు, అది వెలుగుతూనే ఉంది. అది రకరకాల చెత్తతో కప్పబడి దాని ఉనికిని కనపర్చలేకపోతోంది. ఒకసారి, ఈ వెలుగు ఆంతర్యంలోనుండి వెలగడం మొదలైతే, మిగిలినది సహజమైన ప్రక్రియ. అది మనం తేలికగా చేయవచ్చు. దానిని త్వరగా అందించదానికి అవసరమైన ఆంతరంగిక సాంకేతిక పరిజ్ఞానం మనదగ్గర ఉంది. ఇందుకు మనం సహజ విధానంలో వెళ్ళనవసరంలేదు, అది ఎక్కువ సమయం తీసుకోగలదు. వారికి జన్యు ఇంజనీరింగ్ ఉన్నట్లు మనకు ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంది. ఒక కొబ్బరి మొక్క ఎనిమిది సంవత్సరాలలో కాయలు కాయవలసింది ఒకటిన్నర సంవత్సరాలలోనే కాయ కాస్తోంది – అదే జన్యు ఇంజనీరింగ్. ఇన్నర్ ఇంజినీరింగ్ కూడా ఇలాగే - పది జీవిత కాలాలలో తీసుకోవలసింది ఒక జీవితకాలంలోనే సాధించగలరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు